ఆయుష్షు పోయింది
► గుండె జబ్బుతో మృతి చెందిన చిరుద్యోగి
► చికిత్సకెళ్లి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఘటన
► ప్రతి క్షణం మానసిక వేదన అనుభవించిన తీరు
► ఐదు నెలలుగా ‘ఆయుష్’లో జీతాల్లేని వైనం
► ఉద్యోగులను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు
పెద్దపెద్ద సార్లు ఒక నెల జీతం ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. అలాంటిది ఐదు నెలలుగా వేతనాల్లేవు.. పైగా ఉద్యోగ భద్రత లేదు. దానికి అనారోగ్యమూ తోడైంది. నిత్యం ఆర్థిక ఇబ్బందులు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా ఉన్న ఆమె మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఇదే సమయంలో గుండెజబ్బు రావడంతో ఆపరేషన్ కోసం బంధువులు సాయం చేశారు. ఆ తర్వాత మందులు, ఇతరత్రా వాటికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎలాగోలా అప్పు చేసి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె.. స్వగ్రామానికి తిరిగొస్తుండగా మార్గంమధ్యలో మృత్యు ఒడికి చేరింది. ఆమె మరణం చెబుతున్న గుణ‘పాఠం’ ఒక్కటే. జీతంతో ముడిపడిన నిరుపేద జీవితాలకు నెలనెలా సక్రమంగా వేతనాలివ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవకుంటే ఉద్యోగుల ‘ఆయుష్షు’ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఆత్మకూరు మండలం పి.యాలేరుకు చెందిన నిర్మలది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రజినమ్మ, తిప్పారెడ్డి దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె సంపాదనతోనే కుటుంబం గడపాల్సిన దుస్థితి. పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వృద్ధాప్యంలోని అమ్మానాన్నకు దిక్కెవరని భావించిన నిర్మల పెళ్లి కూడా చేసుకోలేదు. ఇల్లరికం కోసం అడిగితే వీరి పేదరికాన్ని చూసి ఎవరూ ముందుకు రాలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లో ఏడేళ్ల క్రితం ఎస్‌ఎన్‌ఓ(స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ)గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం రావడంతో ఇక జీవితానికి ఢోకా ఉండదని భావించింది. కుందుర్పి ప్రభుత్వ హోమియో వైద్యశాలలో పని చేస్తుండేది.
ఉద్యోగం వచ్చిన మాటే గానీ..
ఉద్యోగం వచ్చిందన్న మాటే గానీ సకాలంలో వేతనాలు అందక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఏటా ఉద్యోగానికి రెన్యూవల్ కష్టాలు వెంటాడేది. ఇదే సమయంలో తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేకపోయింది. అయినా కష్టాలను దిగమింగి ఉన్న కాడికి చూపించేది. ఈ క్రమంలో నిర్మల కూడా అనారోగ్యం పాలైంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడంతో గుండెజబ్బు వచ్చింది.
దాతల ఔదార్యంతో...
ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బంధువులు, తెలిసిన వాళ్లు సాయం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. రెండ్రోజుల కిందట ఆరోగ్యం బాగాలేక, బస్సులో వెళ్లే పరిస్థితి లేకపోయింది. బంధువులతో కలసి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ వాహనంలో వెళ్లింది. ఈ సమయంలో అక్కడ వీరు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. వాహనం దెబ్బతింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో శుక్రవారం రాత్రి మరో వాహనంలో తిరుగుపయనమైంది. శనివారం తెల్లవారుజామున పంపనూరు వద్దకు రాగానే నీళ్లు కావాలని అడగ్గా, తోడుగా ఉన్న మేనత్త వాహనం ఆపి నీళ్లిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే నిర్మల కన్నుమూసింది. కొన్నాళ్లూగా మానసిక ఒత్తిడికి గురవడంతోనే జబ్బు చేసిందని, ఈ క్రమంలోనే ఇంతటి ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా కూడా సుమారు రూ.1.20 లక్షల వరకు అప్పు చేసిందని, దాన్ని ఎలా తీర్చాలి, తల్లిదండ్రులను ఎలా పోషించాలని తరచూ ఆలోచించేదని తెలిపారు. నిర్మల(41) మృతి విషయం తెలియగానే ‘ఆయుష్’ సబ్ కంట్రోలింగ్ ఆఫీసర్ పాటిల్ ప్రభాకర్, ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు మహేశ్, జాయింట్ సెక్రటరీ సునీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రషీద్ తదితరులు పి.యాలేరుకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భరోసా లేని జీవితాలు
ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరికైనా కొండంత ధైర్యం వస్తుంది. కానీ ‘ఆయుష్’ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇందుకు బిన్నం. కొన్నాళ్లుగా ‘ఆయుష్’లో జరుగుతున్న పరిణామాలతో ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో భవిష్యత్‌ను తలచుకుని కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో వారికి భరోసా ఇచ్చే వారే కరువయ్యారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద 2008లో మొదటి విడత కింద 22 ఆయుష్ డిస్పెన్సరీలు, 2009లో రెండో విడత కింద 21 డిస్పెన్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలున్నాయి.
ఇవన్నీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే నడుస్తున్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ పోస్టులు ఉంటాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద ఉన్న వైద్యశాలల్లో 125 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. గతంలో ఏడాదికి ఒకసారి రెన్యూవల్ జరిగేది. అయితే కొన్ని నెలలుగా మూడు నెలలకు ఒకసారి మాత్రమే రెన్యూవల్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి గడువు ముగిసినా రెన్యూవల్ కాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ వరకు రెన్యూవల్ చేశారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులు రెన్యూవల్‌కు నోచుకోలేదు. ఐదు నెలలుగా వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం, కనీసం జీతం కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలపై గత నెల 27న అనంతపురంలోని రెండో రోడ్డులో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రి వద్ద యూనియన్ నాయకులతో పాటు ఉద్యోగులు ధర్నా చేశారు. అయినా చలనం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.