లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత గుండె లయతప్పుతోంది. మూడు పదుల వయస్సులోనే గుండెపోటుకు గురవుతోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వారంలో ఇద్దరు ముగ్గురు యుతీయువకులు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు సైతం పలువురు వెళ్తున్నారు. కోవిడ్ తర్వాత యువతలో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి. వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారు. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం విపరీతమైన ఒత్తిడి (స్ట్రెస్), ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలు. కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. యువతలో గుండెపోటును నివారించాలంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవే నిదర్శనం
విజయవాడ లబ్బీపేటకు చెందిన 25 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ విధుల్లోనే ఉంటాడు. ఇటీవల ఛాతీ నొప్పికి గురవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ యువకుడిని పరీక్షించి గుండెపోటుగు గురయ్యాడని నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరే కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఇటీవల 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుతో వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో కొందరు ఆస్పత్రికి చేరటప్పటికే మృత్యువాడ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కారణాలివే..
- చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురవడానికి వైద్యులు అనేక కారణాలు చెబుతున్నారు.
- చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం.
- స్మోకింగ్, ఆల్కహాల్ సేవనం ప్రధాన కారణం.
- ఫాస్ట్‌ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కూడా కారణమే.
- రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం.
- తల్లిదండ్రులు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే, వారి పిల్లలు చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
- వాతావరణ కాలుష్యం కూడా గుండెజబ్బులకు దారితీస్తోంది.
- కోవిడ్ బారిన పడిన వారి సన్నని రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి ఇరవై ఏళ్ల వారికి కూడా గుండెపోటు వస్తోంది.
ఆరోగ్య రక్షణకు ఏంచేయాలంటే..
- గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
- పనిలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి సారించాలి.
- శారీరక శ్రమ కలిగేలా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయాలి.
- తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉన్న వారు వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత హార్ట్ చెకప్ తరచూ చేయించుకోవాలి.
- ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్, నూనె ఎక్కువగా వినియోగించిన ఆహారం తీసుకోరాదు.
అప్రమత్తంగా ఉండాలి
గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల తరచుగా చూస్తున్నాం. ప్రభుత్వాస్పత్రికి సైతం అలాంటి వారు వారంలో ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. గుండెపోటుకు గురవుతున్న యువతలో 80 శాతం మందికి స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ కారణాలుగా ఉంటున్నాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. రక్తనాళాల్లో పూడికలకు స్టెంట్స్ వేయాలా లేక బైపాస్ సర్జరీ అవసరం అవుతుందా, మందులు సరిపోతాయా అనేది నిర్ణయించేందుకు ఎఫ్‌ఎఫ్‌ఆర్ పరీక్ష చేస్తాం. ఇటీవల యువతకు ఎక్కువగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ బి.విజయచైతన్య.
Comments
Please login to add a commentAdd a comment