ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి ఒక విశిష్టత ఉందని ఎవరైనా ఒప్పుకోవాలి. అదేమిటంటే చంద్రబాబు ఎవరినైతే తీవ్రంగా విమర్శిస్తారో, తన పార్టీకి ఒకప్పుడు ఎవరు ప్రబల శత్రువో వారితో రాజీ పడడంలోను, వారి విషయంలో అవకాశ వాదం ప్రదర్శించడంలోను ఆయన తర్వాతే ఎవరైనా.. ఇటీవలి జరుగుతున్న పరిణామాలు చూడండి. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు చేసిన హడావుడి చూస్తే ఆయన ఏదో టీడీపీలో పుట్టి పెరిగిన నేతేమో అనుకోవాల్సిందే.
రంగా హత్యకు గురైన ముప్పై నాలుగేళ్ల తర్వాత కూడా ఆయన ఏపీ రాజకీయాలలో ప్రముఖ స్థానంలో ఉండడం గొప్ప విషయమే. అందులోను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. కొంతకాలం క్రితం స్వయంగా టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆయన విగ్రహానికి పూలదండ వేయడం కాని, రంగా కుమారుడు రాధాను చంద్రబాబు ఆకర్షించడం కాని ఇందులో భాగమే. బలహీనవర్గాల నేతగా, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి హీరోగా గుర్తింపు పొందిన రంగా అప్పట్లో టీడీపీ హయాంలో చాలా కేసులు ఎదుర్కొన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి అవమానాలు భరించారో ఆయన సన్నిహితులకు తెలుసు. ఆయన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ అంతకుముందు హత్యకు గురయ్యారు. అప్పట్లో విజయవాడలో గ్రూపు కలహాలు ఎక్కువగా ఉండేవి. కొంతకాలం సీపీఐకి, సీనియర్ రాధాకు మధ్య తగాదా ఉండేది. ఆ తర్వాత కాలంలో అవి సామాజికవర్గ విభేదాలుగా మారాయి. రాధాకృష్ణను నగరంలోని ఒక సామాజికవర్గ ప్రముఖుడి ఆఫీస్‌లో హత్య చేశారు.
తదనంతరం రంగా ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సన్నద్దమయ్యారు. ఆ క్రమంలో అతను కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించగలిగారు. చిన్న, చిన్న తగాదాలను తీర్చడం మొదలు,పెద్ద,పెద్ద పంచాయతీలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అదే తరుణంలో పోలీసులకు పోటీ వ్యవస్థను నడిపారన్న అభిప్రాయం ఉండేది. కొంతమందికి తమ సమస్య పరిష్కారం కావాలంటే రంగాను ఆశ్రయిస్తే చాలనే దశ వచ్చింది. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండేది. దాంతో ఆయనకు శత్రువులు కూడా బలంగానే తయారయ్యారు. అప్పట్లో దేవినేని గాంధీ అనే మరో యువనేత రంగాకు పోటీగా మారారు.
దాంతో రెండు వర్గాల మద్య రణరంగంగా పరిస్థితి ఉండేది. కొన్ని హత్యలు కూడా జరిగేవి. కాలేజీ యూనియన్ ఎన్నికలలో చెరో సంస్థను ఏర్పాటు చేసుకుని విద్యార్దులను ఆకర్షించేవారు. క్రమేపి అవి కులగొడవలుగా రూపాంతరం చెందాయి. ఒక దశలో విజయవాడలో స్వేచ్చగా తిరగాలంటే భయపడేవారు. దేవినేని గాంధీ హత్య తర్వాత ఆయన సోదరుడు నెహ్రూ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ రెండు వర్గాలు రాజకీయాల వైపు కూడా దృష్టి పెట్టారు. రంగా కాంగ్రెస్ వైపు ఉంటే, నెహ్రూ టీడీపీవైపు చేరారు. రంగా తొలుత కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.
అనంతరం 1985లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డితో ఈయనకు సత్సంబంధాలు ఉండేవి. దేవినేని నెహ్రూ 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. వీరిద్దరి మధ్య గొడవలు విజయవాడ, పరిసరాలలో కమ్మ, కాపు తగాదాలుగా మారాయి. అది సమాజానికి నష్టం చేసిందనే చెప్పాలి. ఎమ్మెల్యేగా రంగా పలు ఆందోళనలు చేపట్టేవారు. కాంగ్రెస్‌లో వర్గ కలహాలను తట్టుకుని ఆయన నిలబడ్డారు. ఒక వైపు రాజకీయం, మరో వైపు కులం కలగలిసిపోయి విజయవాడలో వాతావరణం అప్పట్లో బాగా కలుషితం అయింది.
ఆ రోజుల్లో ఈనాడు అధినేత రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అది రంగాను పరోక్షంగా ఉద్దేశించి తీసిందేనని అప్పట్లో అనుకునేవారు. తెలుగుదేశం వారు ప్రస్తుతం రంగా వారసత్వాన్ని రాజకీయంగా వాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అలాగే అప్పట్లో ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన ఈనాడు మీడియా కాని, టీడీపీకి మద్దతు ఇచ్చే ఇతర మీడియా కాని రంగాను చాలా గొప్ప వ్యక్తిగా ప్రొజెక్టు చేసి టీడీపీకి రాజకీయంగా లబ్ది చేకూర్చాలని వ్యూహరచన చేయడం మారిన పరిస్థితులకు దర్పణం పడుతుంది.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును కుట్రపూరితంగా పదవి నుంచి దించేయడమే కాకుండా, ఆయన వద్ద నుంచి పార్టీని కూడా చంద్రబాబు లాగేసుకున్న సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎన్టీఆర్ పదవి పోగొట్టుకుని కుములుతున్న రోజులలో చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనను అవమానించడానికి వెనుకాడలేదు. ఆ బాధతో ఎన్టీఆర్ కన్నుమూశాక వెంటనే ఎన్టీఆర్ వారసులం తామే అంటూ ఆయన విగ్రహానికి ముందుగా దండలు వేసిందీ వారే. ఆ ఘట్టాలను గమనించినవారికి ఇప్పుడు రంగా వారసత్వం ద్వారా కాపు సామాజికవర్గ ఓట్లను పొందాలన్న టీడీపీ వ్యూహాలను అర్దం చేసుకోవడం కష్టం కాదు.
1988 డిసెంబర్‌లో రంగా తన ఇంటికి సమీపంలో రాఘవయ్య పార్కు వద్ద పేవ్‌మెంట్‌పై దీక్షకు దిగారు. ఆయన కూడా తనను టీడీపీ వారు బతకనివ్వరమోనని అనుమానిస్తుండేవారట. రోడ్డుపై దీక్షలో ఉన్న రంగాను ఇంతకన్నా మంచి అవకాశం రాదని భావించిన ప్రత్యర్ది టీడీపీ వర్గం తెల్లవారు జామున దారుణంగా హత్య చేసింది. ఆ వార్త ఏపీలో ముఖ్యంగా కోస్తా జిల్లాల అంతటా దావానలంలా వ్యాపించింది. ఎక్కడకక్కడ హింస చెలరేగింది. ఇది రాజకీయ తగాదానో, కుల తగాదానో తెలియనంతగా దాడులు జరిగాయి. ఈనాడు పత్రిక ఆఫీస్‌తో సహా అనేక సంస్థలు, వ్యాపారాలు, వ్యక్తులు, ఇళ్లు టార్గెట్ అయ్యాయి. దోపిడీలు జరిగాయి. ఈ గొడవల్లో సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రవేశించాయి.
అమాయకులైన వారిని హత్య చేశారు. ఒక ప్రముఖ డాక్టర్ కూడా ఇలా బలైపోయారు. ఆ దశలో అప్పుడు జరిగిన హింస గురించి ఈనాడు పత్రిక ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. దాంతో రంగా హత్య ద్వారా ప్రజలలో ఏర్పడిన సానుభూతి పోయి, వ్యతిరేకత వస్తుందేమోనని కాంగ్రెస్ నేతలు భయపడ్డారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ హింసవార్తలు ప్రచారం చేయవద్దని కూడా అభ్యర్దించారు.అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావు స్వయంగా విజయవాడ వచ్చి రంగా ఇంటికి వెళ్లారు. ఆయన రోడ్డు మీద నిలబడి ఇంటిలోకి వెళ్లి పరామర్శించాలని అనుకోగా, రంగా సతీమణి రత్నకుమారి నిరాకరించారు. 1989లో వచ్చిన లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో ఈ హత్య, తదనంతర పరిణామాలలో తెలుగుదేశం ఘోరంగా ఓటమిచెందింది.
కోస్తా జిల్లాలలో రంగా ఎంతగా కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేసింది అప్పుడు చాలామందికి అర్దం అయింది. ఆ సమయంలోనే టీడీపీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాపు ప్రముఖుడు చేగొండి హరిరామజోగయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనే ఆ తర్వాతకాలంలో ఒక పుస్తకం రాసి, రంగాను హత్య చేయాలన్న ప్లాన్ చంద్రబాబుకు తెలిసే జరిగిందని సంచలన విషయం చెప్పారు. దానిని ఇంతవరకు టీడీపీ నేతలు ఖండించినట్లు వార్తలు రాలేదు. 1989 , 1994 ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రత్నకుమారి గెలవడానికి రంగా వారసత్వం బాగా ఉపకరించిందని చెప్పాలి. మొదటిసారి ఎన్నికయ్యాక ఆమె శాసనసభలో ఎన్.టి.ఆర్.ను అంతకన్నా చంద్రబాబు నాయుడును ఎన్ని శాపనార్దాలు పెట్టింది గుర్తుకు తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఎందుకంటే ఆ తదుపరి కాలంలో ఆమె టీడీపీకి దగ్గరవడమేనని చెప్పనవసరం లేదు. 2004 ఎన్నికలనాటికి రంగా, రత్నకుమారిల కుమారుడు రాధా కాంగ్రెస్‌లో చేరి రాజశేఖరరెడ్డి ఆశిస్సులతో ఎమ్మెల్యే అయ్యారు. కాని ఆ తర్వాత పరిణామాలలో ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. 2014 లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆయనకు మంచి గుర్తింపే వచ్చింది. కాని ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 2019 నాటికి రంగా అప్పటి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం మరో సంచలనం. అప్పట్లో పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఇందుకు రాయబారం చేశారని అంటారు.
తన తండ్రిని ఏ పార్టీవారైతే హత్య చేశారో, అదే పార్టీలో ఆయన కుమారుడిగా రాధా చేరతారని ఎవరు ఊహిస్తారు? దీంతో రంగా అభిమానులు హతాశులయ్యారు. ఇప్పుడు రాధాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రంగా కూడా తమ పార్టీవారే అన్నట్లుగా విగ్రహాలకు దండలు, వర్దంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, రాజకీయ వైచిత్రి కాక మరేమిటి? వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని , ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వంశి వంటివారు తొలినుంచి రాధాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో వైపు గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వర్దంతి నిర్వహించడానికి యత్నించగా వైసీపీవారు అడ్డుకున్నారని ఈనాడు పత్రిక తెగరాసేసింది.
అయితే వైసీపీ వారు గొడవపడలేదని , రంగా మద్దతుదారులతో రావి గొడవపడ్డారని కొడాలి నాని చెప్పారు. ఈ సందర్భంగా 1988లో రంగా హత్య తర్వాత గుడివాడలో ఆనాటి ఎమ్మెల్యే అయిన రావి శోభనాద్రి వస్త్రాల దుకాణం, ఇతర షాపులను ఆందోళనకారులు తగులపెట్టడం, రావి కుటుంబం గుడివాడ నుంచి పారిపోవడం వంటి ఘట్టాలను నాని గుర్తు చేశారు. నిజంగానే ఆ రోజుల్లో టీడీపీ నేతలు బయటకు రావడానికే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. కాని ఇప్పుడు రంగా కుటుంబీకులవల్లే ఆయన స్మృతికి అప్రతిష్ట కలుగుతోందని చెప్పక తప్పదు. వారు రంగా ఏ రాజకీయం అయితే చేశారో, ఏ టీడీపీని ఓడించాలని కృషి చేశారో, అందుకు కట్టుబడి ఉండక, టీడీపీతోనే కలవడం అంటే ఇంతకంటే దారుణం ఏమి ఉంటుందని అనుకుంటాం.
కాకపోతే పార్టీలకు అతీతంగా రంగా అభిమానులంతా మద్దతు ఇస్తున్నారని రంగా కుటుంబీకులు చెప్పుకుంటున్నా, అది ఆత్మవంచనే అవుతుందేమో! ఒకప్పుడు జూనియర్ రాధాను కలిస్తేనే చంద్రబాబు తనను తిట్టారని కొడాలి నాని వెల్లడించారు. అప్పటికి పరిస్థితి అంతే. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో దిట్ట కనుక రంగా ద్వారా రాజకీయంగా ఓట్లు పొందడానికి ఇప్పుడు రంగాపై ఆయన అభిమానులలో ఉన్న సానుభూతిని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి పరిస్థితులు తెలిసిన రంగా మద్దతుదారులు ఎవరైనా ప్రతిపక్ష టీడీపీకి మద్దతు ఇవ్వగలుగుతారా! ఈ పరిణామాలను జీర్ణించుకోగలుగుతారా?
-హితైషి
Comments
Please login to add a commentAdd a comment