మృతి చెందిన సెంట్రల్ జైల్ ఖైదీ తాతపూడి సత్యనారాయణ
రాజమహేంద్రవరం క్రైం: గుండె పోటుతో సెంట్రల్ జైల్ జీవిత ఖైదీ మృతి చెందాడు. పోలీసులు, జైలు అధికారులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన తాతపూడి సత్యనారాయణ (49) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు లేచిన సత్యనారాయణ గుండెల్లో నొప్పిగా ఉందని అనడంతో జైలులో ఉన్న వైద్యులకు చూపించారు. వారి సూచనల మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా జైలు గేటు వద్దకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మృతుడు 2017 మే నెలలో భార్య హత్య కేసులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జీవిత ఖైదీ విధించడంతో శిక్ష నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.
మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యను హత్య చేయడంతో శిక్షపడి జైలుకు వచ్చినప్పటి నుంచి కుమారులు, కుటుంబ సభ్యులు, బంధువులు పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై అస్వస్థతతో ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. జైలు అధికారులు మృతుడి కుమారుడు తాతపూడి శ్రీను కు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి బంధువులకు అప్పగించారు.
సబ్ కలెక్టర్ సమక్షంలో పంచనామా
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ సమక్షంలో సెంట్రల్ జైల్ ఖైదీ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. సబ్ కలెక్టర్ మృతుడి కుమారుడు శ్రీను, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సెంట్రల్ జైల్‌లో మృతుడు ఉన్న బ్యారక్‌లో ఉన్న ఖైదీల నుంచి వివరాలు సేకరించారు. గుండు నొప్పి వచ్చినపుడు హాస్పిటల్‌కు తరలించినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వన్‌టౌన్ ఎస్సై జుబేర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment