ఆగిన క్యాథ్‌ లబ్‌ డబ్‌ ! | Cath Lab Shortage in Guntur GGH | Sakshi
Sakshi News home page

ఆగిన క్యాథ్‌ లబ్‌ డబ్‌ !

Published Tue, Nov 13 2018 1:26 PM | Last Updated on Tue, Nov 13 2018 1:26 PM

Cath Lab Shortage in Guntur GGH - Sakshi

క్యాథ్‌ల్యాబ్‌ మూసివేసిన దృశ్యం ; క్యాథ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు జరుగుతున్న పనులు

సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో హృద్రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆపరేషన్ల కోసం ఆశగా ఎదురుచూసి నిరాశ చెందారు. సాధారణంగా గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురికావద్దంటూ వైద్యులు సూచిస్తుంటారు.. అయితే సాక్షాత్తు జీజీహెచ్‌ గుండె వైద్య విభాగంలో సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోవడం పేదల ఆరోగ్యంపై పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. వాస్తవానికి జీజీహెచ్‌లో నెలకు సుమారు 150 వరకు గుండె ఆపరేషన్లు జరుగుతుంటాయి.ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఐదు ఆపరేషన్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ప్రత్యామ్నాయం ఎక్కడ?
క్యాథ్‌ల్యాబ్‌ను ప్రైవేట్‌ సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్నాయి. అయితే జీజీహెచ్‌ అధికారులుగానీ, ప్రైవేట్‌ సంస్థ ప్రతిని«ధులుగానీ గుండె వైద్య విభాగంలోని రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్మరించారు. దీంతో దుమ్ము, ధూళి రావడంతో గుండె వైద్య విభాగంలోని రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు సైతం సోమవారం జరగాల్సిన గుండె ఆపరేషన్‌లు నిలిపివేసి క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌లపై దుమ్ము పడకుండా బట్టలతో కప్పి ఉంచారు. కొత్త క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌ ఏర్పాటు చేసే వరకూ గుండె ఆపరేషన్‌లు నిలిచిపోతాయంటూ వైద్యులు అంటుంటే, చిన్న రిపేరు వల్ల సోమవారం గుండె ఆపరేషన్‌లు నిలిచిపోయాయని, మంగళవారం నుంచి యథావిధిగా ఆపరేషన్‌లు జరుగుతయంటూ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. అధికారులు, వైద్యులు విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ఉదయం నుంచి ఎదురుచూపు..
గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌కు మరో రెండేళ్లు కాలపరిమితి ఉన్నప్పటికీ దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్‌ జరుగుతుందనే కారణంతో రోగులు ఉదయం నుంచి ఏమీ తినకుండా వేచి చూస్తున్న తరుణంలో ఆపరేషన్‌ నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించడం వారిని విస్మయానికి గురిచేసింది. అయితే మంగళవారం అయినా ఆపరేషన్‌లు జరుగుతాయా? అనేదానిపై వైద్యుల నుంచి స్పష్టత కొరవడింది.

ప్రైవేటు పరం చేయడంతో..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు వైద్యాన్ని ప్రొత్సహిస్తూ రోగులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సహృదయ, ఉన్నతి ఫౌండేషన్‌ వంటి సంస్థల మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేయాలనే తలంపుతో వస్తే మంచి జరుగే అవకాశం ఉన్నప్పటికీ అధిక శాతం మంది వ్యాపారం కోసం వస్తూ నిరుపేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా జీజీహెచ్‌లో ఎమ్మారై స్కాన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తొలుత నిధులు మంజూరు చేసినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు  కమీషన్‌ల కోసం  దాన్ని నిలిపివేయించి  పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చేశారు.  ప్రైవేటు ఏజెన్సీ కావడంతో మొదటల్లో ఓపీలో స్కానింగ్‌కు రూ. 2వేల వరకు వసూలు చేశారు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేని నిరుపేద రోగులకు సైతం ఓపీలో స్కానింగ్‌ సేవలు ఉచితంగా అందడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్‌ను సైతం ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన లక్ష్మీ ఆరుష్‌ హెల్త్‌ కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఉన్న క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌ కాలపరిమితి 2020 వరకు ఉన్నప్పటికీ దాన్ని తొలగించి హడావుడిగా క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వానికే తెలియాలి. క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై అటు వైద్యులు, ఇటు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి యథావిధిగాఆపరేషన్‌లు..
జీజీహెచ్‌ గుండె వైద్య విభాగంలో క్యాథ్‌ల్యాబ్‌ మిషన్‌ రిపేరు రావడంతో సోమవారం గుండె ఆపరేషన్‌లు నిలిచిపోయాయి. ఇప్పటికే  ఇంజినీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా గుండె ఆపరేషన్‌లు నిర్వహిస్తాం. ప్రైవేటు సంస్థ  క్యాథ్‌ల్యాబ్‌మిషన్‌ ఏర్పాటు చేసే వరకు జీజీహెచ్‌ క్యాథ్‌ల్యాబ్‌మిషన్‌ ద్వారా రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఆపరేషన్‌లు చేస్తాం.  
–డాక్టర్‌ రాజునాయుడు,జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement