cath lab
-
సర్కారు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
గాంధీఆస్పత్రి: ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.11,440 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రూ.23 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్ మిషన్, క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణలోని ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురైతే.. కేసీఆర్ ప్రభుత్వం నగరం నలుదిక్కులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందన్నారు. త్వరలో గాంధీ, పేట్లబురుజు (హైదరాబాద్), వరంగల్ ఆస్పత్రుల్లో రూ.7.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 259 బస్తీ దవాఖానాలు ఉండగా, కొత్తగా 91 దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన డైట్‌క్యాంటిన్ నిర్మాణం, 20వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్‌లనూ హరీశ్‌రావు ప్రారం భించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచింది చాంతాడు... తగ్గించింది బెత్తెడు పెట్రో ధరలను చాంతాడంత పెంచి, బెత్తెడు తగ్గించి తామే తగ్గించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014 మార్చిలో డీజిల్‌పై సెస్సు రూ.3.46 ఉండగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.31కి పెంచేశారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. -
రోగులకు ఊరట
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో అత్యాధునిక వైద్య యంత్రాలు క్యాథ్‌ల్యాబ్, ఎమ్మారై స్కానింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మెహమూద్‌ఆలీలతో కలిసి వైద్య శాఖ హరీష్‌రావు వీటిని ప్రారంభిస్తారని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. గాంధీ రేడియాలజీ, కార్డియాలజీల్లో 2010లో ఏర్పాటు చేసిన ఎమ్మారై, క్యాథ్‌ల్యాబ్‌లు కాలపరిమితి ముగియడంతో తరచూ మొరాయిస్తున్నాయని ఆస్పత్రి పాలనాయంత్రాంగం విజ్ఞప్తికి మంత్రి హరీష్‌రావు స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో రూ.9.5 కోట్లతో ఎమ్మారై స్కానింగ్, రూ.13.5 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ను కొనుగోలు చేశారు. కరోనా లాక్డౌన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో ఆయా యంత్ర విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి కావడంలో జాప్యం ఏర్పడింది. మంత్రి ఆదేశాల మేరకు జర్మనీ, జపాన్ దేశాల నుంచి వాయు మార్గంలో యంత్ర విడిభాగాలను దిగుమతి చేసుకుని, నిరుపేద రోగులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
తొలి క్యాథ్‌ల్యాబ్ ఖమ్మంలో..
సాక్షి, హైదరాబాద్: గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం మొదటిసారిగా జిల్లాల్లో ఏర్పాటు కానుంది. శుక్రవారం ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్‌ల్యాబ్ ఇదే. త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్ బోధనాసుపత్రులకు రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్, గాంధీల్లోనే ఈ సేవలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్లు ఖర్చు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌ల్లో గుండె జబ్బుల పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి. -
పేదోడి గుండెకు భరోసా
గుంటూరు మెడికల్: కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పతి గుండె వైద్య విభాగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. కార్డియాలజీ పీజీ వైద్యులు పేద రోగులకు అందుబాటులో ఉండి నిరంతరం గుండె వైద్యసేవలను అందిస్తున్నారు. జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌లో అన్ని రకాల గుండె జబ్బులకు ఆధునిక వైద్య పద్ధతులు ఉపయోగించి ఆపరేషన్లు పూర్తిచేస్తూ పేదోళ్ల గుండెకు కార్డియాలజీ వైద్యులు అభయాన్ని ఇస్తున్నారు. మనిషి శరీరంలో గుండె కీలకం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది.లబ్‌డబ్ మంటూ నిరంతరం కొట్టుకుంటూ ఉండే గుప్పెడంత గుండె కొద్దిసేపు విశ్రమిస్తే ప్రాణాలు గాల్లో కలిసినట్లే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెకు వైద్యం కూడా చాలా ఖరీదుతో కూడుకున్నదే. గతంలో కేవలం కొద్ది రకాల గుండె వ్యాధులకు మాత్రమే జీజీహెచ్ గుండె వైద్యవిభాగంలో సేవలు లభించేవి. ఆపరేషన్లు చేయాలంటే హైదరాబాద్‌కు రిఫర్ చేసేవారు. నేడు మెట్రోపాలిటన్ నగరాల్లో లభించే కార్డియాలజీ వైద్యసేవలన్నీ జీజీహెచ్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. అందిస్తున్న వైద్యసేవలు క్యాథ్‌ల్యాబ్‌లో గుండెలో రక్తనాళాలు మూసుకుపోయి గుండె నొప్పితో బాధపడేవారికి యాంజి యోగ్రామ్ పరీక్ష చేసి బైపాస్ ఆపరేషన్ చేయాలో వద్దో నిర్ణయిస్తారు. గుండె రక్త నాళాలు మూసుకున్న వారికి మూసుకున్న రక్తనాళంలో ప్లాస్టిక్ గొట్టం(యాంజీయోప్లాస్టీ) స్టెంట్ వేస్తారు. గుండె సరిగా కొట్టుకోని వారికి పేస్‌మేకర్(తాత్కాలిక, శాశ్వత)ని అమరుస్తారు. గుండె కవాటాల సమస్యలు ఉన్నవారికి ఇక్కడ పీబీఎంవీ, పీబీవీపీ వైద్య పద్ధతిలో వైద్యం చేస్తారు. చిన్న పిల్లల్లో గుండెలో రంధ్రాలు పూడిపోకపోతే వాటిని మూసివేసే ఆపరేషన్లు(ఏఎస్డీ, వీఎస్డీ క్లోసర్) చేస్తారు. కాళ్లు ,చేతుల్లో రక్తనాళాలకి కూడా ప్లాస్టిక్ గొట్టాలు వేస్తారు. వైద్య సేవలు పొందాలంటే... జీజీహెచ్‌లో లభించే గుండె వైద్య సేవలు పొందాలనుకునే వారు అవుట్ పేషెంట్ విభాగంలోని 10 నంబర్ గదిలో సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు వైద్య సేవలు పొందవచ్చు. అక్కడ వైద్యులు ఈసీజీ, టుడి ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ లాంటి గుండెజబ్బు నిర్ధారణ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి ఇన్‌పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. ఇన్‌పేషేంట్ విభాగంలో(డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్)లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినవారిని ఓపీకి తీసుకెళ్లకుండా నేరుగా వార్డులోకి తీసుకురావచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీకార్డు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి క్యాథ్‌ల్యాబ్‌లో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే గుండె వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. కార్డు లేనివారికి సైతం సీఎమ్సీఓ ఆఫీసు నుంచి అనుమతి పత్రం తెచ్చుకుంటే సేవలన్నీ ఉచితమే. అందుబాటులో క్యాథ్‌ల్యాబ్ సేవలు గుండెజబ్బుల వైద్య విభాగంలో గత ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటలు క్యాథ్‌ల్యాబ్ వైద్యసేవలు అందుబాటులోకి రావటంతో గుండెజబ్బు రోగులకు సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయి. గుండె ఆపరేషన్లు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీకి చెందిన అజురియన్ 7.సి అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ మిషన్‌ను ఏర్పాటుచేశా>రు. నీతి అయోగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీలో క్యాథ్‌ల్యాబ్‌ను మొట్టమొదట గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటుచేశారు. సుమారు రూ.4. 5 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునిక క్యాథ్‌ల్యాబ్‌తో 50 శాతం రేడియేషన్ తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులను అశ్రద్ధ చేయకూడదు గుండెజబ్బులను ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలి. జీజీహెచ్‌లో గుండె వైద్య సేవలన్నీ ఉచితంగా లభిస్తున్నాయి. సీనియర్ రెసిడెంట్ వైద్యులు, పీజీ వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్టులు 24 గంటలు విధుల్లోనే ఉండి సేవలందిస్తున్నారు.–డాక్టర్ కరోడి మురళీకృష్ణ,కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఆగిన క్యాథ్ లబ్ డబ్ !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో హృద్రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆపరేషన్ల కోసం ఆశగా ఎదురుచూసి నిరాశ చెందారు. సాధారణంగా గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురికావద్దంటూ వైద్యులు సూచిస్తుంటారు.. అయితే సాక్షాత్తు జీజీహెచ్ గుండె వైద్య విభాగంలో సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోవడం పేదల ఆరోగ్యంపై పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. వాస్తవానికి జీజీహెచ్‌లో నెలకు సుమారు 150 వరకు గుండె ఆపరేషన్లు జరుగుతుంటాయి.ఈ క్రమంలో సోమవారం జరగాల్సిన ఐదు ఆపరేషన్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయం ఎక్కడ? క్యాథ్‌ల్యాబ్‌ను ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్నాయి. అయితే జీజీహెచ్ అధికారులుగానీ, ప్రైవేట్ సంస్థ ప్రతిని«ధులుగానీ గుండె వైద్య విభాగంలోని రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్మరించారు. దీంతో దుమ్ము, ధూళి రావడంతో గుండె వైద్య విభాగంలోని రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు సైతం సోమవారం జరగాల్సిన గుండె ఆపరేషన్లు నిలిపివేసి క్యాథ్‌ల్యాబ్ మిషన్లపై దుమ్ము పడకుండా బట్టలతో కప్పి ఉంచారు. కొత్త క్యాథ్‌ల్యాబ్ మిషన్ ఏర్పాటు చేసే వరకూ గుండె ఆపరేషన్లు నిలిచిపోతాయంటూ వైద్యులు అంటుంటే, చిన్న రిపేరు వల్ల సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయని, మంగళవారం నుంచి యథావిధిగా ఆపరేషన్లు జరుగుతయంటూ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. అధికారులు, వైద్యులు విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి ఎదురుచూపు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న క్యాథ్‌ల్యాబ్ మిషన్‌కు మరో రెండేళ్లు కాలపరిమితి ఉన్నప్పటికీ దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ జరుగుతుందనే కారణంతో రోగులు ఉదయం నుంచి ఏమీ తినకుండా వేచి చూస్తున్న తరుణంలో ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించడం వారిని విస్మయానికి గురిచేసింది. అయితే మంగళవారం అయినా ఆపరేషన్లు జరుగుతాయా? అనేదానిపై వైద్యుల నుంచి స్పష్టత కొరవడింది. ప్రైవేటు పరం చేయడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటు వైద్యాన్ని ప్రొత్సహిస్తూ రోగులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సహృదయ, ఉన్నతి ఫౌండేషన్ వంటి సంస్థల మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవ చేయాలనే తలంపుతో వస్తే మంచి జరుగే అవకాశం ఉన్నప్పటికీ అధిక శాతం మంది వ్యాపారం కోసం వస్తూ నిరుపేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా జీజీహెచ్‌లో ఎమ్మారై స్కాన్ ఏర్పాటుకు ప్రభుత్వం తొలుత నిధులు మంజూరు చేసినప్పటికీ కొందరు ఉన్నతాధికారులు కమీషన్ల కోసం దాన్ని నిలిపివేయించి పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చేశారు. ప్రైవేటు ఏజెన్సీ కావడంతో మొదటల్లో ఓపీలో స్కానింగ్‌కు రూ. 2వేల వరకు వసూలు చేశారు. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేని నిరుపేద రోగులకు సైతం ఓపీలో స్కానింగ్ సేవలు ఉచితంగా అందడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్‌ను సైతం ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన లక్ష్మీ ఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఉన్న క్యాథ్‌ల్యాబ్ మిషన్ కాలపరిమితి 2020 వరకు ఉన్నప్పటికీ దాన్ని తొలగించి హడావుడిగా క్యాథ్ ల్యాబ్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వానికే తెలియాలి. క్యాథ్ ల్యాబ్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంపై అటు వైద్యులు, ఇటు రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి యథావిధిగాఆపరేషన్‌లు.. జీజీహెచ్ గుండె వైద్య విభాగంలో క్యాథ్‌ల్యాబ్ మిషన్ రిపేరు రావడంతో సోమవారం గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే ఇంజినీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తాం. ప్రైవేటు సంస్థ క్యాథ్‌ల్యాబ్‌మిషన్ ఏర్పాటు చేసే వరకు జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌మిషన్ ద్వారా రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఆపరేషన్లు చేస్తాం. –డాక్టర్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
క్యాథ్‌ల్యాబ్ సిటీ
* డేంజర్ జోన్లో 25 లక్షల మంది యువత.. * 80 శాతం గుండెపోట్లు 40 ఏళ్ల లోపు వారికే గోల్కొండ, చార్మినార్, హుస్సేన్‌సాగర్.. బిరియానీ, హలీం..అంటే చాలు హైదరాబాద్ సిటీ గుర్తుకొస్తుంది. కానీ కొత్తగా ఈ నగరం తన సంస్కృతి, సంప్రదాయాలు మార్చుకుని ‘క్యాథ్‌ల్యాబ్’ సిటీగా మారిపోతోంది. క్యాథ్‌ల్యాబ్ అంటే గుండెపోటుకు వైద్యమందించే పరికరాలు. వాటిని వినియోగిస్తున్నవారు పెరిగిపోతుండడంతో ఆ బాధితుల నగరంగా రికార్డుల్లోకి ఎక్కుతోందన్నమాట. అందుకే ఇది అలా మారిపోరుు ఉండొచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డా.ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ అంటున్నారు. నగరంలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 50 లక్షల మంది ఉంటే ఇప్పటికే 25 లక్షల మంది డేంజర్ జోన్లో ఉన్నారు. మరో పాతిక లక్షల మంది దానికి దగ్గరగా ఉన్నారు. గుండె పోటుకు గురయ్యే వారిలో 80 శాతం మంది 40 ఏళ్ల లోపు వారేనని వుుఖర్జీ చెబుతున్నారు. కారణాలివీ.. * విదేశాల్లో ఉన్న అనారోగ్యకర ఆహార ప్రభావం ఇప్పుడు నగరంపైనా పడుతోంది. * రెండుమూడేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువగా ఒత్తిడి అనుభవించేవారు. * ఇప్పుడు జీహెచ్ఎం లేబర్ నుంచి ఎలక్ట్రీషియన్ వరకూ ఒత్తిడిలోనే ఉంటున్నారు. దీనిక్కారణం తింటున్న తిండే. * సాధారణంగా రోజుకు మనిషికి 1500 కేలరీలతో కూడిన ఆహారం అవసరం. కానీ 2500 కేలరీలు తింటున్నారు. ఇందులో 400 కేలరీలు ఖర్చు చేయలేక పోతున్నారు. * అంతా సంపాదన, సెటిల్మెంట్మీద దృష్టి సారిస్తున్నారు. తినే ఆహారంపై చర్చ 2 శాతం కూడా సాగడం లేదు. * ఒత్తిడితో 30 ఏళ్లలోపే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి. * నికోటిన్ (పొగాకు) వాడకం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంది. ‘గుండె’ను ఎలా రక్షించుకోవాలి * రోజూ 45 నిమిషాలు వేగంగా నడవాలి. * అన్నంలో కూర కాదు. కూరలో అన్నం వేసుకుని తినే అలవాటు రావాలి. * తక్షణమే ఉప్పు, కారం, నూనె తగ్గించాలి. నూనె నెలకు ఒక మనిషికి అరకిలో చాలు. * పండ్లు..అంటే ఆపిల్ ఒక్కటే అని కాదు అన్ని రకాలవీ తీసుకోవాలి. * గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు లేని వాళ్లు రోజూ కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. * ఆలివ్ ఆయిల్ ఖరీదైనా మిగతా వాటికంటే మంచిది. * బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)కి 25 కంటే తక్కువగా ఉండాలి. * రోజూ 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి. * ఒత్తిడి నివారణకు యోగా తప్పనిసరి. వ్యాయామం కూడా అవసరమే. * గుండెజబ్బులు రాకుండా జాగ్రత్త పడేందుకు ఎలాంటి మందులూ అక్కర్లేదు.. వచ్చాక మందుల్లేకుండా మనగలగడం కష్టం. ప్రజెంటేషన్..: జి.రామచంద్రారెడ్డి