గాంధీలో ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
గాంధీఆస్పత్రి: ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.11,440 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రూ.23 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్ మిషన్, క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణలోని ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురైతే.. కేసీఆర్ ప్రభుత్వం నగరం నలుదిక్కులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందన్నారు.
త్వరలో గాంధీ, పేట్లబురుజు (హైదరాబాద్), వరంగల్ ఆస్పత్రుల్లో రూ.7.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 259 బస్తీ దవాఖానాలు ఉండగా, కొత్తగా 91 దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన డైట్‌క్యాంటిన్ నిర్మాణం, 20వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్‌లనూ హరీశ్‌రావు ప్రారం భించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెంచింది చాంతాడు... తగ్గించింది బెత్తెడు
పెట్రో ధరలను చాంతాడంత పెంచి, బెత్తెడు తగ్గించి తామే తగ్గించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014 మార్చిలో డీజిల్‌పై సెస్సు రూ.3.46 ఉండగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.31కి పెంచేశారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment