గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తల్లీబిడ్డల సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, మాతాశిశు మరణాలు తక్కువగా ఉన్న మూడో రాష్ట్రంగా నమోదు కావడం గర్వంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు.
తల్లి మరణాలు గతంలో ప్రతి లక్షకు 92 ఉంటే.. అవిప్పుడు 43కు తగ్గాయని, బిడ్డ మరణాలు 39 నుంచి 21కి తగ్గాయని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.52 కోట్లతో నిర్మించిన మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కేర్ సెంటర్‌ను, రూ.2.70 కోట్లతో ఏర్పాటు చేసిన డైట్ క్యాంటీన్ భవనాలను, జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హరీశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెలలో 72.8 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 ప్రసూతి కేంద్రాల ఆధునికీకరణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లోని గాం«దీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు 600 పడకలతో గాం«దీ, నిమ్స్, టిమ్స్ (ఆల్వాల్)ల్లో మూడు ఎంసీహెచ్ కేర్ సెంటర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఆదివారం నుంచి గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని హరీశ్‌రావు వెల్లడించారు.
ప్రస్థుతం గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణకు 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన 300 అమ్మవడి వాహనాలు రోజూ 4 వేల మంది గర్భిణులకు సేవలు అందిస్తున్నాయని వివరించారు.
ఆధునిక సౌకర్యాలతో నియోనెటల్ అంబులెన్స్‌లు
పుట్టిన ప్రతి శిశువును ప్రాణాలతో కాపాడుకునేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను అందుబాటులోకి తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ అంబులెన్సులు అత్యవసర సమయాల్లో నవజాత శిశువులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వాణిదేవి, మీర్జా రహమత్ ఆలీబేగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, జిల్లా కలెక్టర్ అనుదీప్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్య ప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప త్రి రెండు విభాగాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్లు సాధించింది. టెరిటరీ లెవెల్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐఎస్‌ఓ 9001: 2015), ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐఎస్‌ఓ 45001: 2018)లకు క్వాలిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (క్యూఆర్‌ఓ) సంస్థ ఐఎస్‌ఓ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది.
ఈ సర్టిఫికెట్ల కాలపరిమితి 2026 వరకు ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రు ల సెక్టార్‌లో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి ఆస్పత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాంధీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు గాంధీ వైద్యులు, సిబ్బంది, పాలనా యంత్రాంగ పనితీరును ప్రశంసించారు. సూపరింటెండెంట్ రాజారావు, గైనకాలజీ హెచ్‌ఓడీ సంగీత షాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లను అందించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment