శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్
మణికొండ: దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా తెలం గాణలో బీసీల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.48 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ సంవత్సరం 6,229 కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి గండిపేట మండలం కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకు ముందు ఆయన యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు. ఆయా భవనాలకు అవసరమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ సముదాయాల నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. తుది దశకు చేరుకున్న యాదవ, కురుమ సంఘాల భవనాలను మార్చి 10న ప్రారంభిస్తామన్నారు.
బీసీలకు ప్రభుత్వం అండ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు. ఇప్పటివర కు 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు బీసీల గురించి కేవలం మాటలే చెబుతాయని, తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్ సర్కారు చేతల్లో చూపిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు.
బీసీల అభ్యున్నతికి జరుగుతున్న కృషిని ఆయా కులసంఘాల నేతలు, ప్రజలు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణలో 6,229 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, బండ ప్రకాశ్, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమీషన్ సభ్యుడు ఉపేంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment