బేబి గుండె ఆగింది | Baby Died With Heart Stroke | Sakshi
Sakshi News home page

బేబి గుండె ఆగింది

Published Fri, Nov 23 2018 11:05 AM | Last Updated on Fri, Nov 23 2018 11:05 AM

Baby Died With Heart Stroke - Sakshi

మృతి చెందిన బేబి(ఫైల్‌)

అయినవారెవరూ లేకపోయినా ఉన్నత చదువులు చదువుకుని ఆదర్శంగా నిలవాలనుకున్న విద్యార్థిని బేబి ఆశ నెరవేరలేదు. అకాల మృత్యువు గుండె జబ్బు రూపంలో ఆమెను పొట్టనబెట్టుకుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఆమె గుండె జబ్బుతో పోరాడి ఓడింది. వైద్యం కోసం ఆసరాగా నిలిచిన దాతలు, అండగా నిలబడిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను శోకసంద్రంలో ముంచేస్తూ తుదిశ్వాస విడిచింది.

చిత్తూరు, చౌడేపల్లె: చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పో యి చౌడేపల్లె బాలికల వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని బేబి(15) గురువారం మృతి చెందింది. సదుం మండలం(ఎస్‌ఎం పల్లె) సిద్ధం దళితవాడకు చెందిన బేబి హాస్టల్లో ఉంటూ చౌడేపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. బేబికి నా అనేవారు ఎవరూ లేరు. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో అమ్మమ్మ తరఫు బంధువులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుండె జబ్బు ఉందని గుర్తించడంతో ఇరవై రోజుల క్రితం ఆమెను తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. స్విమ్స్‌ కార్డియాలజీ ఐసీయూలో ఆమె చికిత్స పొందుతూ వచ్చింది.

ఆస్పత్రి ఖర్చులకు కూడా లేని స్థితిలో చౌడేపల్లె ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయిని జయ చొరవతో పత్రికల్లో బేబి దీనావస్థపై కథనాలు వచ్చాయి. దీంతో దాతలు ముందుకు వచ్చారు. బేబి వైద్యం కోసం కొంత మొత్తాన్ని ఉపాధ్యాయుల ద్వారా దాతలు అందజేశారు. బేబి కోలుకొని తిరిగి పాఠశాలకు వచ్చి తమతోపాటు చదువుకోవాలని సహ విద్యార్థులు కోరుకున్నారు. అయితే వారి ఆశలు నెరవేరకనే బేబిని అకాల మృత్యువు కబళించింది. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఖిన్నులయ్యారు. బేబి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చిన్నారి ప్రాణాలను రక్షించడానికి కృషి చేసిన పుంగవం ఫౌండేషన్, ఇతర దాతలు, విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement