రజనీకాంత్‌తో త్యాగరాజన్ (ఫైల్)
పెరంబూరు: సీనియర్ దర్శక, నిర్మాత ఆర్.త్యాగరాజన్ ఆదివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 74. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో అనేక చిత్రాలను నిర్మించిన దివంగత ప్రఖ్యాత నిర్మాత చిన్నప్ప దేవర్‌కు త్యాగరాజన్ అల్లుడు అన్నది గమనార్హం. త్యాగరాజన్ ఎంజీఆర్ నటించిన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకుడిగా రజనీకాంత్‌తో తాయ్‌వీడు, అన్నై ఒర్ ఆలయం, తాయ్ మీదు సత్యం, అన్బుక్కు నాన్ అడిమై 8 చిత్రాలతో పాటు కమలహాసన్ హీరోగా రామ్‌లక్ష్మణన్, తాయ్ ఇల్లామల్ నాన్ ఇల్‌లై మూడు చిత్రాలు, విజయ్‌కాంత్‌తో నల్లనాళ్, అన్నైభూమి 3డీ, హిందీలో రజనీకాంత్, రాజేవ్‌ఖన్నాలతో రెండు చిత్రాలు అంటూ మొత్తం 35 చిత్రాలను తెరకెక్కించారు.
శివకుమార్, శ్రీప్రియ జంటగా ఆట్టుక్కార అలమేలు, వెళ్లిక్కిళమై వ్రదం చిత్రాలు ఈయన దర్శకత్వంలో రూపొందినవే. ఆట్టుక్కార అలమేలు చిత్రం తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో రీమేక్ అయ్యింది. స్థానిక పోరూర్, భారతీయార్ వీధి, కావేరి గార్డెన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న త్యాగరాజన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈయనకు భార్య సుబ్బలక్ష్మి, కొడుకు వేల్‌మురుగన్, కూతురు షణ్ముగవడివు ఉన్నారు. త్యాగరాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయానికి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వలసరవాక్కంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment