యువత ‘హృదయ’ వేదన   | Special Story On Causes Of Heart Attacks In Youth | Sakshi
Sakshi News home page

యువత ‘హృదయ’ వేదన  

Published Sat, Dec 10 2022 3:08 AM | Last Updated on Sat, Dec 10 2022 3:08 AM

Special Story On Causes Of Heart Attacks In Youth - Sakshi

నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన 20 ఏళ్ల ఏసురత్నం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్రమైన ఛాతినొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరాడు. ఈసీజీ, 2డీఎకో పరీక్షల అనంతరం అతనికి యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేశారు. అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే  నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్‌ వేసి అతని ప్రాణాలను వైద్యులు కాపాడారు.  

లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ సతీష్‌(45) గత నెలలో గుండెపోటుకు గురై మరణించారు. కోడుమూరులో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగం చేసి కూర్చుని అలాగే గుండెపోటుకు గురికావడంతో సహ ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.  .. వీరిద్దరే కాదు ఇటీవల కాలంలో మధ్యవయస్సు వారు గుండెపోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే దురలవాట్లకు లోనుకావడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మితం లేని ఆహారం వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

కర్నూలు(హాస్పిటల్‌): ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే గుండెజబ్బులు నేడు 20 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి గుండెచేతబట్టుకుని వస్తున్న వారిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారే అధికంగా ఉంటున్నారు. అంతేగాకుండా వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి వారానికి రెండు రోజుల ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటోంది. నెలలో 400 మంది వార్డులో చేరి చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. ఏటా ఐదువేల మందికి గుండె సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళనకరం.  

లక్షణాలు ఇవీ.. 
కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతిలో పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటే గుండెజబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. గుండెపోటు వచి్చన మొదటి కొద్దినిమిషాలు కీలకమైనవి.  

గుండెపోటు రావడానికి కారణాలివీ.. 
ధూమపానం, నెయ్యి వాడకం, పరగడుపున రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండటం, అధిక కొల్రస్టాల్, రక్తపోటు, శారీరక వ్యాయామం బాగా తగ్గడం, తల్లిదండ్రుల్లో గానీ, తోబుట్టువలలో గానీ ఎవ్వరికైనా గుండెపోటు వచి్చనా కానీ ముందుగానే ఈ సమస్య ఉండటం, లిపోప్రోటీన్‌–ఎ, హైపర్‌ హోమోసిస్టెమియా, హైపర్‌ కాగ్యులబుల్‌ పరిస్థితి, కొకైన్‌ వాడకం లాంటివి ఉంటే ఈ సమస్యలు వస్తాయి. ధూమపానం ఉంటే 72శాతం, అధిక కొలె్రస్టాల్‌ ఉంటే 52శాతం, కుటుంబంలో ఎవ్వరికైనా హార్ట్‌ ఎటాక్‌ చరిత్ర ఉంటే 35శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.  

హైపర్‌ హోమోసిస్టీనిమియా పెరగడమే కారణం 
రక్తంలో హైపర్‌ హోమోసిస్టీనిమియా పెరగడం వల్లే ఇటీవల కాలంలో యుక్త వయస్సులోనూ గుండెపోట్లు కేసులు పెరుగుతున్నాయి. పాశ్చాత్యులు కూరగాయలను పచి్చగానే తింటారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువగా ఉడికించడమో, ఫ్రై చే యడమో చేసి తింటారు. దీనివల్లే హైపర్‌ హోమోసిస్టీనిమియా లెవెల్స్‌ పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు కేసుల్లో 5శాతంలోపు మాత్రమే యువకులు ఉండేవారు. ఇప్పుడది 14 నుంచి 15శాతానికి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం. గుండెజబ్బులపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.  
–డాక్టర్‌ పి.చంద్రశేఖర్, కార్డియాలజి హెచ్‌వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల  

జీవనశైలిలో మార్పుల వల్లే... 
శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలె్రస్టాల్‌ శాతం పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండెజబ్బులు రావచ్చు. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా కోవిడ్‌ అనంతరం ఈ కేసులు మరింత పెరిగాయి. కోవిడ్‌ సమయంలో చాలా మంది రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయి.     

గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే... 
- మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వాకింగ్, యోగా, ధ్యానం చేయాలి. 
- శాస్త్రీయ సంగీతం వినాలి. పాత పాటల్లోని సాహిత్యం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది.   
- లిఫ్ట్‌లో వెళ్లడం కంటే మెట్లు ఎక్కడమే మేలు. సమతుల ఆహారం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. 
- నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించుకోవాలి. బయట లభించే ఫాస్ట్‌ఫుడ్స్, బేకరీ ఫుడ్స్‌కు, దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌కు దూరంగా ఉండాలి.  
- బజ్జీలు తినాల్సి వస్తే ఇంట్లోనే  చేసుకోవాలి.  
- బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. స్థూలకాయం  తగ్గించుకోవాలి.  
- వయస్సుకు తగినట్లు నిద్రపోవాలి. నిద్రతగ్గితే శరీరం రోగాలను ఆహా్వనిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement