
గుండెపోటు కారణంగా దెబ్బతిన్న గుండె కణజాలానికి వేగంగా స్వస్తత చేకూర్చేందుకు బెర్లిన్ హీల్స్ అనే జర్మనీ సంస్థ ఓ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. శరీర గాయాలు తొందరగా మానేందుకు చిన్న స్థాయి విద్యుత్తు షాక్‌లు ఉపయోగపడతాయన్న అంశం ఆధారంగా తాము ఈ పరికరాన్ని అభివృద్ధి చేశామని వియన్నా మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు డయలేటివ్ కార్డియోమయపతి అనే ఆరోగ్య సమస్య కారణంగా గుండె కణజాలం క్రమేపీ బలహీనపడుతూంటుందని... చివరిదశలో సక్రమంగా సంకోచ వ్యాకోచాలూ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని డొమినిక్ వీడెమాన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మందులు ఇవ్వడం లేదంటే పేస్‌మేకర్ వంటివి అమర్చడం మాత్రమే ప్రస్తుతం ఈ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలు. చాలా సందర్భాల్లో గుండెమార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డియాక్ మైక్రోకరెంట్ పేరుతో తాము ఉత్పత్తి చేసిన పరికరం ఎంతో ఉపయోగపడుతుందని డొమినిక్ వీడెమాన్ తెలిపారు. రెండు చిన్న గాట్లు పెట్టడం ద్వారా ఈ పరికరాన్ని గుండెపైన అమర్చవచ్చునని సూక్ష్మస్థాయి విద్యుత్తు షాక్‌లు ఇచ్చినప్పుడు కణజాలం చైతన్యవంతమై సమస్య రాకుండా ఉంటుందని వివరించారు.