మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
ఇంట్లో పెళ్లి ఉందని బంధువులందరికీ చెప్పారు.. పెళ్లి పత్రికలు పంచారు.. బంధువులంతా పెళ్లి కొడుకు ఇంటికి చేరుకున్నారు.. మరీ కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అందరు బంధువులూ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే విధి కన్నెర్ర చేసింది. పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటివరకు సంబరంగా ఉన్న వారంతా దుఖంలో మునిగిపోయారు. కన్న కొడుకు పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కాటికిపయనమయ్యాడు. గుండెపోటుతో తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నిండింది. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు పెళ్లికొడుకు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది.
సిరికొండ(బోథ్): సిరికొండ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సట్ల రాజన్న(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. రాజన్నకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. పెద్ద కొడుకు, కూతురు పెళ్లిళ్లు గతంలోనే కాగా చిన్న కొడుకు పోశెట్టి పెళ్లి ఉట్నూర్ మండలం టేకుగూడ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం 12 గంటలకు వధువు ఇంటి వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. మగపెళ్లివారు బయల్దేరడానికి సిద్ధమవుతుండగానే పెళ్లి కొడుకు తండ్రి రాజన్నకు గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు సంబరంగా ఉన్న ఆ ఇంట్లో రోదనలు ఆకాశాన్నంటాయి. ఇంటి పెద్ద మరణంతో పెళ్లిని వాయిదా వేశారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment