చీరాల: రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థుల కేకలు వినబడ్డాయి. సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు అచేతనంగా ఒరిగిపోయి ఉన్నాడు.
ఆందోళనతో.. 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు. అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు.
శనివారం యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment