baptla
-
YSRCP బాపట్ల జిల్లా అభ్యర్థుల లిస్ట్ ఇదే
బాపట్ల జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
మొనగాడు కావాలా?.. మోసగాడు కావాలా?: మంత్రి అంబటి
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. సిద్ధం సభలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పంచ్‌లతో దద్దరిల్లేలా చేశారు. సీఎం జగన్ మొనగాడు.. చంద్రబాబు మోసగాడని అన్నారు. ‘సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరు వస్తే విసిరి కొడతాం. ముగ్గురు కలిసి వస్తే విసిరి సముద్రంలో ముంచేస్తాం. 14 ఏళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఒక్కటీ లేదు. ... చంద్రబాబు రా .. కదలి రా అంటే ఎవరూ రావడం లేదు. ఎంతమందితో కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగనన్న. 14 ఏళ్లు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కిన మొసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలా?. మోసగాడు కావాలా?. ... టీడీపీ కదలి రా అంటే ఎవరూ వెళ్లడం లేదు. ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నిలబెట్టుకున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు మోసం చేశారు. ఒంటరిగా వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే దత్తపుత్రుడితో కలిసి వస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరు. వాళ్లది జెండా సభ కాదు.. జెండా ఎత్తేసే సభ. పవన్ సీఎం కావాలని కాపులు అడుగుతారని ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేశారు’ అని మంత్రి అంబటి అన్నారు. -
Heart Attack: టీచర్ గుండె ఆగింది
చీరాల: రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థుల కేకలు వినబడ్డాయి. సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు అచేతనంగా ఒరిగిపోయి ఉన్నాడు. ఆందోళనతో.. 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు. అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. శనివారం యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
Jagananna Vidya Deevena: 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, బాపట్ల: ఈనెల 11న విద్యాదీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్‌జిందాల్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. బాపట్లలోని ఇంజినీరింగ్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రాంగణాల్లో సభావేదిక ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. విజయవంతం చేయండి : మంత్రి మేరుగ నాగార్జున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యాదీవెన పథకం చాలా గొప్పదని, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన తేదీకే సంక్షేమ పథకాలను అమలు చేయటం సీఎం జగన్‌కే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్) -
బాపట్ల జిల్లా కేంద్రంలో అద్దెల దరవు..!
సాక్షి, బాపట్ల: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసింది. ఫలితంగా బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావడంతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకత స్థానం ఏర్పడింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బాపట్ల జిల్లా కేంద్రం కావడం.. జిల్లా స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అధికార యంత్రాంగం, ఉద్యోగులు రావడంతో నివాస గృహాలకు డిమాండ్ ఏర్పడింది. అద్దె ఇళ్ల కోసం అందరూ ఒకేసారి రావడంతో యజమానులు సైతం అద్దెలు ఆకాశానికి పెంచేశారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో... బాపట్ల పురపాలక సంఘ పరిధిలో దాదాపు లక్షకు పైగా జనాభా, దాదాపు 30 వేల వరకు నివాస గృహాలు, 2 వేల వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.. భౌగోళికంగా 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిన్న పట్టణ స్థాయికే పరిమితమైన బాపట్లను జిల్లా కేంద్రం చేయడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే పరిపాలన సాగిస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కొత్తగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన జనాభా అవసరాల మేర నివాస గృహాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. బదిలీలతోపాటు, ఇతరత్రా కారణాల వలన నివాస గృహలు ఖాళీ అయి ఇల్లు అద్దె బోర్డు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. వారి అవసరాలను గుర్తించిన ఇంటి యజమానులు మాత్రం అద్దెలను రెండింతలు చేసి డిమాండ్ సృష్టించారు. గతంతో పోలిస్తే... గతంలో బాపట్ల జిల్లా కేంద్రం కాకముందు సింగిల్ బెడ్రూం సదుపాయం ఉన్న నివాస గృహం అద్దె రూ.4 వేలకే దొరికేది.. అలాగే డబుల్ బెడ్రూం సదుపాయాలు ఉన్న నివాస గృహం అయితే నెల అద్దె రూ.7 వరకు ఉండేది.. అందులో పాత బడిన నివాసాలు, నిర్మించిన భవనాలకు అద్దెలు మార్పు ఉండేది.. ప్రస్తుతం గృహాలు అవే అయినా అద్దెల్లో మాత్రం మార్పు ఉంది. సింగిల్ బెడ్రూం గృహానికి రూ.7వేలు పైగా అద్దె చెబుతుండగా, డబుల్బెడ్రూం గృహానికి రూ.12 వేల వరకు అద్దె నిర్ణయించి యజమానులు చెబుతున్నారు. దీంతో అమాంతంగా పెరిగిన ఇంటి అద్దెలతో చిరుద్యోగులు హడలిపోతున్నారు. అధికారులు, ఉద్యోగులు వారి కొచ్చే నెలజీతం బట్టి నివాస గృహాలను ఎంపిక చేసుకుంటారు. నెలవారీ జీతం ఇంటి అద్దె నుంచి ఇతరత్రా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వ్యక్తగత అవసరాలు అన్నింటిని ఆ నెల జీతంతోనే సర్దుకుపోవాలి. దీంతో జీతాన్ని బట్టి నివాస గృహాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చిరుద్యోగులు మాత్రం బాపట్లలో పెరిగిన అద్దెలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెకే వేలాది రూపాయలు వెచ్చిస్తే తమ కుటుంబ అవసరాలు ఏలా తీర్చుకోవాలని మదనపడుతున్నారు. దీంతో చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నూతన జిల్లా కావడం పరిపాలన ప్రక్రియ వేగవంతం కాలేదు. మరికొన్ని రోజుల్లో పాలన పరమైన ప్రక్రియ వేగవంతమైతే ఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకాశానంటుతున్న అద్దెల భారంతో ఆందోళన చెందుతున్నారు. అద్దెలు చెల్లించడం భారంగా ఉంది బాపట్లలో జిల్లా ఏర్పాటుకు ముందు ఇంటి అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న గృహాల యజమానులు ఒక్కసారిగా ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు. గతంలో రూ. 3500 నుంచి 4000 వరకు అద్దె చెల్లిస్తే బాపట్లలో డబల్‌బెడ్‌రూమ్ కలిగిన గృహం అద్దెకు లభించేది ప్రస్తుతం డబుల్ బెడ్రూం అద్దెకు కావాలంటే రూ. 7500 నుంచి 10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికారులు స్పందించి అద్దె నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సీహెచ్ జనార్ధన్‌రావు, బాపట్ల -
సూర్యలంక బీచ్‌లో వీకెండ్ జోష్.. రాబడి కుష్
హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు. సాక్షి, బాపట్ల: వీకెండ్ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. సూర్యలంక ప్రత్యేకతలివే.. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రవాణా మార్గం.. అనుకూలం బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. కలెక్టర్ చొరవతో.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్ సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్చల్ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు. పెరిగిన ఆదాయం తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
YSR Urban Health Clinics: పట్నవాసుల శ్రేయస్సుకు పట్టం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట. వైద్యులు ఉండేవారు కాదు. వసతులు శూన్యం. ఫలితంగా పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజల ఆరోగ్యానికి సర్కారు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. హాస్పిటళ్లలో అత్యాధునిక వసతులు సమకూర్చింది. దీనికితోడు ప్రతి 25 వేల మంది ప్రజలకు ఓ ప్రాథమిక కేంద్రం ఉండాలనే సదాశయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి స్పెషాలిటీ వైద్యం అందించేలా సకల సౌకర్యాలూ కల్పించింది. ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందుతున్నాయి. గుంటూరు మెడికల్: సీఎంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(అర్బన్ పీహెచ్‌సీలు)గా మార్చారు. వీటిల్లో అన్ని వసతులనూ సమకూర్చారు. స్పెషాలిటీ వైద్యమూ అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం స్పెషాలిటీ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని కేడర్ల వైద్యసిబ్బంది నియామకాలనూ పూర్తిచేసింది. వీటిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసిబ్బంది ఉచిత సేవలు అందిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఇంటికీ పది నిమిషాల నడక దూరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో ప్రతి 25వేల జనాభాకూ ఓ కేంద్రం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 అర్బన్ పీహెచ్‌సీలను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుంటూరుకు మహర్దశ గుంటూరు నగరంలో గతంలో మంగళదాస్‌నగర్, ఎల్బీనగర్, ఐపీడీకాలనీ, శ్రీనివాసరావుతోట, ఎన్జీవో కాలనీ, మల్లికార్జునపేట, బొంగరాలబీడు, ఇజ్రాయిల్‌పేట, పాతగుంటూరు, లాంచస్టర్రోడ్, కేవీపీకాలనీ, తుఫాన్‌నగర్, గుండారావుపేలో మొత్తం 13 ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఆధునికీకరించడంతోపాటు కొత్తగా 17 అర్బన్ పీహెచ్‌సీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్.అగ్రహారం, బృందావన్గార్డెన్స్, ముత్యాలరెడ్డినగర్, రాజీవ్‌గాంధీనగర్, శారదాకాలనీ, గుంటూరువారితోట, నాజ్‌సెంటర్, లాలాపేట, సుద్దపల్లిడొంక, రెడ్డిపాలెం, గోరంట్ల, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, నల్లపాడు, చౌడవరం, ఏటుకూరు, మారుతీనగర్‌లలో కొత్త ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.80 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తిచేసింది. రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, బల్లలు, కార్యాలయ నిర్వహణ కోసం అవసరమైన బీరువాలు సమకూర్చింది. ఆపరేషన్ లైట్స్, శస్త్రచికిత్సల టేబుళ్లతోపాటు మొత్తం 104 రకాల వైద్యపరికరాలను ఈ ఆరోగ్య కేంద్రాలకు పంపింది. ప్రతికేంద్రంలో ఆపరేషన్ థియేటర్ గతంలో 50వేల నుంచి 60వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉండేది. ఇప్పుడు 25వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. కిలో మీటరు నుంచి కిలో మీటరున్నర దూరంలో పది నిమిషాలు నడవగానే వైద్యశాల వచ్చేలా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, 4వ తరగతి ఉద్యోగి ఉండేలా నియామకాలు చేపట్టింది. స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చెవి, ముక్కు, గొంతు వైద్యులు, మానసిక వ్యాధి నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ వైద్య నిపుణులనూ నియమించింది. ప్రతి కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లలోనే మైనర్ శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు చేపట్టింది. కాన్పులూ చేసేలా ప్రణాళిక... అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బందితోపాటుగా స్పెషాలిటీ వైద్యులనూ నియమించాం. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందుతున్నాయి. ఈ కేంద్రాల్లోనే కాన్పులూ చేసేలా ఆపరేషన్ థియేటర్లు నిర్మించాం. పదినిమిషాల నడక దూరంలోనే వైద్యశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభపరిణామం. – డాక్టర్ జి.శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి. ఇదో చారిత్రక ఘట్టం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా మంజూరైన 50 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఈ నిర్మాణాల పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 25వేల మంది జనాభాకు ఓ వైద్యశాల నిర్మించడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. – డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, ఎన్హెచ్ఎం డీపీఎంఓ సేవలు భేష్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థానే ఇప్పుడు వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేంద్రాల్లో సేవలు బాగున్నాయి. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మంచిమంచి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. చక్కగా చూస్తున్నారు. మందులూ ఉచితంగా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కొండూరు లలితమ్మ, ముత్యాలరెడ్డినగర్ -
పారదర్శకంగా పనిచేస్తేనే మంచిపేరు
బాపట్ల టౌన్: వలంటీర్లు పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజల మన్నన పొందగలరని కలెక్టర్ కె.విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం బాపట్ల జిల్లాలోని వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలకు ఎంపికైన వలంటీర్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పెద్దిరోజా, రెవెన్యూ డివిజనల్ అధికారి జి.రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల జెడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి పాల్గొన్నారు. -
సూర్యలంక బీచ్‌లో విషాదం
బాపట్ల(గుంటూరు): గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్రస్నానానికి వచ్చిన యువకుడు గుండెపోటుకు గురై మృతిచెందాడు. కృష్ణా జిల్లా ఎనికెపాడు గ్రామానికి చెందిన లోకేష్ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి ఆదివారం సూర్యలంక బీచ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. -
హోరాహోరీగా కర్రసాము పోటీలు
బాపట్ల : కర్రసాము రంగు టచ్‌పోటీలు ఎంతో హోరాహోరీగా గురువారం రాత్రితో ముగిశాయి. గొల్ల ఆదినారాయణ మెమోరియల్ ఆధ్వర్యంలో బుధ, గురువారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. వీరిలో వేల్పుల వెంకటేశ్వర్లు మొదటిబహుమతి, ద్వితీయ తన్నీరు శేషవెంకటశివప్రసాద్, తతీయ శవనం సాంబిరెడ్డి సొంతం చేసుకున్నారు. వీరనారాయణ, నక్కా వెంకట్రావు సొంతం చేసుకున్నారు. కమిటీ సభ్యులుగా చిల్లర వెంకటేశ్వర్లు నాయుడు, షేక్ అల్లాభక్షి, మేడిబోయిన విష్ణునారాయణరెడ్డి, ఆర్.వెంకటప్పయ్యనాయుడు, గొల్ల సుబ్రహ్మణ్యం, చెరుకూరి జయపాల్, సూర్యనారాయణరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, మన్నెం చిన్న, శవనం రాంబాబురెడ్డి, టి.యోబు వ్యవహరించారు. మొదటి బహుమతిగా రూ.10,116 విలువచేసే వెండి తోడా, రెండో బహుమతిగా రూ.5116 విలువ చేసే వెండి తోడా, మూడో బహుమతిగా రూ.3116 విలువ చేసే వెండి తోడాను అందజేశారు. బహుమతులను వేగేశన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మ చేతుల మీదుగా అందించారు.