గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట. వైద్యులు ఉండేవారు కాదు. వసతులు శూన్యం. ఫలితంగా పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజల ఆరోగ్యానికి సర్కారు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. హాస్పిటళ్లలో అత్యాధునిక వసతులు సమకూర్చింది. దీనికితోడు ప్రతి 25 వేల మంది ప్రజలకు ఓ ప్రాథమిక కేంద్రం ఉండాలనే సదాశయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి స్పెషాలిటీ వైద్యం అందించేలా సకల సౌకర్యాలూ కల్పించింది. ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందుతున్నాయి.
గుంటూరు మెడికల్: సీఎంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(అర్బన్ పీహెచ్‌సీలు)గా మార్చారు. వీటిల్లో అన్ని వసతులనూ సమకూర్చారు. స్పెషాలిటీ వైద్యమూ అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం స్పెషాలిటీ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని కేడర్ల వైద్యసిబ్బంది నియామకాలనూ పూర్తిచేసింది. వీటిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసిబ్బంది ఉచిత సేవలు అందిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఇంటికీ పది నిమిషాల నడక దూరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో ప్రతి 25వేల జనాభాకూ ఓ కేంద్రం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 అర్బన్ పీహెచ్‌సీలను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
గుంటూరుకు మహర్దశ
గుంటూరు నగరంలో గతంలో మంగళదాస్‌నగర్, ఎల్‌బీనగర్, ఐపీడీకాలనీ, శ్రీనివాసరావుతోట, ఎన్జీవో కాలనీ, మల్లికార్జునపేట, బొంగరాలబీడు, ఇజ్రాయిల్‌పేట, పాతగుంటూరు, లాంచస్టర్‌రోడ్, కేవీపీకాలనీ, తుఫాన్‌నగర్, గుండారావుపేలో మొత్తం 13 ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఆధునికీకరించడంతోపాటు కొత్తగా 17 అర్బన్ పీహెచ్‌సీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఆర్.అగ్రహారం, బృందావన్‌గార్డెన్స్, ముత్యాలరెడ్డినగర్, రాజీవ్‌గాంధీనగర్, శారదాకాలనీ, గుంటూరువారితోట, నాజ్‌సెంటర్, లాలాపేట, సుద్దపల్లిడొంక, రెడ్డిపాలెం, గోరంట్ల, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, నల్లపాడు, చౌడవరం, ఏటుకూరు, మారుతీనగర్‌లలో కొత్త ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.80 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తిచేసింది. రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, బల్లలు, కార్యాలయ నిర్వహణ కోసం అవసరమైన బీరువాలు సమకూర్చింది. ఆపరేషన్ లైట్స్, శస్త్రచికిత్సల టేబుళ్లతోపాటు మొత్తం 104 రకాల వైద్యపరికరాలను ఈ ఆరోగ్య కేంద్రాలకు పంపింది.
ప్రతికేంద్రంలో ఆపరేషన్ థియేటర్
గతంలో 50వేల నుంచి 60వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉండేది. ఇప్పుడు 25వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. కిలో మీటరు నుంచి కిలో మీటరున్నర దూరంలో పది నిమిషాలు నడవగానే వైద్యశాల వచ్చేలా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, 4వ తరగతి ఉద్యోగి ఉండేలా నియామకాలు చేపట్టింది. స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చెవి, ముక్కు, గొంతు వైద్యులు, మానసిక వ్యాధి నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ వైద్య నిపుణులనూ నియమించింది. ప్రతి కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లలోనే మైనర్ శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు చేపట్టింది.
కాన్పులూ చేసేలా ప్రణాళిక...
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బందితోపాటుగా స్పెషాలిటీ వైద్యులనూ నియమించాం. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందుతున్నాయి. ఈ కేంద్రాల్లోనే కాన్పులూ చేసేలా ఆపరేషన్ థియేటర్లు నిర్మించాం. పదినిమిషాల నడక దూరంలోనే వైద్యశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభపరిణామం.
– డాక్టర్ జి.శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి.
ఇదో చారిత్రక ఘట్టం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా మంజూరైన 50 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఈ నిర్మాణాల పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 25వేల మంది జనాభాకు ఓ వైద్యశాల నిర్మించడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం.
– డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంఓ
సేవలు భేష్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థానే ఇప్పుడు వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేంద్రాల్లో సేవలు బాగున్నాయి. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మంచిమంచి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. చక్కగా చూస్తున్నారు. మందులూ ఉచితంగా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– కొండూరు లలితమ్మ, ముత్యాలరెడ్డినగర్
Comments
Please login to add a commentAdd a comment