YSR Urban Health Clinic
-
ఆరోగ్యానికి వై‘ఎస్సార్’.. ప్రైవేటుకు దీటుగా వైద్యం
కాకినాడ సిటీ: చిన్న జబ్బు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 ఖర్చు చేయాల్సిందే. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి తరచూ రక్త పరీక్ష, మందుల ఖర్చు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసిందంటే పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పేది కాదు. ఈ దుస్థితి నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యరంగంపై ఫోకస్ పెట్టారు. పక్కా భవనాలు, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది, అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు (యూహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. ఇవి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం వంటి పట్టణాల్లో శివారు ప్రాంతాల నుంచి సైతం 10 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా యూహెచ్‌సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండగా, వీటితో పాటు జిల్లాలో కొత్తగా 23 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూహెచ్‌సీకి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు. ప్రభుత్వ సాయం మరువలేం పిల్లలు, వృద్ధులకు చిన్నపాటి జబ్బు చేస్తే.. ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. చాలా దూరం కావడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని పేద ప్రజలు ఎప్పటికీ మరువలేరు. – డి.జితేంద్రసింగ్, స్వర్ణాంధ్ర కాలనీ, కాకినాడ అన్ని రకాల చికిత్సలూ అందిస్తున్నాం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలూ అందిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబ్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక రోగులకు ఎప్పటికప్పుడు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. కొంత ఇబ్బందికరంగా ఉన్న రోగులను పర్యవేక్షణలో ఉంచుకుని, వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడిప్పుడే వీటికి అవసరమైన పరికరాలు వస్తున్నాయి. రోగులకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటంతో సత్వరం వైద్య సేవలందిస్తున్నాం. వారంలో ఒక రోజు ఇద్దరు, ముగ్గురు స్పెషలైజేషన్ చేసిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. – డాక్టర్ వి.మహేష్, పర్లోవపేట, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్, కాకినాడ ఇవీ సౌకర్యాలు ► ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్‌ను 10 గదులతో నిర్మించారు. ► ప్రతి భవనంలో 10 పడకలు, ఓపీ–1, ఓపీ–2, లేబర్ రూము, మైనర్ ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, యోగా గది, ఫార్మా గది, మినీ వార్డులు ఉన్నాయి. ► ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తారు. వీరితో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ► ప్రతి సోమవారం ఒక స్పెషలైజేషన్ వైద్యుడి సేవలు అందిస్తున్నారు. ► బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్లోనే రక్త పరీక్షలు చేస్తారు. ► అనంతరం వైద్యులు ఆ రిపోర్టులు చెక్ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు. ► ల్యాబ్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► ఎవరికైన రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ–సంజీవని యాప్ ఆయా స్పెషలైజ్డ్ డాక్టర్ల సలహా తీసుకుని, చికిత్స చేసి, మందులు అందజేస్తారు. శివారు ప్రాంతాలకు ఎంతో మేలు డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని శివారు ప్రాంత ప్రజలకు వరంలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్‌నగర్, సాంబమూర్తినగర్, రేచర్లపేట కొత్త కాకినాడ, జగన్నాథపురం, నరసింహా రోడ్డు, పప్పుల మిల్లు, పద్మనాభ నగర్, ఏటిమొగ, ముత్తానగర్, మహాలక్ష్మి నగర్, రణదీప్ నగర్, నాయకర్ నగర్, జె.రామారావుపేట, ఏసువారి వీధి, చినమార్కెట్ తదితర శివారు ప్రాంతాలకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ శివారు కాలనీల్లోని ప్రజలు గతంలో ఏదైనా చిన్నపాటి జబ్బు చేస్తే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)కి వెళ్లడానికి చాలా వ్యయప్రయాసలు పడేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లతో చేరువలోనే సత్వర వైద్య సేవలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
Andhra Pradesh: చేరువలో చికిత్స
అందిస్తున్న వైద్య సేవలు ఇలా.. ►ప్రతి వార్డుకు 2–3 కి.మీ దూరంలోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో క్లినిక్ ఉంటుంది. ►గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,920 మంది ఉద్యోగులను ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లకు మంజూరు చేసింది. నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. ►గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్‌పేషెంట్ విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ►గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శాఖ అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాలన్నీ అర్బన్ హెల్త్ క్లినిక్‌లతో పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ►పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి, అక్కడ ఈ సేవలు అందించేందుకు ఇప్పటికే వైద్య శాఖ అల్ట్రాసౌండ్ మిషన్లను కొనుగోలు చేసింది. సాక్షి, అమరావతి: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జనాభా 9 లక్షలు. టీడీపీ హయాంలో ఇక్కడ 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. అంటే సుమారు 70 వేల మందికి ఒకటన్న మాట. వీటిలోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండేది. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యలకు కూడా జీజీహెచ్కువెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. నగరంలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 17 కలిపి మొత్తంగా 30 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి. అదే విధంగా విశాఖలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 ఉన్నాయి. విజయవాడలో గతంలో 29 ఉండగా, ప్రస్తుతం 41 అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు, విశాఖ, విజయవాడ నగరాల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేరువ చేసింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో కేవలం 259 అర్బన్ ప్రిలిమినరీ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో.. పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు సర్కార్ వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. వీటిని అధిగమించి వారికి వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. 25 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడంలో భాగంగా గత టీడీపీ హయాంలో ఉన్న 259కి అదనంగా మరో 301 కేంద్రాలను కలిపి, మొత్తంగా 560 క్లినిక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. ప్రస్తుతం 542 చోట్ల వైద్య సేవలు అందుతున్నాయి. టెలీ మెడిసిన్‌తో అత్యాధునిక వైద్యం 542 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సగటున 18,970 మంది వైద్య సేవలు పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 43,10,363 మంది వైద్య సేవలు పొందారు. క్లినిక్‌లలో టెలీమెడిసిన్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ప్రజలకు ఇక్కడే లభిస్తోంది. ఇలా 7.86 లక్షల మంది టెలీ మెడిసిన్ సేవలు పొందారు. 216 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. వైద్య పరీక్షల కోసం సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, 3–పార్ట్ హెమటాలజీ అనలైజర్ సహా పలు పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత 9 నెలల్లో 7.51 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులను నేరుగా రోగుల వాట్సాప్కే పంపుతున్నారు. ఈహెచ్‌ఆర్ (ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్) విధానంలో రోగులకు అందించిన వైద్య సేవల వివరాలను వారి డిజిటల్ హెల్త్ ఖాతాల్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15.09 లక్షల మంది హెల్త్ రికార్డులను వారి డిజిటల్ హెల్త్ ఖాతాలకు అనుసంధానించారు. సొంత భవనాల నిర్మాణం క్లినిక్‌ల కోసం సొంత భవనాలు సమకూర్చడంపైనా నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న 184 సొంత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. మిగిలిన వాటి కోసం కొత్త భవనాల నిర్మాణం చేపడుతోంది. కొత్త భవనం నిర్మాణానికి రూ.80 లక్షలు, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలా రూ.374.61 కోట్లతో సొంత భవనాలను సమకూరుస్తున్నారు. నిర్మాణం పూర్తయిన 116 కొత్త భవనాలను ప్రారంభించి, వాటిల్లో సేవలు మొదలుపెట్టారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే లక్ష్యం ప్రాథమిక వైద్యం కోసం పట్టణ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను వారికి చేరువ చేస్తున్నాం. జాతీయ ప్రమాణాలతో వనరులు సమకూరుస్తున్నాం. నగర, పట్టణ ప్రజలు క్లినిక్‌లలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ త్వరలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాలకు స్కానింగ్ పరికరాలు సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 542 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో చిన్న మున్సిపాలిటీల్లో కనీసం ఒకటి, పెద్ద మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున 90 అ్రల్టాసౌండ్ స్కానింగ్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో పరికరం రూ.2.45 లక్షల చొప్పున 90 పరికరాలను రూ.2,20,50,000తో కొనుగోలు చేసింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు అందించేందుకు వీలుగా ఆయా ఆస్పత్రులు, డయగ్నోసిస్ సెంటర్లను ప్రీ–కాన్సెప్షన్, ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టం కింద రిజి్రస్టేషన్ చేయాల్సిందిగా డీఎంహెచ్ఓలందరికీ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవ్వగానే సేవలు ప్రారంభిస్తామని పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా నగరాలు, పట్టణాల్లోని గర్భిణులకు కడుపులో ఉమ్మ నీరు స్థాయి, పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె, ఇతర సమస్యలేమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వీటితో పాటు సాధారణ ప్రజలకు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కడుపునొప్పి, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీవాపు, అపెండిక్స్, ఇతర సమస్యలను నిర్ధారించవచ్చు. కాగా, విశాఖపట్నంలో 11, విజయవాడలో 8, గుంటూరులో 4, మిగతా నగరాలు, పట్టణాల్లో 3, 2, 1 చొప్పున ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. -
YSR Urban Health Clinics: పట్నవాసుల శ్రేయస్సుకు పట్టం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట. వైద్యులు ఉండేవారు కాదు. వసతులు శూన్యం. ఫలితంగా పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజల ఆరోగ్యానికి సర్కారు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. హాస్పిటళ్లలో అత్యాధునిక వసతులు సమకూర్చింది. దీనికితోడు ప్రతి 25 వేల మంది ప్రజలకు ఓ ప్రాథమిక కేంద్రం ఉండాలనే సదాశయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి స్పెషాలిటీ వైద్యం అందించేలా సకల సౌకర్యాలూ కల్పించింది. ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందుతున్నాయి. గుంటూరు మెడికల్: సీఎంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(అర్బన్ పీహెచ్‌సీలు)గా మార్చారు. వీటిల్లో అన్ని వసతులనూ సమకూర్చారు. స్పెషాలిటీ వైద్యమూ అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం స్పెషాలిటీ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని కేడర్ల వైద్యసిబ్బంది నియామకాలనూ పూర్తిచేసింది. వీటిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసిబ్బంది ఉచిత సేవలు అందిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఇంటికీ పది నిమిషాల నడక దూరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో ప్రతి 25వేల జనాభాకూ ఓ కేంద్రం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 అర్బన్ పీహెచ్‌సీలను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుంటూరుకు మహర్దశ గుంటూరు నగరంలో గతంలో మంగళదాస్‌నగర్, ఎల్బీనగర్, ఐపీడీకాలనీ, శ్రీనివాసరావుతోట, ఎన్జీవో కాలనీ, మల్లికార్జునపేట, బొంగరాలబీడు, ఇజ్రాయిల్‌పేట, పాతగుంటూరు, లాంచస్టర్రోడ్, కేవీపీకాలనీ, తుఫాన్‌నగర్, గుండారావుపేలో మొత్తం 13 ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఆధునికీకరించడంతోపాటు కొత్తగా 17 అర్బన్ పీహెచ్‌సీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్.అగ్రహారం, బృందావన్గార్డెన్స్, ముత్యాలరెడ్డినగర్, రాజీవ్‌గాంధీనగర్, శారదాకాలనీ, గుంటూరువారితోట, నాజ్‌సెంటర్, లాలాపేట, సుద్దపల్లిడొంక, రెడ్డిపాలెం, గోరంట్ల, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, నల్లపాడు, చౌడవరం, ఏటుకూరు, మారుతీనగర్‌లలో కొత్త ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.80 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తిచేసింది. రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, బల్లలు, కార్యాలయ నిర్వహణ కోసం అవసరమైన బీరువాలు సమకూర్చింది. ఆపరేషన్ లైట్స్, శస్త్రచికిత్సల టేబుళ్లతోపాటు మొత్తం 104 రకాల వైద్యపరికరాలను ఈ ఆరోగ్య కేంద్రాలకు పంపింది. ప్రతికేంద్రంలో ఆపరేషన్ థియేటర్ గతంలో 50వేల నుంచి 60వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉండేది. ఇప్పుడు 25వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. కిలో మీటరు నుంచి కిలో మీటరున్నర దూరంలో పది నిమిషాలు నడవగానే వైద్యశాల వచ్చేలా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, 4వ తరగతి ఉద్యోగి ఉండేలా నియామకాలు చేపట్టింది. స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చెవి, ముక్కు, గొంతు వైద్యులు, మానసిక వ్యాధి నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ వైద్య నిపుణులనూ నియమించింది. ప్రతి కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లలోనే మైనర్ శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు చేపట్టింది. కాన్పులూ చేసేలా ప్రణాళిక... అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బందితోపాటుగా స్పెషాలిటీ వైద్యులనూ నియమించాం. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందుతున్నాయి. ఈ కేంద్రాల్లోనే కాన్పులూ చేసేలా ఆపరేషన్ థియేటర్లు నిర్మించాం. పదినిమిషాల నడక దూరంలోనే వైద్యశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభపరిణామం. – డాక్టర్ జి.శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి. ఇదో చారిత్రక ఘట్టం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా మంజూరైన 50 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఈ నిర్మాణాల పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 25వేల మంది జనాభాకు ఓ వైద్యశాల నిర్మించడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. – డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, ఎన్హెచ్ఎం డీపీఎంఓ సేవలు భేష్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థానే ఇప్పుడు వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేంద్రాల్లో సేవలు బాగున్నాయి. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మంచిమంచి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. చక్కగా చూస్తున్నారు. మందులూ ఉచితంగా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కొండూరు లలితమ్మ, ముత్యాలరెడ్డినగర్