శ్రీకృష్ణ దేవరాయలును సత్కరిస్తున్న ఎమ్మెల్యే రోశయ్య, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు
సాక్షి, గుంటూరు : దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన పల్నాడు ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన లావు శ్రీకృష్ణ దేవరాయలుకు సోమవారం నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సత్కారం చేశారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సత్కార సభలో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు చెప్పారు.
విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి ప్రధాన అంశాలుగా చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా పల్నాడు ప్రాంత స్వరూపం మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలును శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. ఈ సందర్భంగా విశ్రాంత డీవైఈవో పి.వి.శేషుబాబు, ఏఎన్‌యూ ప్రొఫెసర్లు ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, సరస్వతి రాజు అయ్యర్‌తో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment