చికిత్స పొందుతున్న శివశంకరరావు, హారిక
తెనాలి రూరల్: ఒక్కగానొక్క కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు. అప్పులు చేసి మరీ పెళ్లికొడుకు తరఫువారు అడిగిన మేరకు లాంఛనాలు ఇచ్చారు. అయినా కొద్ది రోజులకే కుమార్తె కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీనికి తోడు చేసిన అప్పుల భారం పెరిగిపోతోంది. ఏడాదిగా కుమార్తె పుట్టింటికే పరిమితమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తలిదండ్రులు, కుమార్తె సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురూ గుళికలు తిని ఆత్మహత్యాయత్నం చేయగా, తల్లి మృతి చెందింది. తండ్రి, కుమార్తె చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటకు చెందిన చిరు వ్యాపారి విష్ణుమొలకల శివశంకరరావు భార్య నాగమణి, కుమార్తె హారికతో సహా విషపు గుళికలు తిని మంగళవారం రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. గమనించిన బంధువుల తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా నాగమణి మృతి చెందింది. శివశంకరరావు, అతని కుమార్తె హారిక ప్రాణాలతో బయటపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పాల వ్యాపారం చేసుకుని జీవించే శివశంకరరావు కొంత కాలంగా అది సక్రమంగా సాగకపోవడంతో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో టీ స్టాల్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కుమార్తె హారికకు తెనాలి బీసీ కాలనీకి చెందిన చంటి సత్యనారాయణ, చంటి సుభాషిణిల కుమారుడు సాయి గణేష్‌తో మూడేళ్ల కిందట వివాహం చేశారు. మంచి సంబంధం అని భావించి తాహతుకు మించి అప్పులు చేసి అధిక కట్నం ఇచ్చి మరీ వివాహాన్ని వైభవంగా జరిపించారు.
కొంత కాలం కుమార్తె కాపురం సక్రమంగానే ఉండగా ఆ తర్వాత ఆమైపె అత్తమామాలు, భర్త వేధింపులు అధికమయ్యాయి. అదనపు కట్నం కోసం ముగ్గురు కలిసి వేధించడంతో పాటు ఏడాది కిందట ఆమెను పుట్టింటికి పంపించి వేశారు. దీనిపై రెండు కుటుంబాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరగ్గా, పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే, పైళ్లెన కూతురు ఏడాదిగా తమ దగ్గరే ఉండటం, అల్లుడు, అత్తమామల వేధింపులు అధికమవ్వడం, అప్పుల బాధలు పెరిగిపోవడంతో మనస్తానికి గురై మంగళవారం అర్ధరాత్రి తమ ఇంట్లో ముగ్గురు కలిసి విషపు గుళికలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఘటనలో నాగమణి మృతి చెందగా శివ శంకరరావు, కుమార్తె హారికను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శివశంకరావు మాట్లాడుతూ తన కుమార్తె వివాహమైన తర్వాత అధిక కట్నం తెమ్మంటూ అల్లుడు అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని, రెండు సార్లు అబార్షన్‌లు కూడా చేయించారని ఆరోపించారు.
ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు సైతం కుమార్తెను పంపించకుండా మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయాడు. తనకు తన కుమార్తె వివాహానికి చేసిన బాకీలు తాలూకా వేధింపులు కూడా పెరిగాయని.. మధ్యవర్తులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించామన్నారు. కుటుంబ పోషణకు టీ స్టాల్ పెట్టుకుని పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నానని తనకు ఇంతకు మించిన ఆదాయం వచ్చే మార్గం కూడా లేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ దశరథరామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment