తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు
నిందితుడికి అండగా స్థానిక నాయకుడు
మతిస్థిమితం లేదని పేర్కొంటూ రాజీ యత్నాలు
తాడేపల్లి రూరల్: బతుకు దెరువు కోసం వచ్చిన కుటుంబంపై ఓ వ్యక్తి రాడ్‌తో విచక్షణారహితంగా బుధవారం సాయంత్రం దాడి చేయడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితులు, వారి బంధువుల కథనం ప్రకారం.. యూపీ నుంచి వచ్చిన వీరేంద్ర ప్రసాద్ మౌర్య, గీతా మౌర్య దంపతులు పట్టాభిరామయ్య కాలనీలో ఉంటున్నారు. వీరేంద్ర ప్రసాద్ మౌర్య సీలింగ్ పనులు చేస్తుంటాడు. నూతన సంవత్సరం కావడంతో సాయంత్రం సమయంలో సరదాగా బయటకు వెళ్లేందుకు ఇంట్లో నుంచి దంపతులు బయటకు వచ్చారు.
అదే సమయంలో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ‘మీరు ఇళ్లల్లో కూర్చోక రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారంటూ‘ రాడ్ తీసుకుని గీతా మౌర్యపై దాడికి పాల్పడ్డాడు. వీరేంద్ర ఆపేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడికి యత్నించాడు. వీరేంద్ర పారిపోయాడు. గీతా మౌర్యను కాళ్లపై వెనుక నుండి రాడ్‌తో కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత విచక్షణరహితరంగా పలుమార్లు రాడ్‌తో కొట్టి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి బంధువులు మాత్రం అతడికి మతిస్థిమితం లేదని, దాడి గురించి పట్టించుకోవద్దని, ఆసుపత్రికి వెళ్లండని ఉచిత సలహాలు ఇచ్చారు.
తీవ్రంగా గాయపడిన గీత మౌర్యను వైద్య నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్లు, తుంటి భాగం, రెండు చేతులపై తీవ్ర గాయాలు అయ్యా యి. మతిస్థిమితం లేని వ్యక్తిని ఇంట్లో ఉంచకుండా మద్యం తాగించి రోడ్లపై తిరగనివ్వడమేంటని బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక నాయకుడు ఒకరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. నిందితుడికి మతిస్థిమితం లేదని, పొరపాటు జరిగిందని అంటూ బాధిత కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment