
సిరిమానును అధిరోహించిన తాళ్లపూడి భాస్కరరావు (ఫైల్)
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానును అధిరోహించే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు(68) హుకుంపేటలో ఉన్న స్వగృహంలో శుక్రవారం కన్ను మూశారు. గురువారం రాత్రి గుండె నొప్పితో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఉమామహేశ్వరి, కుమారుడు ధనుంజయ్, కుమార్తెలు అరుణ, వాసవి ఉన్నారు. ఈయన 2009 నుంచి 2016 వరకు సిరిమానును అధిరోహించారు.
అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించేవారు. భాస్కరరావు మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలిపారు. ఈయన మృతిపై కస్పా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి వేలమూరి నాగేశ్వరరావు, గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాడిశెట్టి శాంతారావు, పైడితల్లి అమ్మవారి ఆలయ అభవృద్ధి కమిటీ ప్రతినిధి ఎంబీ సత్యనారాయణ, పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకుడు, గురుస్వాములు ఆర్‌ఎస్ పాత్రో, ఎస్.అచ్చిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.