
అనితా దాస్ మృతదేహం , అనితా దాస్ (ఫైల్ ఫోటో)
భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర నటి అనితా దాస్ (57) శుక్ర వారం మరణించారు. కొద్ది పాటి గుండెపోటుతో ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. 100కు పైబడి చిత్రాల్లో ఆమె నటించారు. తల్లి పాత్రకు ఆమె కొత్త ఒరవడి దిద్దిన నటిగా పేరొందారు. 1957వ సంవత్సరం నుంచి ఆమె చలనచిత్ర రంగంలో నటిగా వెలుగొందారు. 1975లో విడుదలైన జాజాబొరొ చిత్రం ఆమె నటనా జీవితంలో మైలు రాయిగా నిలిచింది. కృష్ణ సుధామా (1976), రామాయణ్ (1980), మా –ఓ–మమత (1980), స్వొప్నొ సాగొరొ (1983), పుఒ మోరొ కొలా ఠకురొ (1988), గొడి జణిలే ఘొరొ సుందొరొ (1994), బహుడిబే మో జొగొబొలియా (2003), సాథీరే (2004), ఓం శాంతి ఓం (2005), అమొ భిత్తొరే కిచ్ఛి ఒచ్ఛి (2010), శపథ్ (2012), అభయ్ (2017) ఆమె నటనా జీవితంలో పేరు తెచ్చిన చిత్రాలుగా నిలిచాయి.
ముఖ్యమంత్రి సంతాపం
అనితా దాస్ మరణంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్ర వారం సంతాపం ప్రకటించారు. అకాల మరణంతో వెండి తెర, బుల్లి తెర వీక్షకులు అపురూపమైన నటిని కోల్పోయారని ఆయన సానుభూతి ప్రకటించారు. ఒడియా చలన చిత్ర, టెలివిజన్ నటనా రంగానికి ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అనితా దాస్ మరణం నటనా రంగానికి తీరని లోటు అంటూ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు చలన చిత్ర రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆమె మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు అంటూ కన్నీరు కార్చారు
Comments
Please login to add a commentAdd a comment