
గుండెపోటు కారణంగా నష్టపోయిన కండరాలకు చికిత్స కల్పించేందుకు మూలకణాల ద్వారా అభివృద్ధి చేసిన గుండె కండరకణాలు ఉపయోగపడతాయని గుర్తించారు అలబామా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెపోటు వల్ల కండరంలోని కొంతభాగం చచ్చుబడిపోతుందన్న విషయం తెలిసిందే. తగిన చికిత్స లేని పక్షంలో ఈ కండర భాగం కారణంగా గుండె మొత్తం ఉబ్బిపోయి సమస్య జటిలం కావచ్చు. ఈ నేపథ్యంలో అలబామా యూనివర్శిటీకి చెందిన బయో మెడికల్ ఇంజినీర్లు కొన్ని ప్రయోగాలు చేశారు. కార్డియో మయోసైట్స్ నుంచి సేకరించిన మూలకణాలను గుండె గాయం వద్ద ఇంజెక్ట్ చేసినప్పుడు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం కొంచెం పెరిగినట్లు తెలిసింది. అయితే కార్డియో మయోసైట్స్‌లో తాము అత్యంత చురుకైన, పూర్తి డీఎన్‌ఏ ఉన్న కణాలను సేకరించి వాటిద్వారా మూలకణాలను సిద్ధం చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రామస్వామి కన్నప్పన్ తెలిపారు. కణాలను వేగంగా పెంచే క్రమంలో డీఎన్‌ఏ దెబ్బతింటుందని, వీటిని గుండెపై వాడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని వివరించారు. ఇలాంటి కణాలను వదిలేసేందుకు తాము ఒక పద్ధతిని ఆవిష్కరించామని చెప్పారు. గుండెపోటుకు గురైన ఎలుకలకు సుమారు తొమ్మిది లక్షల మూలకణాలను అందించినప్పుడు నాలుగు వారాల తరువాత గుండె సామర్థ్యం పెరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment