
తల్లి అఫిదాబీ మృతదేహం వద్ద ముగ్గురు పిల్లలు
అల్గునూర్(మానకొండూర్): వారిది పేద కుటుంబం. ఇంటిపెద్ద గతంలోనే కాలం చేశాడు. తల్లి, ముగ్గురు పిల్లలు వారికున్న చిన్నపాటి ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. జాతీయరహదారికి పక్కన ఉండడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో గూడు కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో ఆ తల్లి కొద్దిరోజులుగా బెంగపెట్టుకుంది. పరిహారం వస్తుందో లేదోనని దిగాలుతో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. ఈసంఘటన తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో జరిగింది. ముగ్గురు పిల్లలను అనాథలయ్యారు..
కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
అల్గునూర్‌కు చెందిన అఫిదాబీ(43) భర్త గతంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మానసిక వికలాంగులరాలైన కూతురు ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరు కొడుకులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గతంలో కోర్టు కేసు కారణంగా అల్గునూర్‌లో ఆగిపోయిన రాజీవ్‌రహదారి విస్తరణ పనులు ఇటీవల మొదలయ్యాయి. అల్గునూర్ చౌరస్తాలో ఉన్న ఇళ్లకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం హైకోర్టులో డిపాజిట్ చేసింది. కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్లను యజమానులే కూల్చేసుకుంటున్నారు.
సొంత డబ్బులతో ఇల్లు కూల్చివేత
అఫిదాబీ కూడా సొంత డబ్బులతో ఇటీవలే ఇల్లు కూల్చివేసుకుంది. అయితే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌చారి సర్వేనంబర్ 501, 511లోని భూములు తమవే అని, వాటికి సబంధించిన పరిహారం తమకే ఇప్పించాలని గతంలోనే కోర్టులో కేసు వేశాడు. దీంతో ఇదే సర్వేనంబర్‌లో ఉన్న పలు ఇళ్ల యజమానులకు పరిహారం చెల్లింపు నిలిచిపోయింది. అఫిదాబీకి రావాల్సిన రూ.5 లక్షలు అందలేదు. ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేని అఫిదాబీ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.
కొద్దిరోజులుగా దిగాలుతో..
కోర్టు కేసు ఎప్పుడు తేలుతుంది.. పరిహారం ఎప్పుడు అందుతుందోనని కొన్నిరోజులుగా దిగాలు చెందుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలింది. తహసీల్దార్ జగత్‌సింగ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ అయిందని, బాధితులు ఆందోళన చెందొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment