విధి నిర్వహణలో గుండెపోటు వచ్చి..
చైనా బోర్డర్‌లో పోలిశెట్టి చిరంజీవి(31) విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందారు.
ఆర్మీ హవల్దార్ చిరంజీవి మృతి
సైనిక లాంఛనాలతో ఖాజీపేటలో అంత్యక్రియలు
తెనాలి టౌన్: రూరల్ మండలం ఖాజీపేటకు చెందిన ఆర్మీ హవల్దార్ పోలిశెట్టి చిరంజీవి(31) విధి నిర్వహణలో గుండెపోటుతో ఈ నెల 17న మృతి చెందారు. అగర్తల సమీపంలోని డిజాంగ్ బెటాలియన్‌లో చిరంజీవి హవల్దార్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైనా బోర్డర్‌లో పనిచేస్తుండగా ఈ నెల 17న గుండెపోటు రావడంతో తోటి సైనికులు వైద్యశాలకు తీసుకు వెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సాంబశివరావు, వెంకటరమణ దంపతులకు చిరంజీవి రెండో కుమారుడు. 2002 ఏప్రిల్‌లో ఆర్మీలో చిరంజీవి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిరంజీవి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా తెలియజేశారని, అక్కడి నుంచి మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం రాత్రి 11గంటలకు తీసుకురాగా, అక్కడి నుంచి వాహనం ద్వారా ఇక్కడికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. హవల్దార్ చిరంజీవి మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అంత్యక్రియలను శనివారం ఉదయం సైనిక లాంఛనాలతో జరిపారు. చిరంజీవి మృతదేహం వద్ద భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు.