శ్రీనివాసరెడ్డి మృతదేహానికి నివాళులర్పిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : పులివెందుల పట్టణంలో మార్చి 4వ తేదీన ఘర్షణ కేసులో నిందితుడిగా ఉండి కడప సెంట్రల్ జైలులో గుండె పోటు రావడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం మృతి చెందాడు. బుధవారం శ్రీనివాసరెడ్డి మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పుట్రాయునిపేటకు మృతదేహాన్ని తరలించారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో బుదవారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రిమ్స్‌కు చేరుకుని అధికారులు, డాక్టర్లతో మాట్లాడి పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా ముగించాలని కోరారు. స్వగ్రామానికి చేరుకున్న శ్రీనివాసరెడ్డి మృతదేహానికి కడసారిగా నివాళులర్పించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీనివాసరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి మృతి చాలా బాధాకరమని.. ఆయన మరణం కుటుంబ సభ్యులకేకాక పార్టీకి కూడా తీరని లోటు అన్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన వెంటనే తాను వచ్చి కలుస్తానని వారికి ధైర్యం చెప్పారు.
అంత్యక్రియలకు హాజరైనవైఎస్ అవినాష్‌రెడ్డి
శ్రీనివాసరెడ్డి మృతదేహానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు హాజరై శ్రీనివాసరెడ్డి మృతదేహానికి పూలమాలలు, పార్టీ కండువాలు కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని తెలిపారు.
శోకసంద్రంలో పుట్రాయునిపేట..
శ్రీనివాసరెడ్డి మృతితో పుట్రాయునిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాసరెడ్డి భార్య సరోజమ్మ, కుమారుడు గంగిరెడ్డి, కుమార్తె హేమలత తమను అనాథలను చేసి వెళ్లిపోయాడని బోరున విలపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, వేముల మండల పరిశీలకుడు రామలింగారెడ్డి, పులివెందుల కన్వీనర్ వరప్రసాద్, జిల్లా కార్యదర్శులు రసూల్, సురేష్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డి, నాయకులు ఈశ్వరరెడ్డి, వెలుగోటి శేఖరరెడ్డి, బండి రామమునిరెడ్డి, భద్రంపల్లె రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment