నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగరంలో అతిపెద్ద ప్రభుత్వాస్పత్రి అది. రోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయినా ఏం లాభం? గుండెనొప్పి వస్తే గుంటూరు ఆస్పత్రికి వెళ్లమని ఇక్కడి డాక్టర్లు ఉచిత సలహా ఇస్తారు. కార్డియాలజీ విభా గంలో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు.
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 45ఏళ్ల మహిళకు గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారికి వైద్యం అందకపోగా, ఈసీజీలో తేడా ఉంది. గుంటూరు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్‌లో గుంటూరు తీసుకెళ్లారు.
ఆటోనగర్‌లో ఉండగా లారీడ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అతనికి ఈసీజీ తీసి గుండెనొప్పి అని తేల్చారు. గుంటూరు తీసుకెళ్లాలని రిఫర్ చేయగా, చేసేది లేక నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.
నవ్యాంధ్ర రాజధాని నగరంలో వెయ్యి పడకలకు పైగా ఉన్న పెద్దాస్పత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రి. జిల్లాలోని 45 లక్షల మంది జనాభాతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం నిత్యం ఇక్కడికి వస్తుంటారు. మెరుగైన వైద్యం అందుతుందని ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తే కనీస సౌకర్యాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో వచ్చిన వారిని గుంటూరు రిఫర్ చేస్తున్నారు. కార్డియాలజీ విభాగం ఉన్నా.. కనీస సౌకర్యాలు లేక పోవడంతో వైద్యులు ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితికి చేరారు. ఒక్కో సమయంలో కనీసం ఈసీజీ తీసేవారే ఉండటం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి
ప్రభుత్వాస్పత్రిలో మూడు దశాబ్దాలుగా కార్డియాలజీ విభాగం ఉంది. కానీ, కనీస సౌకర్యాలు మాత్రం లేవు. ఒక్క 2డీ ఎకో మిషన్ మినహా ఇతర పరికరాలేవీ అందుబాటులో లేవు. రెండు నెలల్లో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య హామిఇచ్చి ఏడాదిన్నర గడిచింది. నేటికీ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఐదేళ్ల కిందట కొన్న ట్రెడ్‌మిల్ మూలనపడింది. దీంతో టీఎంటీ టెస్ట్‌చేసే అవకాశం లేకుండాపోయింది. కాగా, తొమ్మిది పడకలతో ఏర్పాటుచేసిన ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్‌లో, 17 పడకలతో ఏర్పాటుచేసిన కార్డియాలజీ వార్డులో సైతం సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుచేయాలి
గుండెజబ్బులకు గురైన వారికి చికిత్స చేసేందుకు క్యాథ్‌ల్యాబ్ పరికరం కీలకం. రక్తనాళాల్లో పూడికలను గుర్తించేందుకు, గుండె వాల్వుల పనితీరు తెలుసుకునేందుకు క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రామ్ నిర్వహిస్తుంటారు. అయితే, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి వస్తే యాంజియోగ్రామ్‌లు నిర్వహించడంతో పాటు స్టెంట్‌లు కూడా అమర్చే వీలుంటుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్లు ఉన్నా లేనట్టే..
గుండెజబ్బులకు వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో కార్డియాలజిస్టులు ఎవరూ ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపట్లేదు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వచ్చిన యువ వైద్యులు సైతం సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. అత్యాధునిక పరికరాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తే వైద్యులు సైతం ఉత్సాహంగా పనిచేస్తారని, ఏమీ లేకుండా వైద్యులు ఉండీ ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు పలుమార్లు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment