Reffering Privte Hospitals
-
సుఖ ప్రసవాలు చేయలేరా..?
చిత్తూరు అర్బన్: ‘‘ఈమె రుక్మిణి. పెద్దపంజాణి మండలంలోని గౌనివారిపల్లెకు చెందిన మణికంఠ భార్య. రుక్మిణికి పురిటినొప్పులు రావడంతో శనివారం పలమనేరులోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్తపోటు అధికంగా ఉండటంతో వైద్యులు చిత్తూరు ఆస్పత్రికి రెఫర్ చేశారు. తీరా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే గంటపాటు ఇక్కడే ఉంచుకుని పురుడుపోయడం తమవల్ల కాదంటూ అపోలో వైద్యులు తిరుపతి ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేస్తూ 108కు ఫోన్ చేశారు. వాళ్లు ఆస్పత్రికి వచ్చి పేషెంటును తీసుకెళ్లేసరికి మరో గంట అయ్యింది. రుక్మిణిని అంబులెన్సులో తరలిస్తుండగా పూతలపట్టు వద్ద నొప్పులు ఎక్కువవడంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిం చారు. ఇక్కడ రుక్మిణికి సుఖ ప్రసవమైంది. పైగా ఈమెకు ఇది ఆరో కాన్పు కావడం గమనార్హం.’’ ఏంటీ రెఫరల్స్..? రెఫరల్స్ రోగి పరిస్థితి విషయంగా ఉన్నా, ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు లేకున్నా, వైద్యులు అందుబాటులో లేకుంటే వైద్య సేవలకు విఘాతం ఏర్పడకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తుంటారు. దీన్ని వైద్య పరిభాషలో రెఫర్ చేయడం అంటుంటారు. కానీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రెఫరల్‌కు అర్థం మారిపోతోంది. దీంతో సామాన్యుడికి నాణ్యమైన వైద్యసేవలు అందడం దుర్లభంగా మారుతోంది. సహజంగా పురుడుపోయడానికి వీలున్న, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కేసుల్లో, శస్త్ర చికిత్స చేయాల్సిన సమయాల్లోనూ వైద్యులు ఎందుకు రెఫరల్‌ను వాడుతున్నారంటూ ఆస్పత్రికి వచ్చేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా.. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని గత ప్రభుత్వం 33 ఏళ్ల పాటు అపోలో వైద్య సంస్థకు లీజుకు ఇచ్చింది. అప్పటికే ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉన్నారు. అపోలో సంస్థలు వచ్చాక ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు మరిన్ని అధునాతన పరికరాలను సైతం తెప్పించారు. ఇలాంటి తరుణంలో సామాన్యులకు వైద్యం అందించడంలో కొందరు వైద్యులు తమకెందుకన్నట్లు ప్రవర్తిస్తూ రెఫరల్స్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం చేసేప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే..? ఎందుకు రిస్కు..? అంటూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెరుగుతున్న సిజేరియన్లు మరోవైపు కాన్పుల విషయంలో ప్రభుత్వాస్పత్రిలో కొందరు వైద్యుల తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెలకు ఇక్కడ సగటున 60 వరకు కాన్పులు జరుగుతుంటే 48 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మామూలుగా పురుడుపోసే అవకాశాల్లో సిజేరియన్లు, పెద్దాపరేషన్ చేసి కాన్పులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది వైద్యుల పనితీరును, అనుభవాన్ని ప్రశ్నిస్తోంది. అలాగే నవజాత శిశువుల విషయంలో సైతం పరికరాలు లేవని, ఉమ్మనీరు తాగేశారని, సీనియర్ డాక్టర్ సెలవులో ఉన్నారని చెబుతూ అధికంగా తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. ఇలాంటి కారణాలు ప్రభుత్వాస్పత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆస్పత్రిలోని లోటుపాట్లకు చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమయ్యిం దని, ఉన్నతాధికారుల ప్రమేయం అవసరమనే వాదన వినిపిస్తోంది. -
గుండెనొప్పొస్తే.. గుంటూరుకే!
నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగరంలో అతిపెద్ద ప్రభుత్వాస్పత్రి అది. రోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయినా ఏం లాభం? గుండెనొప్పి వస్తే గుంటూరు ఆస్పత్రికి వెళ్లమని ఇక్కడి డాక్టర్లు ఉచిత సలహా ఇస్తారు. కార్డియాలజీ విభా గంలో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 45ఏళ్ల మహిళకు గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారికి వైద్యం అందకపోగా, ఈసీజీలో తేడా ఉంది. గుంటూరు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్‌లో గుంటూరు తీసుకెళ్లారు. ఆటోనగర్‌లో ఉండగా లారీడ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అతనికి ఈసీజీ తీసి గుండెనొప్పి అని తేల్చారు. గుంటూరు తీసుకెళ్లాలని రిఫర్ చేయగా, చేసేది లేక నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. నవ్యాంధ్ర రాజధాని నగరంలో వెయ్యి పడకలకు పైగా ఉన్న పెద్దాస్పత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రి. జిల్లాలోని 45 లక్షల మంది జనాభాతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం నిత్యం ఇక్కడికి వస్తుంటారు. మెరుగైన వైద్యం అందుతుందని ఎన్నో ఆశలతో ఇక్కడకు వస్తే కనీస సౌకర్యాలు లేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో వచ్చిన వారిని గుంటూరు రిఫర్ చేస్తున్నారు. కార్డియాలజీ విభాగం ఉన్నా.. కనీస సౌకర్యాలు లేక పోవడంతో వైద్యులు ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితికి చేరారు. ఒక్కో సమయంలో కనీసం ఈసీజీ తీసేవారే ఉండటం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ప్రభుత్వాస్పత్రిలో మూడు దశాబ్దాలుగా కార్డియాలజీ విభాగం ఉంది. కానీ, కనీస సౌకర్యాలు మాత్రం లేవు. ఒక్క 2డీ ఎకో మిషన్ మినహా ఇతర పరికరాలేవీ అందుబాటులో లేవు. రెండు నెలల్లో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తామని వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య హామిఇచ్చి ఏడాదిన్నర గడిచింది. నేటికీ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఐదేళ్ల కిందట కొన్న ట్రెడ్మిల్ మూలనపడింది. దీంతో టీఎంటీ టెస్ట్‌చేసే అవకాశం లేకుండాపోయింది. కాగా, తొమ్మిది పడకలతో ఏర్పాటుచేసిన ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్లో, 17 పడకలతో ఏర్పాటుచేసిన కార్డియాలజీ వార్డులో సైతం సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుచేయాలి గుండెజబ్బులకు గురైన వారికి చికిత్స చేసేందుకు క్యాథ్‌ల్యాబ్ పరికరం కీలకం. రక్తనాళాల్లో పూడికలను గుర్తించేందుకు, గుండె వాల్వుల పనితీరు తెలుసుకునేందుకు క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రామ్ నిర్వహిస్తుంటారు. అయితే, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి వస్తే యాంజియోగ్రామ్‌లు నిర్వహించడంతో పాటు స్టెంట్లు కూడా అమర్చే వీలుంటుందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. డాక్టర్లు ఉన్నా లేనట్టే.. గుండెజబ్బులకు వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో కార్డియాలజిస్టులు ఎవరూ ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపట్లేదు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వచ్చిన యువ వైద్యులు సైతం సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. అత్యాధునిక పరికరాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తే వైద్యులు సైతం ఉత్సాహంగా పనిచేస్తారని, ఏమీ లేకుండా వైద్యులు ఉండీ ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు పలుమార్లు వినతిపత్రం సమర్పించారు. -
దేవుడే దిక్కు
ఈ చిత్రంలో ఉన్న గర్భిణికి నొప్పులు రావడంతో ఆదివారం రాత్రి రావికమతం పీహెచ్‌సీకి తీసుకొచ్చారు.. కనీస వైద్యమైనా చేయకుండానే.. కుట్లు వేసే దారం (త్రెడ్) లేదని నర్సీపట్నం ఆసుపత్రికి వెళ్లిపోవాలని స్టాఫ్ నర్సు సూచించారు.. నర్సీపట్నం తీసుకువెళ్లడానికి తమకు అనుమతి లేదని మాడుగులకు చెందిన 108 వాహనం సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఆ రాత్రి పూట నొప్పుల మధ్య ఆ నిండు చూలాలితో కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదన అనుభవించారు. చివరకు 108లోనే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం తరలించగా.. పురిటికి ఐదారు రోజుల సమయముందని, ఇవి ముందస్తు నొప్పులని, అక్కడి సిబ్బంది వైద్య సేవలు అందించి ఇంటికి పంపించి వేశారు. త్రెడ్ లేకపోవచ్చు.. నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి తాత్కాలిక వైద్య సేవలందించాలన్న మానవత్వం కూడా లేదా అని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట (చోడవరం): మండల శివారు గ్రామం కొండెంపూడికి చెందిన ఆది భవానీకి ఎదురైన చేదు అనుభవమిది. ఇది ఆమె ఒక్కరి ఆవేదన కాదు.. ఇటీవల ఇలాంటి సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరో గర్భిణి గోదావరిని ఈ నెల 28వ తేదీన ఇదే ఆసుపత్రికి తీసికెళ్లగా త్రెడ్ లేదన్న సాకుతో పంపించేయడంతో ఆమెను రోలుగుంట పీహెచ్సీలో చేర్చారు. అక్కడ ఆమెకు ఫ్రీ డెలివరీ అయింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఎస్.నిరీషా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రావికమతం ఆసుపత్రికి డెలీవరీకి రాగా ఆమెను కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఆమె ఫ్రీ డెలివరీ అయింది. వారం రోజుల క్రిందట మరో గర్భిణి స్త్రీని నర్సీపట్నం తీసికెళ్లిపోవాలని రావికమతం పీహెచ్సీ సిబ్బంది తెలపగా ఆమెను 108 ఎక్కించగానే డెలివరీ అయిపోయింది. దీంతో 108 సిబ్బంది ఆసుపత్రి సిబ్బందిని ఎలాగైనా కేసును తీసుకోవాలని కోరడంతో జాయిన్ చేసికొని వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో త్రెడ్ లేదన్న సాకుతో పురిటి నొప్పులతో పురిటికి వచ్చిన గర్భిణులను జాయిన్ చేసుకోకుండా దూర ప్రాంతాలకు పంపించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఆదివారం నాటి సంఘటనలపై రావికమతం వైద్యాధికారి మహేష్‌ను వివరణ కోరగా ఆపరేషన్ చేసిన తరవాత కుట్టు వేసేం దుకు వినియోగించే త్రెడ్ అయిపోవడం వాస్తవమేనని, సోమవారం తగినంత త్రెడ్‌ను తీసికొచ్చామన్నారు. తొమ్మిది గ్రాముల కన్న తక్కువ రక్తం ఉన్న పేషెంట్లను వారి ఆరో గ్యం దృష్ట్యా మాత్రమే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నామని, ఈ నెలలో నాలు గు డెలివరీలు చేశామన్నారు. 108 సిబ్బందికి ఇబ్బందులు రావికమతం, బుచ్చెయ్యపేట, మాడుగుల మూడు మండలాలకు 108 ఉంది. మూడు మండలాల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించినా మాడుగుల 108 సిబ్బంది రావల్సిందే. 108 సిబ్బందికి రావికమతం పీహెచ్సీ దాటి వెళ్లడానికి వీలు లేకపోయినా.. ఇక్కడ సిబ్బంది గర్భిణులను నర్సీపట్నం రిఫర్ చేయడంతో అదనంగా 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆసుపత్రికి చేర్చడానికి 108 సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈమధ్యలో మూడు మండలాల్లో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా వారికి 108 అందుబాటులో ఉండదు. -
ప్రైవేటు అడ్డా..!
– జిల్లా ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్న వైద్యులు, సిబ్బంది – ఉదయం 10గంటలు దాటినా ఆస్పత్రికి రాని వైద్యులు – ఆదివారం అసలే కనిపించరు?! జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసిబ్బంది తీరు రోగులకు శాపంగా మారింది. మెరుగైన వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి నిత్యం వస్తున్న వారికి వైద్యసేవలందించడంపై దష్టిపెట్టకుండా, ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అక్కడ తమసొంత క్లినిక్‌లో చికిత్స చేసి అందినకాడికి డబ్బు గుంజుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని వీరి వైద్యవ్యాపారానికి అడ్డాగా మార్చుకున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా జ్వరాలు, వివిధ వ్యాధుల విజంభించడంతో పేదలు అందుబాటులో వైద్యం లేక మహబూబ్‌నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వస్తున్నారు. జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి మరికొంత మంది రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారు. దీంతో కొన్నిరోజులుగా వెయ్యి వరకు ఓపీ నమోదవుతోంది. ఉదయం 9గంటలకు రావాల్సిన వైద్యులు మాత్రం తాపీగా 10గంటల తర్వాత కానీ విధులకు రావడం లేదు. ఆలస్యంగా వచ్చి అవసరం అయిన సమయం వరకు పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారా అంటే అదీలేదు. మధ్యాహ్నం 12గంటల ఇలా అయ్యిందంటే ఏ ఒక్కరూ కనిపించరు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉదయం పూట వైద్యం కోసం వచ్చినవారు వైద్యున్ని కలిసి ఆయన చెప్పిన వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి అందుబాటులో ఉండటంలేదు. ఈ నేపథ్యంలో రోజుల తరబడి ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కొన్నిసార్లు రోగుల ప్రాణాలమీదికి తెస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వత్తాసు.. నిత్యం వైద్యంకోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వచ్చే పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులే పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వత్తాసు పలుకుతున్నారు. వార్డుబాయ్‌లు, అంబులెన్స్ డ్రైవర్ల సాయంతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఫిర్యాదు అందితే స్పందిస్తామంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. సొంత ఆస్పత్రుకి వెళ్లాలన్న ఆత్రుతే అధికం : జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యులు సొంతంగా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి ఫోన్ వస్తే ఒక్కసెకన్ కూడా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులను పైపైన పరీక్షించి ప్రైవేటులో డబ్బుల ఆశతో వత్తికి ద్రోహం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.