రుక్మిణికి పుట్టిన బిడ్డ
చిత్తూరు అర్బన్: ‘‘ఈమె రుక్మిణి. పెద్దపంజాణి మండలంలోని గౌనివారిపల్లెకు చెందిన మణికంఠ భార్య. రుక్మిణికి పురిటినొప్పులు రావడంతో శనివారం పలమనేరులోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్తపోటు అధికంగా ఉండటంతో వైద్యులు చిత్తూరు ఆస్పత్రికి రెఫర్ చేశారు. తీరా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే గంటపాటు ఇక్కడే ఉంచుకుని పురుడుపోయడం తమవల్ల కాదంటూ అపోలో వైద్యులు తిరుపతి ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేస్తూ 108కు ఫోన్ చేశారు. వాళ్లు ఆస్పత్రికి వచ్చి పేషెంటును తీసుకెళ్లేసరికి మరో గంట అయ్యింది. రుక్మిణిని అంబులెన్సులో తరలిస్తుండగా పూతలపట్టు వద్ద నొప్పులు ఎక్కువవడంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిం చారు. ఇక్కడ రుక్మిణికి సుఖ ప్రసవమైంది. పైగా ఈమెకు ఇది ఆరో కాన్పు కావడం గమనార్హం.’’
ఏంటీ రెఫరల్స్..?
రెఫరల్స్ రోగి పరిస్థితి విషయంగా ఉన్నా, ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు లేకున్నా, వైద్యులు అందుబాటులో లేకుంటే వైద్య సేవలకు విఘాతం ఏర్పడకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారిని మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తుంటారు. దీన్ని వైద్య పరిభాషలో రెఫర్ చేయడం అంటుంటారు. కానీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రెఫరల్‌కు అర్థం మారిపోతోంది. దీంతో సామాన్యుడికి నాణ్యమైన వైద్యసేవలు అందడం దుర్లభంగా మారుతోంది. సహజంగా పురుడుపోయడానికి వీలున్న, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కేసుల్లో, శస్త్ర చికిత్స చేయాల్సిన సమయాల్లోనూ వైద్యులు ఎందుకు రెఫరల్‌ను వాడుతున్నారంటూ ఆస్పత్రికి వచ్చేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ ఉన్నా..
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని గత ప్రభుత్వం 33 ఏళ్ల పాటు అపోలో వైద్య సంస్థకు లీజుకు ఇచ్చింది. అప్పటికే ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు ఉన్నారు. అపోలో సంస్థలు వచ్చాక ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు మరిన్ని అధునాతన పరికరాలను సైతం తెప్పించారు. ఇలాంటి తరుణంలో సామాన్యులకు వైద్యం అందించడంలో కొందరు వైద్యులు తమకెందుకన్నట్లు ప్రవర్తిస్తూ రెఫరల్స్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం చేసేప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే..? ఎందుకు రిస్కు..? అంటూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పెరుగుతున్న సిజేరియన్లు
మరోవైపు కాన్పుల విషయంలో ప్రభుత్వాస్పత్రిలో కొందరు వైద్యుల తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెలకు ఇక్కడ సగటున 60 వరకు కాన్పులు జరుగుతుంటే 48 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మామూలుగా పురుడుపోసే అవకాశాల్లో సిజేరియన్లు, పెద్దాపరేషన్ చేసి కాన్పులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది వైద్యుల పనితీరును, అనుభవాన్ని ప్రశ్నిస్తోంది. అలాగే నవజాత శిశువుల విషయంలో సైతం పరికరాలు లేవని, ఉమ్మనీరు తాగేశారని, సీనియర్ డాక్టర్ సెలవులో ఉన్నారని చెబుతూ అధికంగా తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. ఇలాంటి కారణాలు ప్రభుత్వాస్పత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆస్పత్రిలోని లోటుపాట్లకు చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమయ్యిం దని, ఉన్నతాధికారుల ప్రమేయం అవసరమనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment