జిల్లా ఆస్పత్రి
ప్రైవేటు అడ్డా..!
Published Sun, Aug 28 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
– జిల్లా ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్న వైద్యులు, సిబ్బంది
– ఉదయం 10గంటలు దాటినా ఆస్పత్రికి రాని వైద్యులు
– ఆదివారం అసలే కనిపించరు?!
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యసిబ్బంది తీరు రోగులకు శాపంగా మారింది. మెరుగైన వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి నిత్యం వస్తున్న వారికి వైద్యసేవలందించడంపై దష్టిపెట్టకుండా, ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అక్కడ తమసొంత క్లినిక్‌లో చికిత్స చేసి అందినకాడికి డబ్బు గుంజుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని వీరి వైద్యవ్యాపారానికి అడ్డాగా మార్చుకున్నారు.
– మహబూబ్‌నగర్ క్రైం
రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా జ్వరాలు, వివిధ వ్యాధుల విజంభించడంతో పేదలు అందుబాటులో వైద్యం లేక మహబూబ్‌నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వస్తున్నారు. జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి మరికొంత మంది రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారు. దీంతో కొన్నిరోజులుగా వెయ్యి వరకు ఓపీ నమోదవుతోంది. ఉదయం 9గంటలకు రావాల్సిన వైద్యులు మాత్రం తాపీగా 10గంటల తర్వాత కానీ విధులకు రావడం లేదు. ఆలస్యంగా వచ్చి అవసరం అయిన సమయం వరకు పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారా అంటే అదీలేదు. మధ్యాహ్నం 12గంటల ఇలా అయ్యిందంటే ఏ ఒక్కరూ కనిపించరు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉదయం పూట వైద్యం కోసం వచ్చినవారు వైద్యున్ని కలిసి ఆయన చెప్పిన వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి అందుబాటులో ఉండటంలేదు. ఈ నేపథ్యంలో రోజుల తరబడి ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కొన్నిసార్లు రోగుల ప్రాణాలమీదికి తెస్తోంది.
కార్పొరేట్ ఆస్పత్రులకు వత్తాసు..
నిత్యం వైద్యంకోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వచ్చే పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యులే పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వత్తాసు పలుకుతున్నారు. వార్డుబాయ్‌లు, అంబులెన్స్ డ్రైవర్ల సాయంతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఫిర్యాదు అందితే స్పందిస్తామంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు.
సొంత ఆస్పత్రుకి వెళ్లాలన్న ఆత్రుతే అధికం :
జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యులు సొంతంగా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి ఫోన్ వస్తే ఒక్కసెకన్ కూడా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులను పైపైన పరీక్షించి ప్రైవేటులో డబ్బుల ఆశతో వత్తికి ద్రోహం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
Advertisement
Advertisement