త్రెడ్ లేదని నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేసిన చీటీ,రావికమతం , పీహెచ్‌సీకి వచ్చిన భవానీ
ఈ చిత్రంలో ఉన్న గర్భిణికి నొప్పులు రావడంతో ఆదివారం రాత్రి రావికమతం పీహెచ్‌సీకి తీసుకొచ్చారు.. కనీస వైద్యమైనా చేయకుండానే.. కుట్లు వేసే దారం (త్రెడ్) లేదని నర్సీపట్నం ఆసుపత్రికి వెళ్లిపోవాలని స్టాఫ్ నర్సు సూచించారు.. నర్సీపట్నం తీసుకువెళ్లడానికి తమకు అనుమతి లేదని మాడుగులకు చెందిన 108 వాహనం సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఆ రాత్రి పూట నొప్పుల మధ్య ఆ నిండు చూలాలితో కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదన అనుభవించారు. చివరకు 108లోనే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం తరలించగా.. పురిటికి ఐదారు రోజుల సమయముందని, ఇవి ముందస్తు నొప్పులని, అక్కడి సిబ్బంది వైద్య సేవలు అందించి ఇంటికి పంపించి వేశారు. త్రెడ్ లేకపోవచ్చు.. నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి తాత్కాలిక వైద్య సేవలందించాలన్న మానవత్వం కూడా లేదా అని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుచ్చెయ్యపేట (చోడవరం): మండల శివారు గ్రామం కొండెంపూడికి చెందిన ఆది భవానీకి ఎదురైన చేదు అనుభవమిది. ఇది ఆమె ఒక్కరి ఆవేదన కాదు.. ఇటీవల ఇలాంటి సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరో గర్భిణి గోదావరిని ఈ నెల 28వ తేదీన ఇదే ఆసుపత్రికి తీసికెళ్లగా త్రెడ్ లేదన్న సాకుతో పంపించేయడంతో ఆమెను రోలుగుంట పీహెచ్‌సీలో చేర్చారు. అక్కడ ఆమెకు ఫ్రీ డెలివరీ అయింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఎస్.నిరీషా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రావికమతం ఆసుపత్రికి డెలీవరీకి రాగా ఆమెను కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఆమె ఫ్రీ డెలివరీ అయింది. వారం రోజుల క్రిందట మరో గర్భిణి స్త్రీని నర్సీపట్నం తీసికెళ్లిపోవాలని రావికమతం పీహెచ్‌సీ సిబ్బంది తెలపగా ఆమెను 108 ఎక్కించగానే డెలివరీ అయిపోయింది. దీంతో 108 సిబ్బంది ఆసుపత్రి సిబ్బందిని ఎలాగైనా కేసును తీసుకోవాలని కోరడంతో జాయిన్ చేసికొని వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో త్రెడ్ లేదన్న సాకుతో పురిటి నొప్పులతో పురిటికి వచ్చిన గర్భిణులను జాయిన్ చేసుకోకుండా దూర ప్రాంతాలకు పంపించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఆదివారం
నాటి సంఘటనలపై రావికమతం వైద్యాధికారి మహేష్‌ను వివరణ కోరగా ఆపరేషన్ చేసిన తరవాత కుట్టు వేసేం దుకు వినియోగించే త్రెడ్ అయిపోవడం వాస్తవమేనని, సోమవారం తగినంత త్రెడ్‌ను తీసికొచ్చామన్నారు. తొమ్మిది గ్రాముల కన్న తక్కువ రక్తం ఉన్న పేషెంట్లను వారి ఆరో గ్యం దృష్ట్యా మాత్రమే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నామని, ఈ నెలలో నాలు గు డెలివరీలు చేశామన్నారు.
108 సిబ్బందికి ఇబ్బందులు
రావికమతం, బుచ్చెయ్యపేట, మాడుగుల మూడు మండలాలకు 108 ఉంది. మూడు మండలాల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించినా మాడుగుల 108 సిబ్బంది రావల్సిందే. 108 సిబ్బందికి రావికమతం పీహెచ్‌సీ దాటి వెళ్లడానికి వీలు లేకపోయినా.. ఇక్కడ సిబ్బంది గర్భిణులను నర్సీపట్నం రిఫర్ చేయడంతో అదనంగా 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆసుపత్రికి చేర్చడానికి 108 సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈమధ్యలో మూడు మండలాల్లో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా వారికి 108 అందుబాటులో ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment