pregnent woman problem
-
ప్రసవం అయిన మూడు రోజులకే వంశీప్రియ..
సాక్షి, జనగామ: కరోనా కాటుకు ఓ బాలింత బలైంది. ప్రసవం అయిన మూడు రోజులకే ఆమె మృత్యువాత పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జనగామకు చెందిన నిండు గర్భిణి వంశీప్రియకు నొప్పులు రావడంతో నాలుగు రోజుల క్రితం ప్రసూతి కోసం జనగామ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే, పాజిటివ్ ఉన్నందున హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడకు వెళ్లాక ప్రసవానికి సమయం ఉందంటూ ఇంటికి పంపించడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను భర్త స్వస్థలమైన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల క్రితం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే.. పరిస్థితి విషమించి ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో మూడు రోజుల క్రితం పుట్టిన పసిగుడ్డుకు తల్లి లేకుండా పోయినట్లయింది. కాగా, అంతకుముందు వారం వ్యవధిలో వంశీప్రియ అమ్మమ్మ, మేనమామ కూడా మృతి చెందారు. చదవండి: (మౌనిక ఊపిరి వదిలేసింది.. కట్టుకున్నోడూ దగ్గరకు రాలేదు) -
నాలుగురోజులుగా ప్రసవ వేదన
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి నాలుగు రోజులుగా నరకం చూపించారు జమ్మికుంట సర్కార్ దవాఖానా వైద్యులు. సాధారణ ప్రసవం కోసం అంటూ చెప్పి ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా రక్తపరీక్షలు చేసి బ్లడ్ గ్రూప్ తప్పుగా రిపోర్టు ఇచ్చారు. అనుమానం వచ్చి ప్రైవేట్ డయాగ్నోసిస్‌లో మళ్లీ పరీక్షలు చేస్తే అసలు విషయం తెలిసింది. దీంతో గర్భిణి భర్త వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన మోతె సుధాకర్–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. సుజాత గర్భం దాల్చడంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రతి నెల వైద్యసేవలు పొందుతున్నారు. ప్రసవానికి ఈనెల 22న జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో చేరింది. సుజాతను పరీక్షించిన అనంతరం రక్తం తక్కువగా ఉందంటూ సూచించారు. ఆస్పత్రి ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేసి ‘ఓ పాజిటివ్’ గ్రూప్‌గా రిపోర్టు ఇచ్చారు. ఆమె భర్త సుధాకర్ రిపోర్టుతో హన్మకొండలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లాడు. రిపోర్టు చూసిన ల్యాబ్ నిర్వాహకులు వెంట తీసుకెళ్లిన శాంపిల్బ్లడ్తో పరీక్షలు చేయగా గ్రూప్వేరేగా వచ్చింది. మళ్లీ పరీక్ష చేయించుకొని రమ్మనడంతో అనుమానం వచ్చిన సుధాకర్ జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్ష నిర్వహించాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. సుజాత బ్లడ్ గ్రూపు ‘బీ పాజిటివ్’ అని తేలింది. అంతేకాకుండా నాలుగు రోజులుగా సాధారణ ప్రసవం అవుతుందంటూ చెప్పిన వైద్యులు తీర ఆదివారం హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించారు. ఆగ్రహించిన సుధాకర్ తన భార్యకు ఇక్కడే ప్రసవం చేయాలని, పరిస్థితి విషమించాక తీసుకెళ్లాలంటే ఎట్లా..? అని ప్రశ్నించాడు. ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు సాయిని రవి ఆస్పత్రికి చేరుకొని వైద్యులను సస్పెండ్ చేయాలంటూ ధర్నాకు దిగారు. మంత్రి ఈటల రాజేందర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణిని అంబులెన్స్‌లో హన్మకొండకు తరలించారు. -
దేవుడే దిక్కు
ఈ చిత్రంలో ఉన్న గర్భిణికి నొప్పులు రావడంతో ఆదివారం రాత్రి రావికమతం పీహెచ్‌సీకి తీసుకొచ్చారు.. కనీస వైద్యమైనా చేయకుండానే.. కుట్లు వేసే దారం (త్రెడ్) లేదని నర్సీపట్నం ఆసుపత్రికి వెళ్లిపోవాలని స్టాఫ్ నర్సు సూచించారు.. నర్సీపట్నం తీసుకువెళ్లడానికి తమకు అనుమతి లేదని మాడుగులకు చెందిన 108 వాహనం సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఆ రాత్రి పూట నొప్పుల మధ్య ఆ నిండు చూలాలితో కుటుంబ సభ్యులు తీవ్రమైన వేదన అనుభవించారు. చివరకు 108లోనే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం తరలించగా.. పురిటికి ఐదారు రోజుల సమయముందని, ఇవి ముందస్తు నొప్పులని, అక్కడి సిబ్బంది వైద్య సేవలు అందించి ఇంటికి పంపించి వేశారు. త్రెడ్ లేకపోవచ్చు.. నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి తాత్కాలిక వైద్య సేవలందించాలన్న మానవత్వం కూడా లేదా అని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట (చోడవరం): మండల శివారు గ్రామం కొండెంపూడికి చెందిన ఆది భవానీకి ఎదురైన చేదు అనుభవమిది. ఇది ఆమె ఒక్కరి ఆవేదన కాదు.. ఇటీవల ఇలాంటి సంఘటనలెన్నో చోటు చేసుకున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరో గర్భిణి గోదావరిని ఈ నెల 28వ తేదీన ఇదే ఆసుపత్రికి తీసికెళ్లగా త్రెడ్ లేదన్న సాకుతో పంపించేయడంతో ఆమెను రోలుగుంట పీహెచ్సీలో చేర్చారు. అక్కడ ఆమెకు ఫ్రీ డెలివరీ అయింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ఎస్.నిరీషా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రావికమతం ఆసుపత్రికి డెలీవరీకి రాగా ఆమెను కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఆమె ఫ్రీ డెలివరీ అయింది. వారం రోజుల క్రిందట మరో గర్భిణి స్త్రీని నర్సీపట్నం తీసికెళ్లిపోవాలని రావికమతం పీహెచ్సీ సిబ్బంది తెలపగా ఆమెను 108 ఎక్కించగానే డెలివరీ అయిపోయింది. దీంతో 108 సిబ్బంది ఆసుపత్రి సిబ్బందిని ఎలాగైనా కేసును తీసుకోవాలని కోరడంతో జాయిన్ చేసికొని వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో త్రెడ్ లేదన్న సాకుతో పురిటి నొప్పులతో పురిటికి వచ్చిన గర్భిణులను జాయిన్ చేసుకోకుండా దూర ప్రాంతాలకు పంపించడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఆదివారం నాటి సంఘటనలపై రావికమతం వైద్యాధికారి మహేష్‌ను వివరణ కోరగా ఆపరేషన్ చేసిన తరవాత కుట్టు వేసేం దుకు వినియోగించే త్రెడ్ అయిపోవడం వాస్తవమేనని, సోమవారం తగినంత త్రెడ్‌ను తీసికొచ్చామన్నారు. తొమ్మిది గ్రాముల కన్న తక్కువ రక్తం ఉన్న పేషెంట్లను వారి ఆరో గ్యం దృష్ట్యా మాత్రమే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నామని, ఈ నెలలో నాలు గు డెలివరీలు చేశామన్నారు. 108 సిబ్బందికి ఇబ్బందులు రావికమతం, బుచ్చెయ్యపేట, మాడుగుల మూడు మండలాలకు 108 ఉంది. మూడు మండలాల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించినా మాడుగుల 108 సిబ్బంది రావల్సిందే. 108 సిబ్బందికి రావికమతం పీహెచ్సీ దాటి వెళ్లడానికి వీలు లేకపోయినా.. ఇక్కడ సిబ్బంది గర్భిణులను నర్సీపట్నం రిఫర్ చేయడంతో అదనంగా 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆసుపత్రికి చేర్చడానికి 108 సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈమధ్యలో మూడు మండలాల్లో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా వారికి 108 అందుబాటులో ఉండదు. -
గర్భిణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అనంతపురం మెడికల్ : 'గర్భిణి కష్టాలు' అన్న శీర్షికతో మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో ఎన్ఎస్ గేట్ హెల్త్ సూపర్వైజర్ సుధారాణి ఆస్పత్రికి వచ్చి దివ్యరూపతో మాట్లాడారు. అనంతరం గైనిక్ ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ సంధ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవిని కలిశారు. ఈ సందర్భంగా వారు గర్భిణికి ధైర్యం చెప్పారు. బిడ్డ బరువు తక్కువగా ఉందని, దీంతో రక్తం ఎక్కించాలని సూచించారు. ఇటీవల చేసిన వైద్య పరీక్షల నివేదికను పరిశీలించి వచ్చే నెలలో డెలివరీ కానున్నట్లు స్పష్టం చేశారు. రక్తం ఎక్కించిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రతి వారం రావాల్సి ఉంటుందన్నారు.