
సీట్లోనే చనిపోయిన పెద్దపసుపల బాషా
ప్రొద్దుటూరు క్రైం : త్రీడీ సినిమా చూస్తూ ఒక వ్యక్తి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన ప్రొద్దుటూరులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు శ్రీనివాసనగర్‌కు చెందిన పెద్దపసుపల బాషా (43) బేల్దారి పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతను సోమవారం సాయంత్రం సినీహబ్ థియేటర్‌లో అవేంజర్ త్రీడీ సినిమాకు వెళ్లాడు. సినిమా వదిలాక అందరూ లేచి బయటికి వెళ్తున్న సమయంలో అతను లేవకుండా సీట్లోనే ఉండిపోయాడు.
పక్కనున్న వారు ఎంత పిలిచినా లేవలేదు. వెంటనే థియేటర్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియడంతో భార్య ఖాదర్‌బీ, పిల్లలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్తకు నాలుగేళ్ల నుంచి గ్యాస్‌ట్రబుల్ మాత్రమే ఉందని, ఇతర సమస్యలు ఏవీ లేవని భార్య పోలీసులకు తెలిపింది. త్రీడీ సినిమాను అందరూ కళ్ల జోడు పెట్టుకొని చూస్తారు. అందులోని కొన్ని దృశ్యాలు మీదికి వచ్చి పడేలా ఉంటాయి. కొత్తగా త్రీడీ సినిమా చూసే వారికి కొన్ని దృశ్యాలు భయాన్ని కలిగిస్తాయి. ఈ దృశ్యాలు చూస్తూ అతను భయపడి గుండె పోటుతో చనిపోయాడా లేక సాధారణంగానే గుండె పోటు వచ్చి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment