ఎలాగ్జింతో గుండె ధైర్యం | - | Sakshi
Sakshi News home page

ఎలాగ్జింతో గుండె ధైర్యం

Published Sun, Dec 17 2023 11:56 PM | Last Updated on Mon, Dec 18 2023 12:20 PM

ఎలాగ్జిం ఇంజెక్షన్‌  - Sakshi

ఎలాగ్జిం ఇంజెక్షన్‌

పీలేరు: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ వయస్సు వారికై నా గుండెపోటు (హార్ట్‌ స్ట్రోక్‌)రావడం సర్వసాధారణంగా మారింది. సమయానికి వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గుండెపోటు వచ్చిన వారికి తక్షణ ఉపశమనం కల్పించి పెద్ద ఆస్పత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో తెచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ ప్రాజెక్టు కింద కొన్ని కొన్ని ఆస్పత్రులకు మాత్రమే ఇంజెక్షన్‌ అందుబాటులోకి తెచ్చింది.

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గుండెపోటుతో ఎవరూ మరణించరాదని, పేదలను సైతం ఆదుకోవాలని భావించి అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లోపైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేశారు. అనంతరం గుంటూరు, వైజాగ్‌ జిల్లాల్లో అమలు చేశారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ అందుబాటులో ఉంది. ఒక్క పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏడాది కాలంలో తొమ్మిది మందికి ఎలాగ్జిం ఇంజెక్షన్‌తో ప్రాణాలు కాపాడారు.

విలువైన ఇంజెక్షన్‌ ఉచితంగా అందించారు
గుండెపోటెకు గురైన నన్ను స్నేహితులు పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణ ఉపశమనం కోసం రూ. 51,669 విలువైన ఇంజెక్షన్‌ ఉచితంగా అందించారు. నా ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా.
– సురేంద్ర, పీలేరు

ఎలాగ్జింతో గంటసేపు ప్రాణాలు కాపాడవచ్చు
గుండెపోటు గురైన వారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేరాలి. ప్రభుత్వాస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ ఇవ్వ డం ద్వారా తక్షణం ప్రాణాలు కాపాడటంతోపాటు గంట సమయంలో ఉన్నతాసుపత్రికి వెళ్లడానికి రక్షణగా పని చేస్తుంది. రెండో సారి గుండెపోటు రాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్‌ డేవిడ్‌ సుకుమార్‌, డీసీహెచ్‌ఎస్‌, రాయచోటి

జగనన్నకు రుణపడి ఉంటాం
నాకు గుండెపోటు రావడంతో తక్షణం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలాగ్జిం ఇంజెక్షన్‌ ఇచ్చారు. పెద్ద ఆస్పత్రికి వెళ్లే వరకు నా ప్రాణాలు కాపాడింది. ఆస్పత్రిలో ఎలాగ్జిం ఇంజెక్షన్‌ అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం.
– మమత, పీలేరు

అవసరమనిపిస్తేనే ఇంజెక్షన్‌ వాడతాం

గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగిని పరీక్షించిన అనంతరం వారి కండీషన్‌ను బట్టి ఎలాగ్జిం ఇంజెక్షన్‌ ఇస్తాం. విలువైన ఇంజెక్షన్‌ కావడంతో వృథా చేయకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎలాగ్జిం వాడడం జరుగుతుంది.
– డాక్టర్‌ చంద్రశేఖర్‌, పీలేరు ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement