జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి

Published Thu, Feb 15 2024 1:52 AM | Last Updated on Thu, Feb 15 2024 11:38 AM

- - Sakshi

వైఎస్సార్‌ కడప: రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలో మండలానికి సంబంధించిన వైఎస్సార్‌ ఆసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలానికి సంబంధించి 524 డ్వాక్రా సంఘాలకు చెందిన 5078మంది డ్వాక్రా మహిళలకు రూ.5,24,92,136ల మెగా చెక్కును ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రార్థన చాలా మోటివేటివ్‌గా ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో అనేక సమావేశాల్లో డ్వాక్రా మహిళలు ఆ ప్రార్థనతోనే మొదలుపెడతారన్నారు. జీవితంలో వెలుగులు నింపాలని.. చీకటిని పారదోలాలని.. స్వర్గం అనేది ఎక్కడ ఉన్నా నేలపైకి తీసుకొద్దాం.. అంటూ ఎంతో ప్రేరణగా ప్రార్థన ఉంటుందన్నారు.

ఒక్కసారి ఆలోచిస్తే 2019లో జగనన్న ఎన్నికలకు వచ్చినప్పుడు 2019 ఏప్రిల్‌ నాటికి డ్వాక్రా రుణం రూ.26వేల కోట్లు ఉండేదన్నారు. ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో తీరుస్తానని.. ఆ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని జగనన్న ఆనాడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన విధంగా ఇప్పటికే మూడు విడతలుగా ఒక్కో విడత రూ.6,500కోట్లు చెల్లించారన్నారు. ఇప్పుడు నాలుగో విడతగా రూ.6,500కోట్లు చెల్లిస్తున్నారన్నారు. నిజంగా ఇది చాలా గర్వకారణమైన విషయమని అన్నారు.

ఒక్క వైఎస్సార్‌ ఆసరానే కాదు.. వైఎస్సార్‌ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రూ.3వేల పింఛన్‌ కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు కలిగేలా చేయడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఒకవైపు పవన్‌ కళ్యాణ్‌ సంతకం, మరోవైపు చంద్రబాబు సంతకాలతో ఇంటింటికి కరపత్రాలు పంచారన్నారు.

అందులో రైతుల రుణాలు, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తాం, బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలి, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఇలా అనేక హామీలతో కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. అందులో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా అమలుపరిచారా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబు మరలా ఇప్పుడు మరోసారి ష్యూరిటీ, గ్యారంటీ, వారంటీ అంటూ మరోసారి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారన్నారు.

దయచేసి ప్రజలందరూ చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని హితవు పలికారు. అనంతరం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామన్నారు. అంతకముందు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఝాన్సీరాణి, ఎంపీపీ అరుణ, మండల ఉపాధ్యక్షురాలు సుభాషిణి, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ శేఖరరెడ్డి, ఎంపీటీసీ జాఫర్‌, సర్పంచ్‌ రామ్మోహన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ సాల్మన్‌ రాజు, డీఆర్డీఏ పీడీ ఆనంద నాయక్‌, కో.ఆర్డినేటర్‌ నీలకంఠారెడ్డి, ఏపీఎంలు మంజునాథ్‌, గురురాజ్‌, ఆంజనేయులు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమాన్ని అందించారు.డీవీటీ ద్వారా రూ.203కోట్లు మండలానికి అందించగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.64కోట్లు సింహాద్రిపురం మండలానికి అందించారు. చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చేతులేత్తేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ నాలు విడత వైఎస్సార్‌ ఆసరా డబ్బులు విడుదల చేశారు. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, సింహాద్రిపురం

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళాసంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి పల్లెలో ఏర్పాటు చేసి న పాల కేంద్రాల ద్వారా మహిళలు నెలకు రూ. 4వేలు పొందుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యా నిమేటర్లకు రూ.8వేలకు జీతం పెంచారు. ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. – హేమావతి, వైఎస్సార్‌ ఆసరా లబ్ధిదారురాలు, సింహాద్రిపురం

మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు..
మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కరోనా విపత్తు సమయంలో కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజలకు అండగా ఉంటూ ఆదుకున్నారు. – ఝాన్సీరాణి, జెడ్పీటీసీ, సింహాద్రిపురం

దోచుకోవడం.. దాచుకోవడం టీడీపీ నైజం!
టీడీపీ హయాంలో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదు.సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. – రామ్మోహన్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌, సింహాద్రిపురం

ఇవి చదవండి: ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement