medal lab
-
మెడాల్.. పరీక్షలు ఢమాల్!
పేద ప్రజలకు వైద్యసేవల పేరుతో ఇప్పటికే అందినకాడికి దోచుకుంది మెడాల్ సంస్థ. ఇంకా తప్పుడు లెక్కలు చూపించి రూ.కోట్లు దోచేస్తోంది. అవసరం లేని వారికి వైద్యపరీక్షలు చేయడం ఒక ఎత్తయితే.. అసలు వైద్యపరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నుంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తోంది. గత టీడీపీ పెద్దల సహకారంతో జిల్లా అధికారులతో సంబంధం లేకుండా అడ్డగోలు దోపిడీకి తెగబడింది. దీనికి స్థానికంగా కొంతమంది వైద్యుల సహకారం తీసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోపిడీ ఇలా.. గత ఆగస్టు నెలలో 51,633 మందికి రక్తపరీక్షలు చేసినట్లు రికార్డుల్లో చూపి దాదాపు రూ.1.2 కోట్లు బిల్లుల రూపంలో ఆరగించేసింది. అలాగే గత మే నెలలో మాత్రం 68,274 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు గణాంకాలు చూపింది.. ఇలా సగటున నెలకు రూ.1.5 కోట్లు మెడాల్ సంస్థకు ముడుతోంది. సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సీహెచ్‌సీలు, మూడు ఏహెచ్‌లు, ఒక డీహెచ్ ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల ద్వారా నిత్యం సగటున 2,000 మందికి రక్తపరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మెడాల్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. మెడాల్ ల్యాబ్‌లో రోజుకు దాదాపు 850 వరకు రక్తపరీక్షల కోసం ప్రిస్క్రిప్షన్లు వస్తుంటే అందులో బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీ ఆస్పత్రి నుంచే అధికంగా రోజుకు 400లకు పైగా ప్రిస్క్రిప్షన్లు వస్తున్నాయి. బుచ్చి తర్వాత కోవూరు, అల్లీపురం, మైపాడు, జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి.. నెల్లూరు తరువాత నాయుడుపేట, గూడూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఇదే రకమైన దోపిడీ జరుగుతోందని తెలిసింది. పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏహెచ్, ఆస్పత్రుల్లో కొందరు డాక్టర్లు, కమీషన్‌కు కక్కుర్తిపడి ఈ సంస్థతో మిలాఖత్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే ఖాళీ ఓపీ చీటీలపై కొంతమంది డాక్టర్ల సంతకాలు ఉంటున్నాయన్నది బహిరంగ రహస్యం. ఫ్రాంచైజీలు తీసుకున్నది మాత్రం టీడీపీ నేతలే. గత ప్రభుత్వంలో వారు ఫ్రాంచైజీలు తీసుకుని యథేచ్ఛగా దోపిడీ చేస్తూనే ఉన్నారు. రక్త పరీక్షలు చేయకుండానే.. మెడాల్ ల్యాబ్‌లలో కొందరు టెక్నీషియన్లు రక్తపరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి టెస్ట్‌కు నెగిటివ్ అంటూ ప్రిస్క్రిప్షన్ పంపుతున్నారు. పేదలు జ్వరం అని ప్రభుత్వాస్పత్రికి వెళితే చాలు డెంగీ, ఆర్పీఆర్(రాపిడ్ ప్లాస్మా రెసెండ్), స్టూల్ టెస్ట్‌లు అధికంగా రాస్తున్నారు. వాస్తవంగా ఆ పరీక్షలు నిర్వహించే కిట్లు కూడా ఆ ల్యాబ్‌లో లేవని తెలుస్తోంది. స్టూల్ టెస్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. రోజుకు రెండు, మూడు టెస్ట్‌లు చేస్తేనే టెక్నీషియన్లు భరించలేని పరిస్థితి. కానీ రోజుకు వందల్లో నిర్వహిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఉదాహరణకు గత ఆగస్టు నెలలో డెంగీ టెస్ట్‌లు 1.46 లక్షల వరకు చేసినట్లు చూపుతున్నారు. స్టూల్ టెస్ట్‌లు మాత్రం 20 వేల వరకు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నారు. నెలకు రూ.1.5 కోట్ల దోపిడీ జిల్లాలో ఉన్న మెడాల్ సంస్థలకు దాదాపు నెలకు రూ.1.5 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో రోగి రక్తపరీక్షల కోసం రూ.235 వరకు వెచ్చిస్తున్నారు. ఇలా రోజుకు 2 వేలకు పైగా నెలకు సగటున 55 వేల టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు చూపుతున్నారు. ఒక్క రోజులో 800 మందికి రక్తపరీక్షలా! ఒక ల్యాబ్‌లో నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు రోజుకు 10 గంటలపాటు శ్రమిస్తే 50 నుంచి 60 మందికి సంబంధించిన రక్తపరీక్షలు నిర్వహించవచ్చు. అలాంటిది మెడాల్ సంస్థ ఒక్క రోజులో ఒక ల్యాబ్‌లో 800 మందికి రక్తపరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా? అంటే అవును అంటున్నాయి జిల్లాలోని మెడికల్ రికార్డులు. పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు మాత్రం పంపించేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా ఠంచన్‌గా బిల్లులు తీసుకుంటోంది. -
నీకు మేలు.. నాకు మాలు!
ప్రభుత్వాస్పత్రి వైద్యులు కాసుల కక్కుర్తితో కొత్తమార్గానికి తెరతీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ల్యాబ్‌లను మెడాల్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. తమ జేబులు నింపుకొంటూ ప్రతిఫలంగా ఈ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వైద్యులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 9వ తేదీ ఓపీలో 160 మంది రోగులు వైద్య సేవలు పొందారు.. వారిలో 110 మందికి వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు రాశారు. చందర్లపాడు పీహెచ్సీలో 100 మంది రోగులకు 66 మందికి,.. మచీలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో 255 మందికిపైగానే రక్త పరీక్షలు రాశారు.. ఆ రోజు ఒక్కరోజే జిల్లాలో 3,689 మంది రోగులకు రక్త పరీక్షలు రాశారు.. అంటే ఓపీలో నమోదైన పేషెంట్లలో 10 శాతం వరకే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రాయాల్సి ఉండగా 30 శాతంకు పైగానే రాసేశారు. ఇలా మెడాల్ సంస్థకు మేలు చేకూర్చే కార్యం గుట్టుచప్పుడుకాకుండా జరిగిపోతుండగా, వైద్యులు వివిధ రకాలుగా వారి నుంచి ప్రయోజనాలు పొందుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో మెడాల్, ప్రభుత్వ వైద్యులు కుమ్మక్కై ప్రజాధనాన్ని ఇలా లూటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో య«థేచ్ఛగా దోపిడీకి ఒడిగడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏహెచ్ ఆస్పత్రుల్లో కొందరు వైద్యులు కమీషన్‌కు కక్కుర్తిపడి ఇలా ఒక్కో రోగికి పరీక్షల సంఖ్య ఆధారంగా రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే అదునుగా చాలా మంది వైద్యులు ఓపీకి రోగులు రాకపోయినా వచ్చినట్లు పేర్లు రాసుకుంటున్నారు. ఇందుకు ఖాళీ ఓపీ చీటీలపై సంతకాలు పెట్టి ఇస్తున్నారు. కొన్నిచోట్లా డాక్టర్లు రాకపోతే వీరి స్థానంలో నర్సులు ఫోర్జరీ సంతకాలు పెడుతున్నారు. ఇలా పలు రూపాల్లో ప్రభుత్వ ధనాన్ని దోచేసుకుని తింటున్నారు. చాలా మంది మెడాల్ ల్యాబ్‌లను నిర్వహిస్తున్న వారు అధికార పార్టీ నేతలు కావడంతో జిల్లా అధికారులు కూడా నోరు మెదపలేని దయనీయ పరిస్థితి. దీంతో డాక్టర్లే ప్రిస్క్రిప్షన్కు వసూళ్లు చేస్తూ నిత్యం రూ.వేలల్లో జేబులు నింపుకుంటున్నారు. జిల్లా స్థాయిలో కూడా ఒక అధికారికి కూడా కొంత మామూళ్లు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 2,500 మందికి పైగానే.. కృష్ణా జిల్లాలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 సీహెచ్‌సీలు, 2 ఏహెచ్‌లు, 1 డీహెచ్ ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో నిత్యం సగటున 2,500 రక్త పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 9న జిల్లా వ్యాప్తంగా మెడాల్‌కు 3,689 వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాశారు. 10న పరిశీలిస్తే అవనిగడ్డలో 80, కైకలూరులో 87, గూడూరులో 49, నందిగామలో 87 వంతున పరీక్షలు రాశారు. వచ్చిన పేషెంట్లలో 30 శాతం అదనంగానే పరీక్షలు రాసినట్లుగా ఉంది. పదో తేదీ మొత్తంమీద 2,503 మందికి వివిధ టెస్ట్‌లు రాశారు. బుధవారం కూడా దాదాపు 1700 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాశారు. ఇలా రోజుకు సగటున 2,500 మందికి తగ్గకుండా పరీక్షలు ఉండేలా రాస్తున్నారు. వైద్యుల సొంత క్లినిక్‌లకు పరికరాలు మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యురాలు స్థానిక టీడీపీ ఎంపీకి సమీప బంధువు కావడంతో ఆమె ఇష్టానుసారంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయడంలో ముందువరుసలో ఉందన్న ఆరోపణలున్నాయి. మెడాల్ సంస్థ నిర్వాహకులకు ఆస్పత్రి స్కానింగ్ పరికరాలు డీలర్షిప్ ఉండడంతో ఆ వైద్యురాలి సొంత క్లినిక్‌కు పలు ఆధునిక స్కానింగ్ పరికరాలు సమకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. నూజివీడు ప్రాంతానికి చెందిన ఓ వైద్యుని సొంత క్లినిక్‌కు కూడా స్కానింగ్ పరికరాలు ఉచితంగా సమకూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడాల్ సంస్థ నిర్వాహకులకు ఆదాయం వచ్చేలా చేసి కొందరు ప్రభుత్వ వైద్యులు ఇలా సొంత ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోజుకు 15 శాతం మించకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయాలని ఆదేశాలు ఇచ్చిఉన్నాం. జిల్లాలో గంపలగూడెం, ఎ కొండూరు ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కొంతవరకు వెసులుబాటు ఇచ్చాం. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైద్యులను హెచ్చరించాం. ఈ వారం రిపోర్టులు రాగానే తప్పక వారిపై చర్యలు తీసుకుంటాం. – పద్మజారాణి,జిల్లా వైద్యాధికారిణి, కృష్ణా జిల్లా -
రోగులతో ‘మెడాల్’ చెలగాటం
డెంగీ లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన విద్యార్థి డిగ్రీ పరీక్షలు రాయలేకపోయిన వైనం పామిడి : డెంగీ లక్షణాలు లేకపోయినా ఉన్నట్టుగా మెడాల్ ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిగ్రీ పరీక్షలు రాయలేకపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన ఆంజనేయులు, అనసూయ దంపతుల కుమారుడు ఎం.అనిల్‌కుమార్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 15న ఆరోగ్యం బాగలేకపోవడంతో అనిల్‌కుమార్‌ను తండ్రి స్థానిక పామిడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ‘మెడాల్’ ఉద్యోగి రక్తపరీక్షలు చేశారు. 16వ తేదీన గుత్తిలో ఉన్న మెడాల్ ల్యాబ్ నివేదిక ప్రకారం డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించి, అనంతపురం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చారు. మరోసారి అక్కడ కూడా బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించారు. మూడురోజుల పాటు డెంగీ చికిత్స చేయించారు. ఇదే సమయంలో డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండటం వల్ల రెండు పరీక్షలకు అనిల్‌కుమార్ గైర్హాజరయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చాక పామిడి మెడాల్ వారు డెంగీ నెగటివ్ అని మరో రిపోర్టు ఇచ్చారని విద్యార్థి తండ్రి ఆంజనేయులు మంగళవారం మీడియా ఎదుట వాపోయారు. తప్పుడు రిపోర్టుతో తన కుమారుని జీవితంతో చెలగాటం ఆడడమే కాకుండా...ఇంటిల్లిపాది అనారోగ్యం పాలవడానికి కారణమైన మెడాల్ నిర్వాకంపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. రిపోర్టు నివేదించింది మేము కాదు డెంగీ నిర్ధారణకు సంబంధించి రక్తాన్ని పరీక్షల నిమిత్తం గుత్తి ల్యాబ్‌కు పంపుతాం. అక్కడి నివేదిక ఆధారంగానే మొదట్లో డెంగీ అని నిర్ధారణయ్యింది. ఆపై తదుపరి రిపోర్టు మాత్రం నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని అప్పటికప్పుడే సంబంధిత మెడాల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాం. –పామిడి మెడాల్ ఉద్యోగి నిరంజన్