మెడాల్‌.. పరీక్షలు ఢమాల్‌! | Medal Pharmaceuticals Cheating Government In Nellore | Sakshi
Sakshi News home page

సర్కార్‌ సొమ్ము హాంఫట్‌

Published Wed, Sep 18 2019 8:28 AM | Last Updated on Wed, Sep 18 2019 8:31 AM

Medal Pharmaceuticals Cheating Government In Prakasam - Sakshi

పేద ప్రజలకు వైద్యసేవల పేరుతో ఇప్పటికే అందినకాడికి దోచుకుంది మెడాల్‌ సంస్థ. ఇంకా తప్పుడు లెక్కలు చూపించి రూ.కోట్లు దోచేస్తోంది. అవసరం లేని వారికి వైద్యపరీక్షలు చేయడం ఒక ఎత్తయితే.. అసలు వైద్యపరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నుంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తోంది. గత టీడీపీ పెద్దల సహకారంతో జిల్లా అధికారులతో సంబంధం లేకుండా అడ్డగోలు దోపిడీకి తెగబడింది. దీనికి స్థానికంగా కొంతమంది వైద్యుల సహకారం తీసుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దోపిడీ ఇలా..
గత ఆగస్టు నెలలో 51,633 మందికి రక్తపరీక్షలు చేసినట్లు రికార్డుల్లో చూపి దాదాపు రూ.1.2 కోట్లు బిల్లుల రూపంలో ఆరగించేసింది. అలాగే గత మే నెలలో మాత్రం 68,274 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు గణాంకాలు చూపింది.. ఇలా సగటున నెలకు రూ.1.5 కోట్లు మెడాల్‌ సంస్థకు ముడుతోంది.

సాక్షి, నెల్లూరు:  నెల్లూరు జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సీహెచ్‌సీలు, మూడు ఏహెచ్‌లు, ఒక డీహెచ్‌ ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల ద్వారా నిత్యం సగటున 2,000 మందికి రక్తపరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మెడాల్‌ ఫ్రాంచైజీలు ఉన్నాయి. మెడాల్‌ ల్యాబ్‌లో రోజుకు దాదాపు 850 వరకు రక్తపరీక్షల కోసం  ప్రిస్క్రిప్షన్‌లు వస్తుంటే అందులో బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీ ఆస్పత్రి నుంచే అధికంగా రోజుకు 400లకు పైగా ప్రిస్క్రిప్షన్లు వస్తున్నాయి.

బుచ్చి తర్వాత కోవూరు, అల్లీపురం, మైపాడు, జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి.. నెల్లూరు తరువాత నాయుడుపేట, గూడూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఇదే రకమైన దోపిడీ జరుగుతోందని తెలిసింది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్, ఆస్పత్రుల్లో కొందరు డాక్టర్లు, కమీషన్‌కు కక్కుర్తిపడి ఈ సంస్థతో మిలాఖత్‌ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే ఖాళీ ఓపీ చీటీలపై కొంతమంది డాక్టర్ల సంతకాలు ఉంటున్నాయన్నది బహిరంగ రహస్యం. ఫ్రాంచైజీలు తీసుకున్నది మాత్రం టీడీపీ నేతలే. గత ప్రభుత్వంలో వారు ఫ్రాంచైజీలు తీసుకుని యథేచ్ఛగా దోపిడీ చేస్తూనే ఉన్నారు.

రక్త పరీక్షలు చేయకుండానే..
మెడాల్‌ ల్యాబ్‌లలో కొందరు టెక్నీషియన్లు రక్తపరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి టెస్ట్‌కు నెగిటివ్‌ అంటూ ప్రిస్క్రిప్షన్‌ పంపుతున్నారు. పేదలు జ్వరం అని ప్రభుత్వాస్పత్రికి వెళితే చాలు డెంగీ, ఆర్పీఆర్‌(రాపిడ్‌ ప్లాస్మా రెసెండ్‌), స్టూల్‌ టెస్ట్‌లు అధికంగా రాస్తున్నారు. వాస్తవంగా ఆ పరీక్షలు నిర్వహించే కిట్‌లు కూడా ఆ ల్యాబ్‌లో లేవని తెలుస్తోంది. స్టూల్‌ టెస్ట్‌ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. రోజుకు రెండు, మూడు టెస్ట్‌లు చేస్తేనే టెక్నీషియన్లు భరించలేని పరిస్థితి. కానీ రోజుకు వందల్లో నిర్వహిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఉదాహరణకు గత ఆగస్టు నెలలో డెంగీ టెస్ట్‌లు 1.46 లక్షల వరకు చేసినట్లు చూపుతున్నారు. స్టూల్‌ టెస్ట్‌లు మాత్రం 20 వేల వరకు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నారు.

నెలకు రూ.1.5 కోట్ల దోపిడీ
జిల్లాలో ఉన్న మెడాల్‌ సంస్థలకు దాదాపు నెలకు రూ.1.5 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో రోగి రక్తపరీక్షల కోసం రూ.235 వరకు వెచ్చిస్తున్నారు. ఇలా రోజుకు 2 వేలకు పైగా నెలకు సగటున 55 వేల టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు చూపుతున్నారు. 

ఒక్క రోజులో 800 మందికి రక్తపరీక్షలా!
ఒక ల్యాబ్‌లో నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు రోజుకు 10 గంటలపాటు శ్రమిస్తే 50 నుంచి 60 మందికి సంబంధించిన రక్తపరీక్షలు నిర్వహించవచ్చు. అలాంటిది మెడాల్‌ సంస్థ ఒక్క రోజులో ఒక ల్యాబ్‌లో 800 మందికి రక్తపరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా? అంటే అవును అంటున్నాయి జిల్లాలోని మెడికల్‌ రికార్డులు. పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు మాత్రం పంపించేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా ఠంచన్‌గా బిల్లులు తీసుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement