నీకు మేలు.. నాకు మాలు! | Doctors Corruption In Krishna Government Hospital | Sakshi
Sakshi News home page

నీకు మేలు.. నాకు మాలు!

Published Sat, Jul 14 2018 12:19 PM | Last Updated on Sat, Jul 14 2018 12:19 PM

Doctors Corruption In Krishna Government Hospital - Sakshi

మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాల భవనం

ప్రభుత్వాస్పత్రి వైద్యులు కాసుల కక్కుర్తితో కొత్తమార్గానికి తెరతీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ల్యాబ్‌లను మెడాల్‌ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. తమ జేబులు నింపుకొంటూ ప్రతిఫలంగా ఈ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వైద్యులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో :  పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 9వ తేదీ ఓపీలో 160 మంది రోగులు వైద్య సేవలు పొందారు.. వారిలో 110 మందికి వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు రాశారు. చందర్లపాడు పీహెచ్‌సీలో 100 మంది రోగులకు 66 మందికి,.. మచీలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో 255 మందికిపైగానే రక్త పరీక్షలు రాశారు.. ఆ రోజు ఒక్కరోజే జిల్లాలో 3,689 మంది రోగులకు రక్త పరీక్షలు రాశారు.. అంటే ఓపీలో నమోదైన పేషెంట్లలో 10 శాతం వరకే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రాయాల్సి ఉండగా 30 శాతంకు పైగానే రాసేశారు. ఇలా మెడాల్‌ సంస్థకు మేలు చేకూర్చే కార్యం గుట్టుచప్పుడుకాకుండా జరిగిపోతుండగా, వైద్యులు వివిధ రకాలుగా వారి నుంచి ప్రయోజనాలు పొందుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో మెడాల్, ప్రభుత్వ వైద్యులు కుమ్మక్కై ప్రజాధనాన్ని ఇలా లూటీ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో య«థేచ్ఛగా దోపిడీకి ఒడిగడుతున్నారు.

పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్‌ ఆస్పత్రుల్లో కొందరు వైద్యులు కమీషన్‌కు కక్కుర్తిపడి ఇలా ఒక్కో రోగికి పరీక్షల సంఖ్య ఆధారంగా రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే అదునుగా చాలా మంది వైద్యులు ఓపీకి రోగులు రాకపోయినా వచ్చినట్లు పేర్లు రాసుకుంటున్నారు. ఇందుకు ఖాళీ ఓపీ చీటీలపై సంతకాలు పెట్టి ఇస్తున్నారు. కొన్నిచోట్లా డాక్టర్లు రాకపోతే వీరి స్థానంలో నర్సులు ఫోర్జరీ సంతకాలు పెడుతున్నారు. ఇలా పలు రూపాల్లో ప్రభుత్వ ధనాన్ని దోచేసుకుని తింటున్నారు. చాలా మంది మెడాల్‌ ల్యాబ్‌లను నిర్వహిస్తున్న వారు అధికార పార్టీ నేతలు కావడంతో జిల్లా అధికారులు కూడా నోరు మెదపలేని దయనీయ పరిస్థితి. దీంతో డాక్టర్లే ప్రిస్క్రిప్షన్‌కు వసూళ్లు చేస్తూ నిత్యం రూ.వేలల్లో జేబులు నింపుకుంటున్నారు. జిల్లా స్థాయిలో కూడా ఒక అధికారికి కూడా కొంత మామూళ్లు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు 2,500 మందికి పైగానే..
కృష్ణా జిల్లాలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 సీహెచ్‌సీలు, 2 ఏహెచ్‌లు, 1 డీహెచ్‌  ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో నిత్యం సగటున 2,500 రక్త పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 9న జిల్లా వ్యాప్తంగా మెడాల్‌కు 3,689 వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాశారు. 10న పరిశీలిస్తే అవనిగడ్డలో 80, కైకలూరులో 87, గూడూరులో 49, నందిగామలో 87 వంతున పరీక్షలు రాశారు. వచ్చిన పేషెంట్లలో 30 శాతం అదనంగానే పరీక్షలు రాసినట్లుగా ఉంది. పదో తేదీ మొత్తంమీద 2,503 మందికి వివిధ టెస్ట్‌లు రాశారు. బుధవారం కూడా దాదాపు 1700 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాశారు. ఇలా రోజుకు సగటున 2,500 మందికి తగ్గకుండా పరీక్షలు ఉండేలా రాస్తున్నారు.

వైద్యుల సొంత క్లినిక్‌లకు పరికరాలు
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యురాలు స్థానిక టీడీపీ ఎంపీకి సమీప బంధువు కావడంతో ఆమె ఇష్టానుసారంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయడంలో ముందువరుసలో ఉందన్న ఆరోపణలున్నాయి. మెడాల్‌ సంస్థ నిర్వాహకులకు ఆస్పత్రి స్కానింగ్‌ పరికరాలు డీలర్‌షిప్‌ ఉండడంతో ఆ వైద్యురాలి సొంత క్లినిక్‌కు పలు ఆధునిక స్కానింగ్‌ పరికరాలు సమకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. నూజివీడు ప్రాంతానికి చెందిన ఓ వైద్యుని సొంత క్లినిక్‌కు కూడా స్కానింగ్‌ పరికరాలు ఉచితంగా సమకూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడాల్‌ సంస్థ నిర్వాహకులకు ఆదాయం వచ్చేలా చేసి కొందరు ప్రభుత్వ వైద్యులు ఇలా సొంత ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోజుకు 15 శాతం మించకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయాలని ఆదేశాలు ఇచ్చిఉన్నాం. జిల్లాలో గంపలగూడెం, ఎ కొండూరు ప్రాంతాల్లో  ప్రజల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కొంతవరకు వెసులుబాటు ఇచ్చాం.  గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైద్యులను హెచ్చరించాం. ఈ వారం రిపోర్టులు రాగానే తప్పక వారిపై చర్యలు తీసుకుంటాం.
– పద్మజారాణి,జిల్లా వైద్యాధికారిణి, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement