గుత్తి : అదనపు వరకట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్తకు యేడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రుపాయల జరిమానా విధిస్తూ గుత్తి జేఎఫ్‌సీఎం( జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్) వెంకటేశ్వర నాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. గుత్తి కోట వీధికి చెందిన అరుణకు, పామిడి మండలం ఎద్దుల పల్లికి చెందిన గడ్డం మోహన్‌గౌడ్‌తో 2010 లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.లక్ష , 8 తులాల బంగారు కట్నంగా ఇచ్చారు.
పెళ్లైన తర్వాత యేడాదికే అదనపు కట్నం కావాలని మోహన్ గౌడ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. విసిగిపోయిన అరుణ పామిడి పోలీసు స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు గుత్తి జేఎఫ్‌సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. మోహన్‌గౌడ్ నేరం చేశాడని తేలడంతో జడ్జి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ సంగీత వాదించారు.
ఆటో డ్రైవర్‌కు రెండున్నరేళ్లు..
కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఐదు మంది మృతికి కారకుడైన ఆటో డ్రైవర్ ఎర్రిస్వామికి రెండన్నర ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి నాగరాజ మంగళవారం తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ ఎస్‌ఐ శంకర్‌రెడ్డి విలేకరులకు తెలియజేశారు. 2012 జూన్ నెల 16వ తేదిన ఆటోడ్రైవర్ ఎర్రిస్వామి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. ఆటో బస్సును ఢీకొనడంతో ఐదుమంది మృతి చెందారు. అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ ఎర్రిస్వామి నిర్లక్ష్యమే ఐదుమందిని బలిగొందని ఆధారాలు రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
వరకట్న వేధింపుల కేసులో ఏడాది జైలు
Published Wed, Aug 31 2016 12:28 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement
Advertisement