one year prison
-
తల్లి, ఆమె ప్రియుడికి ఏడాది జైలు
నెల్లూరు, గూడూరు: ప్రియుడి మోజులో పడిన ఓ తల్లి కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని అడ్డు తొలగించుకునేందుకు చిత్రహింసలకు గురిచేసిన ఘటన కేసులో ఆమెకు, ఆమెకు సహకరించిన ప్రియుడికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం గూడూరు ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె జయలక్ష్మి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం పొదలకూరుకు చెందిన వరలక్ష్మి మూడు వివాహాలు చేసుకుని అందరితో తెగతెంపులు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు మగబిడ్డ కలిగాడు. ఒంటరిగి ఉంటున్న ఆమెకు 2017లో అదే ప్రాంతానికి చెందిన వేలు మురుగన్‌తో స్నేహం ఏర్పడి, అతనితో సహజీవనం చేస్తోంది. అయితే అతను ఇంటికి వచ్చి పోయే సమయంలో తన ఆరేళ్ల కొడుకు అడ్డుగా ఉండడంతో వరలక్ష్మి, వేలుమురుగన్ ఆ బాలుడ్ని చిత్రహింసలకు గురిచేయడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక బాలుడు కేకలు వేస్తుండడాన్ని గుర్తించిన అమ్మమ్మ కల్లూరు రమణమ్మ, తన కుమార్తె వరలక్ష్మి, వేలుమురుగన్‌పై పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్‌ను గూడూరు కోర్టులో దాఖాలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు పైమేరకు శిక్ష, జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సుకుమార్ వాదించారు. -
మోసగత్తెకు ఏడాది జైలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : ఓమహిళ ఘరానా మోసానికి న్యాయస్థానం సంకెళ్లేసి జైలుకు పంపింది. ఏడాది శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు. గోపాలపట్నంకు చెందిన బర్రి సరోజని ఎల్లపువానిపాలేనికి చెందిన ప్రమీలాదాస్ అనే గృహిణికి పరిచయమైంది. తనకు సర్వే నెంబరు 104లో ప్లాట్ ఉందని, దీన్ని రూ.8.18లక్షలకు అమ్ముతానని చెప్పడంతో ప్రమీలాదాస్ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. సరోజని ఆ మొత్తాన్ని తీసుకొని ఆమె ఇంట్లో నెలకు నాలుగువేల చొప్పున ఇస్తానని అద్దెకు దిగింది. ఆ మొత్తం తీసుకున్న మూడు నెలల తర్వాత బండారం బయటపడింది. ఆమె మోసకారి అని తేలింది. ప్రమీలాదాస్ కొన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తావా ... మాడబ్బులు మాకివ్వు...ఇల్లు ఖాళీ చేయ్..అంటే ఇపుడు రెండూ జరగవని మోసకారి మహిళ చెప్పడంతో బాధితురాలు 2012లో గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్పటి సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి సరోజనిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఏపీపీ కె.సుధారాణి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. సోమవారం రెండో మెట్రోపాలిటిన్ కోర్టు న్యాయమూర్తి సమ్మిపర్విన్‌సుల్తానాబేగం తీర్పునిచ్చారు. ఏడాది జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ ఆదేశించారు. -
వ్యభిచార గృహం నిర్వాహకురాలికి ఏడాది జైలు
విశాఖ లీగల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళకు ఏడాది జైలు, వెయ్యి రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.వెంకటరమణా రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి సన్యాసిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు జి.మధు(41) వన్‌టౌన్ ప్రాంతంలోని సున్నపు వీధిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆమె మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేది. వారిని మాయమాటలతో వ్యభిచారం ఉచ్చులోకి దించేది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించిన వన్‌టౌన్ పోలీసులు 2013, ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు. నిందితురాలిపై వ్యభిచార నియంత్రణ చట్టం ఐపీసీ సెక్షన్3, 4, 7ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు
గుంతకల్లు రూరల్ : మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు, రూ.వంద జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి వాసుదేవరావ్ శుక్రవారం తీర్పును వెలువరించారు. ఇందుకు సంబంధించి కసాపురం ఎస్ఐ సద్గురుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015 సెప్టెంబర్ 4న గుంతకల్లు పట్టణానికి చెందిన భారతి స్థానిక కసాపురం రోడ్డు సమీపంలోని సిద్ధార్థ నగర్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర ఎర్రిస్వామి, ఉప్పర. హనుమంతు అనే ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైకుపై వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. ఈ ఘటనలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అదే ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రెండు సంవత్సరాల విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలుశిక్షతోపాటు, వంద రూపాయల జరిమానను విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి తీర్పును వెలువరించారు. -
నిందితుడికి ఏడాది జైలు శిక్ష
గుంతకల్లు టౌన్ : రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్‌లకు నిప్పు పెట్టిన కేసులో కేరళకు చెందిన జాన్సన్ పౌల్ అనే నిందితుడికి ఏడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం వాసుదేవరావు గురువారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు. గుంతకల్లు భాగ్యనగర్‌లో గత ఏడాది నవంబర్ 7న పార్కింగ్ చేసిన బైక్‌లను తగులబెట్టిన కేసులో అతనిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి పై విధంగా తీర్చుచెప్పారన్నారు. -
వరకట్న వేధింపుల కేసులో ఏడాది జైలు
గుత్తి : అదనపు వరకట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్తకు యేడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రుపాయల జరిమానా విధిస్తూ గుత్తి జేఎఫ్‌సీఎం( జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్) వెంకటేశ్వర నాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. గుత్తి కోట వీధికి చెందిన అరుణకు, పామిడి మండలం ఎద్దుల పల్లికి చెందిన గడ్డం మోహన్‌గౌడ్‌తో 2010 లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.లక్ష , 8 తులాల బంగారు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన తర్వాత యేడాదికే అదనపు కట్నం కావాలని మోహన్ గౌడ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. విసిగిపోయిన అరుణ పామిడి పోలీసు స్టేషన్లో భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు గుత్తి జేఎఫ్‌సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. మోహన్‌గౌడ్ నేరం చేశాడని తేలడంతో జడ్జి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ సంగీత వాదించారు. ఆటో డ్రైవర్‌కు రెండున్నరేళ్లు.. కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఐదు మంది మృతికి కారకుడైన ఆటో డ్రైవర్ ఎర్రిస్వామికి రెండన్నర ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి నాగరాజ మంగళవారం తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ ఎస్ఐ శంకర్‌రెడ్డి విలేకరులకు తెలియజేశారు. 2012 జూన్ నెల 16వ తేదిన ఆటోడ్రైవర్ ఎర్రిస్వామి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. ఆటో బస్సును ఢీకొనడంతో ఐదుమంది మృతి చెందారు. అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ ఎర్రిస్వామి నిర్లక్ష్యమే ఐదుమందిని బలిగొందని ఆధారాలు రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.