పామిడిలో వీధులు జలమయం
- ఇళ్లలో చేరిన నీరు
- నీటమునిగిన పంటలు
- దంచేసిన వాన
పామిడి: ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన వరుణుడు ఒక్కసారిగా తన ఉగ్రరూపం చూపాఽడు. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం కురిసినా...పామిడి మండలంలో మాత్రం దంచేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకూ ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో 70 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన వెంగమనాయుడుకాలనీ, చైతన్యకాలనీ, వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ, సీఎస్‌ఐ చర్చీవీధి జలమయమయ్యాయి. వెంగమనాయుడుకాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీకే ఆదినారాయణరెడ్డి కాలనీ ప్రధాన రోడ్డులో వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే స్థానిక టీసీ హైస్కూల్ ఆవరణలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
నేలకూలిన ఇళ్లు
మండలంలో కురిసిన భారీ వర్షానికి ఖాదర్‌పేట, పి.కొత్తపల్లి గ్రామాల్లో మూడు ఇళ్లు నేలకూలాయి. కాలువలు, కుంటలు పొంగిపొర్లాయి. ప్రధానవీధులు జలమయం కావడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నీట మునిగిన పంటలు
భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. మండలంలోని నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్ వద్ద గల ఓ డిగార్డిగేటర్‌లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్‌లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఆర్.బాలాజీరాజు పరిశీలించారు.