తెల్లారిన బతుకు
- కూలి పనులకు సైకిల్‌పై బయలుదేరిన దంపతులు
- వేగంగా వచ్చి ఢీకొన్న బస్సు
- రోడ్డుపైనే మాంసపు ముద్దలా మిగిలిన భార్య
- భర్తకు తీవ్ర గాయాలు
-------------------------------------------------------------------
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఒక రోజు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి.. వచ్చే అరకొర సంపాదనతోనే పిల్లలను చదివించుకుంటున్నారు. తెలవారక ముందే కూలి పనులకు వెళ్లడం ఆ దంపతులకు అలవాటు. రోజులాగే గురువారం తెల్లవారుజామున సైకిల్‌పై దంపతులిద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో వేగంగా ఎదురొచ్చిన ఓ బస్సు ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే రోడ్డుపై మాంసపు ముద్దలా మిగలగా, భర్త త్రుటిలో తప్పించుకున్నాడు.
- పామిడి
-----------------------------------------------------------
పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత రంగమ్మ(36) రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడగా, ఆమె భర్త మేకల పెద్దసుంకన్న తీవ్రంగా గాయపడ్డారని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వారిద్దరూ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైకిల్‌పై ఇటుకల బట్టీ వద్ద పనుల కోసం బయలుదేరారు. బైపాస్‌లోని హనుమాన్ లింకురోడ్డు జంక‌్షన్ వద్దకు రాగానే సైకిల్‌ను బట్టీల వైపునకు తిప్పారు.
దూసుకొచ్చిన మృత్యువు
అంతలోనే ఊహించని రీతిలో అనంతపురం నుంచి గుత్తి వైపునుక విపరీతమైన వేగంతో వచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొనడంతో సైకిల్ తునాతునకలు కాగా, వెనకాల కూర్చున్న రంగమ్మ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆమె భర్త పెద్దసుంకన్న డివైడర్‌పై ఎగిరిపడి సృహ కోల్పోయాడు. ప్రమాదంలో అతని ఎడమకాలుకూ గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతురాలికి కుమార్తె దస్తగిరమ్మ(డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది), కుమారుడు వసంతకుమార్(పామిడిలోని టీసీ హైస్కూల్‌లో ఆరో తరగతి చదవుతున్నాడు) ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.