మన్యంలో కొండెక్కని అక్షరం! | Many Tribal Children Are Far Away From School Education | Sakshi
Sakshi News home page

కొండెక్కని అక్షరం!

Published Tue, Jun 11 2019 12:26 PM | Last Updated on Tue, Jun 11 2019 12:30 PM

Many Tribal Children Are Far Away From School Education  - Sakshi

మన్యంలో చదువుకు దూరమైన చిన్నారులు

సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్‌ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. 

గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు.


అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు  

దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు.

అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు.

విద్యార్థులపై వివక్ష
మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్‌ (టీడబ్ల్యూ) మండల పరిషత్‌ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్‌ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్‌ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు.

దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్‌ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్‌ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది  పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement