గిరిజనులకు రుణాలు | Loans Released For Tribals Area Warangal | Sakshi
Sakshi News home page

గిరిజనులకు రుణాలు

Published Wed, Sep 19 2018 12:18 PM | Last Updated on Mon, Sep 24 2018 1:19 PM

Loans Released For Tribals Area Warangal - Sakshi

ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం

ఏటూరునాగారం(వరంగల్‌): చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందకుండా తాత్సారం చేస్తూ బ్యాంకు అధికారులు ట్రైకార్‌ లక్ష్యాన్ని నీరు గారుస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్‌ నుంచి నేరుగా రూ.50 వేల రుణాన్ని వంద శాతం సబ్సిడీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా గిరిజనులు వాటా ధనం, రుణం కిస్తీలు చెల్లించడం ఉండదు. ఈ మేరకు సెప్టెంబర్‌ 16న ఐటీడీఏకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 2018–19 ట్రైకార్‌ వార్షిక యాక్షన్‌ ప్లాన్‌ను ఐటీడీఏ అధికారులు సిద్ధం చేసి కమిషనర్‌కు అందించనున్నారు. గతంలో యాక్షన్‌ ప్లాన్‌ రూ.1 లక్ష, రూ.50 వేల సబ్సిడీతో కూడిన రుణాల వివరాలు, పలు రకాల యూనిట్లతో తయారు చేసిన నివేదికను అందజేశారు. నూతనంగా రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ వేసేందుకు ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మళ్లీ యాక్షన్‌ ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపించారు.
 
నిరుపేదల్లో వెలుగులు
రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ రుణం నిరుపేదల్లో వెలుగు నింపనుంది. గిరిజనుడి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ అయిన వెంటనే వాటిని డ్రా చేసుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. గతంలో బ్యాంకు వాటా ధనం 20 శాతం, లబ్ధిదారుడి వాటా ధనం 10 శాతం జమ చేసుకుని బ్యాంకు చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగిపోయినా కూడా రుణం వచ్చేది కాదు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ల వారీగా సబ్సిడీలను అందజేసింది. రూ.50 వేల వరకు వందశాతం సబ్సిడీని అమలు చేస్తూ మిగతా వాటి రుణాలను యథావిధిగా అమలు చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుడు ఎంపీడీఓ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఐటీడీఏ లాగిన్‌లోకి వచ్చి కలెక్టర్‌ అప్రూవల్‌తో కమిషనర్‌ నుంచి ట్రైకార్‌ ద్వారా నగదు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వంద శాతం సబ్సిడీతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే గిరిజనులకు ఎంతగానో ఆసరాగా నిల్వనుంది.

మొత్తం 1325 యూనిట్లకు రూ. 22,64,00,759 మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇందులో ఉన్న సెక్టార్ల వారీగా రూ.50 వేలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి రుణాలు మంజూరవుతాయి.

అసెంబ్లీ రద్దుతో ఆలస్యం 
అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలను పొందే లబ్ధిదారులు అక్టోబర్‌లో లేదా ఎన్నికల పర్వం పూర్తి అయిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2018లో దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఖాతాల్లో మాత్రమే రుణాలు జమ అయ్యాయి. వాటిని పూర్తిగా లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే 2018–19 రుణాల దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రుణాలకు యుటిలైజ్‌ సర్టిఫికెట్‌ (యూసీ)లు కూడా ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంత మంది రుణాలు సద్వినియోగం చేసుకున్నారని కమిషనర్‌ నిర్ధారించనున్నారు.
 
100 శాతం సబ్సిడీతో లాభం
100 శాతం సబ్సిడీపై రూ.50 వేల రుణాలు ఇవ్వడం వల్ల గిరిజన కుటుంబాలు బాగుపడుతాయి. ఇంటి ఆవరణలోనే షాపులను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆస్కారం ఉంటుంది. రుణాలను ఈ విధంగా ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. బ్యాంకులతో లింక్‌ పెడితే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి చేరకుండానే దళారులు మింగుతున్నారు. వంద శాతం సబ్సిడీ గిరిజనులకు ఉపయోగపడనుంది. లం ప్రభాకర్, రాజన్నపేట, కన్నాయిగూడెం మండలం 

సద్వినియోగం చేసుకోవాలి..
కొత్తగా ప్రవేశపెట్టిన 100 శాతం రూ.50 వేల రుణం గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. దాంతో కుటుంబాలు బాగుపడుతాయి. బ్యాంకు వాటాతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ఈ రుణం ఇవ్వనున్నాం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు అందిస్తాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చక్రధర్‌రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement