![Free Education For 170 Tribal Children In Mulugu District - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/21/19MUL105-330120_1_5.jpg.webp?itok=efwwQKJ0)
విద్యార్థులకు చదువు చెబుతున్న సంతోష్
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఆ యువకులిద్దరూ అడవిలోనే పుట్టారు. ఆ ప్రాంత పిల్లలకు చదువు ఎంత దూరమో, చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో వారికి తెలుసు. విద్యతోనే తమవారి జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని గట్టిగా నమ్మారు. గిరిజన గూడేల్లోనే పెరిగి ఇప్పుడు ఉన్నత చదువుల్లో ఉన్న ఆ ఇద్దరు.. తామే చదువును ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. గిరిజన గూడేలను దత్తత తీసుకుని సొంతంగా పాఠశాలలను నడిపిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ పిల్లలకు ఉచితంగా అక్షరాలు నేర్పిస్తున్నారు. వీరికి కొందరు దాతలు చేయూతనిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన ఇస్రం సంతోష్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో జర్నలిజం పూర్తిచేసిన రేగొండ మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన దూడపాక నరేష్‌లు కలిసి గొత్తికోయగూడేల్లోని పిల్లల్లో అక్షరజ్ఞానం పెంపొందించేందుకు ముందడుగు వేశారు.
చదువుతో పాటు ఆట పాటలు
అటవీ ప్రాంతంలోని నీలంతోగు, ముసులమ్మపేట, సారలమ్మ గుంపు, కాల్వపల్లి గొత్తికోయ గూడేల్లో ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటాపురం మండలం బడ్లపాడు గొత్తికోయగూడెంలో మరో పాఠశాల నడుపుతున్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు ప్రైవేటు టీచర్లతో పాటు వారి బాగోగులు చూసేందుకు ఆయాలను నియమించారు.
ఒక్కో టీచర్‌కు నెలకు రూ.7 వేల వేతనంగా చెల్లిస్తుండగా, ఆయాలకు రూ.1,000 ఇస్తున్నారు. ఆరు పాఠశాలల్లో మొత్తం 170 మంది పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్య సూత్రాలను నేర్పిస్తున్నారు. పాఠశాలకు రాని ఆదివాసీ గొత్తికోయ పిల్లలను చదువు వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలను కూడా నేర్పిస్తున్నారు.
అండగా నిలుస్తున్న దాతలు
ఆదివాసీ గూడేల్లో శుభ్రత ఉండదు. తరచూ రోగాలపాలవుతుంటారు. దీనికితోడు పోషకాహార లోపం. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లల పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో కూడా నేర్పిస్తున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని ప్రతిరోజూ కోడిగుడ్డు, గ్లాస్ పాలు అందిస్తున్నారు. రెండు రోజులకోసారి పల్లీ పట్టీలను స్నాక్‌గా ఇస్తున్నారు.
ఇవన్నీ వీరు ఉచితంగానే చేస్తుండటం గమనార్హం. ఇస్రం సంతోష్, నరేష్‌లు గొత్తికోయగూడేల్లో పాఠశాలలను నడుతుపుతున్న విషయం తెలుసుకుని ఇద్దరు దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు. ఎస్‌సీఈ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గోపాలకృష్ణ, అస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తరుణ్‌లు ప్రతినెలా సాయం అందజేస్తున్నారు.
విద్యతోనే జీవితాల్లో మార్పు
విద్యతోనే జీవితాలు మారతాయి. ఎక్కడో అడవిలో ఉండే గూడేల్లో చదువు ఇప్పటికీ అందని ద్రాక్షే. మాలా ఇబ్బందులు పడకూడదని, ఆదివాసీ గొత్తికోయ పిల్లలకు గూడేల్లో విద్య నేర్పించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. తొలుత ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని గొత్తికోయగూడేల్ని సందర్శించి అధ్యయనం చేశాం. మొదట్లో ఒకటి, రెండు పాఠశాలలను నడిపించాం. ప్రస్తుతం ఆరు గూడేల్లో నడుపుతున్నాం. మారుతున్న సమాజంలో పోటీ ఇవ్వాలంటే చదువుతోనే సా«ధ్యమతుంది. టీచర్ల బృందం సమన్వయంతో పాఠశాలలను నడిపిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని పాఠశాలలతో మరింత మంది గొత్తికోయ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం.
– ఇస్రం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment