అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు.
‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది.
అరటితోటల్లోకి..
మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్‌ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను.
క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను.
రాఖీతో మొదలు...
నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను.
తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్‌నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి.
వంద రకాలు..
ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది.
శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment