essential items
-
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి -
వలస కార్మికులకు 12 వస్తువులు
సాక్షి, మహారాణిపేట: లాక్డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు 12 రకాల నిత్యావసర సరకులు అందజేయనున్నట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి తదితర ప్రాంతాల్లో 12 వేల మంది వలస కార్మికులను గుర్తించామని వెల్లడించారు. వీరికి గురువారం నుంచి ప్యాకింగ్ చేసిన 12 రకాల సరకులు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 10 కిలోల బియ్యం, ఐదు కిలోల చొప్పున గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, రెండు కిలోల చొప్పున కందిపప్పు, కిలో చొప్పున ఉప్పు, నూనె, పంచదార, పావు కిలో కారం, చింతపండు, 100 గ్రాముల పసుపు, 200 గ్రాముల టీ పొడితో 20 వేల ప్యాకింగ్‌లు సిద్ధం చేశామన్నారు. గ్రామీణులకూ పరీక్షలు: కేజీహెచ్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా అనుమానితులకు పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. నర్సీపట్నం, అనకాపల్లిలో ట్రూ నైట్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ఫలితం గ్రీన్ వస్తే కేజీహెచ్‌కు పంపిస్తామన్నారు. నర్సీపట్నం కేంద్రం పరిధిలో నర్సీపట్నం, పాడేరు, అరకు, యలమంచలి.. అనకాపల్లి పరిధిలో అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు వస్తాయన్నారు. కేజీహెచ్‌లో కరోనా నిర్ధారిత పరీక్షల సామర్థ్యం రోజుకు వంద నుంచి 450కు పెంచుతామని, పలు రకాలైన కిట్లు వస్తే రోజుకు 700 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనల అమలుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మినహాయింపులు వర్తించవని స్పష్టం చేశారు. 10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: రబీలో పండించిన వరి, మొక్కజోన్న కొనుగోలు కోసం ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. 10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేయనున్నట్టు చెప్పారు. మొక్కజోన్న కొనుగోలుకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ పంటలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఏజెన్సీలో 12 వేల ఎకరాల్లో కాఫీ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కూలీలకు ఇబ్బంది లేకుండా ఉపాధి పనులు కలి్పస్తున్నామన్నారు. ఉపాధి పనుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్ సమయంలో కంపెనీలు, షాపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారి్మకులకు జీతాలు చెల్లించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి రోడ్డు, నీటి పారుదల ప్రాజెక్టులు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు చేపట్టవచ్చన్నారు. ఐటీ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చన్నారు. ఆస్పత్రులు, వాటికి సంబంధించిన సరీ్వసులు ప్రారంభించవచ్చని.. మినహాయింపులు ఉన్న చోట తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ కూలీల అడ్డగింత మాధవధార కల్యాణ మండపంలోని షెల్టర్‌కు తరలింపు విశాఖపట్నం: లాక్డౌన్ కారణంగా ఆటోనగర్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో జార్ఖండ్‌కు చెందిన 22 మంది కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనమవ్వగా.. మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఊళ్లకు పంపించాలని కార్మికులు కోరగా.. వారిని నిలువరించి మాధవధారలోని నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. ఆటోనగర్‌లో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ ద్వారా ఆన్‌షోర్ కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఫిబ్రవరిలో జార్ఖండ్ నుంచి పలువురు కార్మికులు విశాఖకు వచ్చారు. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో పనులు నిలిచిపోయాయి. పోలీసులు అడ్డుకోవడంతో కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కూర్చున్న కార్మికులు గత నెల 23 నుంచి కార్మికులు ఆటోనగర్‌లో తాత్కాలిక షెడ్లలోనే ఉన్నారు. వీరిని తీసుకువచ్చిన కాంట్రాక్టర్ భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 14తో లాక్డౌన్ ముగుస్తుందని భావించినప్పటికీ.. కేంద్రం మరో 19 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇక్కడ ఉండడం కన్నా, తమ ఇళ్లకు వెళ్లిపోవాలని భావించిన 22 మంది బుధవారం కాలినడకన జార్ఖండ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు వారిని గమనించి అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. తమను ఇళ్లకు పంపించాలని కార్మికులు పోలీసులను వేడుకున్నారు. అయితే పోలీసులు వారిని నిలువరించి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులకు ఈ సమాచారం చేరవేశారు. అనంతరం వారిని మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. -
కంటైన్మెంట్ జోన్లలో కొనసాగుతున్న ఆంక్షలు..
సాక్షి, విశాఖపట్నం: కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విశాఖ జిల్లాలో గుర్తించిన ఏడు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కయ్యపాలెం, తాడిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి తదితర ప్రాంతాలలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కంటైన్మెంట్ జోన్ లో నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఉన్న 19 సచివాలయాల సెక్రటరీలు, సుమారు 250 మంది వాలంటీర్లను ప్రత్యేక బృందాలుగా నియమించారు. ప్రతీ బృందానికి ఇన్చార్జి గా సిఐ వ్యవహరించనున్నారు. ప్రతీ టీంలో 15 నుంచి 20 మంది వాలంటీర్లు ఉంటారు. కంటైన్మెంట్ జోన్లలో 19 బృందాలకు ద్వారా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు బయటకి రావొద్దని.. ఇంటికే సరుకులు అందిస్తామని ఎస్పీ రవికుమార్ విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో 136 మంది.. విశాఖ జిల్లాలో వివిధ క్వారంటైన్ కేంద్రాలలో 136 మంది ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. భీమిలి లో ఒకరు, యలమంచిలిలో 34 మంది, అరకులో 10, విశాఖపట్నం రైల్వే ఆసుపత్రిలో 44, గాజువాకలో 23, పాడేరులో 24 మంది ఉన్నారని చెప్పారు. జిల్లాలో 96 కేంద్రాలలో 4,623 క్వారంటైన్ పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కంట్రోల్ రూమ్‌కు 19 ఫోన్ కాల్స్.. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్ కు శుక్రవారం 19 ఫోన్ కాల్స్ వచ్చాయని డిసివో ఎన్.డి. మిల్టన్ తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్సు కావాలని కొంతమంది ఫోన్ చేయగా ఫీల్డ్ సర్వైలెన్స్ బృందానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనాకు సంబంధించి 825 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. -
పేదలకు నిత్యావసరాలు పంపిణి
-
ఈ గాయాలకు సాయమేది?
తల్లి గర్భంలోనుంచి బయటకు వచ్చిన పసిగుడ్డు బయటి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేదాకా ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. చలిగాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి వాతావరణ పరిస్థితిలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పుట్టాడు ఈ పసికందు. తలదాచుకునే గూడు వరదల తాకిడికి నేలమట్టమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో బయట చల్లగాలిలో ఉంచలేక, లోపల పునరావాస కేంద్రాల్లో తలదాచుకోలేక నానాఅవస్థలు పడిన ఈ కుటుంబానికి ట్రాక్టర్ ట్రాలే ఆవాసమైంది. ట్రాలీకే రెండు కర్రలు కట్టి, వాటిపై ఓ పట్టా కప్పి అందులోనే ఆ శిశువును ఉంచుతున్నారు. ఆ కట్టెలకే ఊయల కట్టి నిద్రపుచ్చుతున్నారు. ట్రాలీలోనే స్టవ్ పెట్టి నీళ్లు వేడిచేసి ఆ పసికందుకు స్నానం చేయిస్తున్నారు. సరే.. ఇప్పుడంటే వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. అవి పూర్తిగా తగ్గిపోయాక ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? పుట్టిన పసిగుడ్డుకు తలదాచుకునే గూడేది? ఇదే ప్రశ్న ఈ కుటుంబాన్ని అడిగితే .. ఎలా బతకాలో తెలియక బోరుమంటున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నిండా మునిగింది. భారీఎత్తున చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వందలాది నివాసాలు నేలకూలాయి. జిల్లావ్యాప్తంగా 45 వేల కుటుంబాలు వీధినపడ్డాయి.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం నుంచి సాయమందడంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. కనీసం తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో చక్కెర, లీటరు పామాయిల్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినా.. ఇంతవరకూ అందలేదు. కొన్నిప్రాంతాల్లో ఒకరికిస్తే మరొకరికి ఇవ్వడంలేదు. వరద బియ్యాన్ని దాచేశారు వరద ముప్పు నుంచి బాధితులను కాపాల్సింది పోయి.. కొందరు టీడీపీ నాయకులు నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి కొందరు రేషన్ డీలర్లు తోడవ్వటంతో నిత్యావసర సరుకులు మరెక్కడికో తరలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బాధితులకు చేరలేదు. పంపిణీ చేసిన కొన్ని ప్రాంతాల్లో సగం మందికి పంపిణీ చేసి.. మిగిలిన సగం సరుకును దాచేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటారట! అందుకు నెల్లూరు నగరం 17వ డివిజన్లో చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనం. ఇక్కడ బాధితుల కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు డీలరు, అధికారులు, స్థానిక నాయకులు కాలనీకి వచ్చారు. అయితే అక్కడివారిలో తమకు అనుకూలంగా నడుచుకుంటున్న వారికి, బంధువులు, తెలిసిన వారికి రేషన్‌కార్డు లేకపోయినా ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, వారు అడిగినంత చక్కెర, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు సరఫరా చేశారు. ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ కూడా స్పష్టం చేశారు. సగంమందికి మాత్రమే పంపిణీ చేసి.. వచ్చింది అంతే అంటూ వెళ్లిపోయారని చెప్పారు. ఈ విషయమై తహశీల్దార్‌ను సంప్రదించగా .. ‘తగిన చర్యలు తీసుకుంటామ’ంటూ షరామామూలు సమాధానమే వచ్చింది. ఇది ఒక్క నెల్లూరు నగరంలోనే కాదు జిల్లావ్యాప్తంగా.. గూడూరు, వెంకటగిరి, కోవూరు, సూళ్లూరుపేట, పొదలకూరు, సర్వేపల్లి, ఆత్మకూరు పరిధిలో జరుగుతున్న పంపిణీల్లోని అవకతవకలని బాధితుల కథనం తూకాల్లోనూ తేడా...: వరద బాధితులకు ఇవ్వాల్సిన సాయాన్ని కొందరు రాబందులు బొక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిత్యావసరకుల్లో నుంచి కొంత తీసి పక్కనపెట్టేశారు. ఇందుకు మంత్రి పరిటాల సునీత ఆకస్మిక తనిఖీలో వెలుగుచూసిన వాస్తవాలే నిదర్శనం. నగరంలోని కొత్తూరు, పొదలకూరు రో డ్డు, పద్మావతి సెంటర్ పరిధిలోని రేషన్ దుకాణాలను మంత్రి తనిఖీ చేశారు. అందులో సరుకులకు సంబంధించిన రికార్డులు లేకపోవటం... తూకాల్లో తేడా కనిపించింది. దీంతో ఆయా డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా వరద సాయంలో కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి తెలిపింది. తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు: బంగాఖాతంలో శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ డెరైక్టర్ స్టెల్లా శనివారం ప్రకటించారు. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని ఆమె వెల్లడించారు. కాగా, ఇటీవల తమిళనాడులో కురిసిన వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య శనివారానికి 230కి చేరింది. -
రాకపోకలు బంద్
* ప్రవేశ పన్నుతో తెలంగాణ, ఏపీ మధ్య స్తంభించిన రవాణా * ఆగిపోయిన సరుకులు, నిత్యావసర వస్తువులు * నిలిచిపోయిన ఇసుక, సిమెంట్, ఇటుకల రవాణా భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం * మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే పనులన్నీ ఆగిపోయినట్లే! * ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సుల్లో తగ్గుదల.. కోర్టు మధ్యంతర * ఉత్తర్వులతో రోడ్డెక్కిన కొన్ని బస్సులు పన్ను మోతను ప్రజలపైనే వేస్తున్న * నిర్వాహకులు.. 30 శాతం వరకూ చార్జీల పెంపు * పన్నుపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన చేస్తామంటున్న లారీ యజమానుల సంఘాలు సాక్షి, హైదరాబాద్: వాహనాలపై ప్రవేశ పన్ను విధింపు ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలు ఆగిపోయాయి. నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, పూలు, తమలపాకులు, పప్పు దినుసులు వంటి నిత్యావసరాల రవాణాపైనా దీని ప్రభావం పడింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే ఇటుక, ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపైనా ప్రభావం పడింది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే నిర్మాణాల పనులు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు తరలించే ఇసుక, ఐరన్, సిమెంట్ తదితర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని భవన నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ప్రవేశ సుంకం విధింపు నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. దీనికితోడు నిర్వాహకులు చార్జీలను భారీగా పెంచేయడంతో... ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ప్రవేశ పన్నును వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని తెలంగాణ లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. బస్సులన్నీ బంద్..: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు ప్రయాణీకుల బస్సులు నిత్యం 600 వరకూ వస్తుంటాయి. జీవో అమల్లోకి వచ్చిన మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ బస్సులన్నీ ప్రవేశపన్ను చెల్లించాల్సి రావడంతో... 90 శాతానికిపైగా ఏపీలోనే నిలిచిపోయాయి. దీంతో రోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే 50 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా... అవి ప్రయాణికుల అవసరాలు తీర్చడం లేదు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వెయ్యి వరకూ రవాణా వాహనాలు వస్తుంటాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పాలు, కూరగాయలు, సిమెంట్, ఇతర నిత్యావసర వస్తువులను, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిగడ్డను హైదరాబాద్‌కు రవాణా చేస్తుంటాయి. కానీ ప్రవేశ సుంకం కారణంగా మంగళ, బుధవారాల్లో 25 నుంచి 30 శాతం రవాణా వాహనాలు మాత్రమే నడిచాయి. మోత మోగిస్తున్న ఆపరేటర్లు ప్రవేశ పన్ను నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు చార్జీలు పెంచేసి, భారాన్ని ప్రజలపైకి నెట్టేశారు. ప్రభుత్వం విధించిన పన్ను ప్రకారం 50 సీట్లున్న బస్సుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 1.83 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే పన్ను చెల్లించిన ఆపరేటర్లు ఇక నుంచి.. రెండు రాష్ట్రాల్లో సీటుకు రూ. 3,675 చొప్పున కట్టాల్సిందే. ఇందుకు అనుగుణంగానే ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, కడప, బెంగళూరు తదితర ప్రాంతాలకు రోజూ 600కు పైగా ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. అదే పండుగలు, వేసవి సెలవుల వంటి రద్దీ రోజుల్లో ఈ సర్వీసులు రెట్టింపవుతాయి. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రైవేటు ఆపరేటర్లు తరచుగా చార్జీల్లో మార్పులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్ను దృష్ట్యా చార్జీలను ఒక్కసారిగా పెంచేశారు. ఇవి ముందు ముందు ఇంకా అవ కాశం కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 450 చార్జీ ఉండగా.. దానిని రూ. 600కు పెంచేశారు. వైజాగ్ వెళ్లడానికి ఇటీవలి వరకు రూ. 850గా ఉన్న చార్జీ ఇప్పుడు రూ. 1,050కి పెరిగింది. తిరుపతికి రూ. 650 నుంచి రూ. 830కి పెంచారు. ప్రజలపై తీవ్ర భారం.. ‘‘ఇప్పటివరకు 23 జిల్లాల్లో సరుకు రవాణా చేస్తూ ఉపాధిని పొందుతున్నాం. పన్ను విధింపు వల్ల తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇది మా ఉపాధికి పెద్ద దెబ్బ. అక్కడి వాహనాలు కూడా 13 జిల్లాలకే పరిమితమవుతాయి. రెండు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు వల్ల ఆ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే రూ. 40 కోట్ల ఆదాయం కంటే ప్రజలపై పడే రూ. 400 కోట్ల భారం గురించి ఆలోచించాలి. ఏపీ వాహనాలపై పన్ను విధిస్తూ విడుదల చేసిన జీవో 15ను వెంటనే రద్దుచేయాలి. లేదంటే మా ఆందోళనను ఉధృతం చేస్తాం..’’ - ఎన్.భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం వెనుకా ముందూ ఆలోచించరా? ‘‘వాహనాలపై పన్ను కేసును హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా హామీ పత్రాలు ఇచ్చి రాకపోకలు సాగించవచ్చని చెప్పింది. తుది తీర్పు కూడా మాకే అనుకూలంగా వస్తుందన్న నమ్మకం ఉంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఏ అవసరమొచ్చినా ఏపీ ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిందే కదా. వెనుకాముందు ఆలోచించకుండా పన్ను విధించడం వల్ల భారం పడేది ప్రజలపైనే.. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా..?’’ - సుభాష్ చంద్రబోస్, ప్రైవేట్ ఆపరేటర్ల సంఘం