తల్లి గర్భంలోనుంచి బయటకు వచ్చిన పసిగుడ్డు బయటి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేదాకా ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. చలిగాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి వాతావరణ పరిస్థితిలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పుట్టాడు ఈ పసికందు. తలదాచుకునే గూడు వరదల తాకిడికి నేలమట్టమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో బయట చల్లగాలిలో ఉంచలేక, లోపల పునరావాస కేంద్రాల్లో తలదాచుకోలేక నానాఅవస్థలు పడిన ఈ కుటుంబానికి ట్రాక్టర్ ట్రాలే ఆవాసమైంది.
ట్రాలీకే రెండు కర్రలు కట్టి, వాటిపై ఓ పట్టా కప్పి అందులోనే ఆ శిశువును ఉంచుతున్నారు. ఆ కట్టెలకే ఊయల కట్టి నిద్రపుచ్చుతున్నారు. ట్రాలీలోనే స్టవ్ పెట్టి నీళ్లు వేడిచేసి ఆ పసికందుకు స్నానం చేయిస్తున్నారు. సరే.. ఇప్పుడంటే వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. అవి పూర్తిగా తగ్గిపోయాక ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? పుట్టిన పసిగుడ్డుకు తలదాచుకునే గూడేది? ఇదే ప్రశ్న ఈ కుటుంబాన్ని అడిగితే .. ఎలా బతకాలో తెలియక బోరుమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నిండా మునిగింది. భారీఎత్తున చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వందలాది నివాసాలు నేలకూలాయి. జిల్లావ్యాప్తంగా 45 వేల కుటుంబాలు వీధినపడ్డాయి.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం నుంచి సాయమందడంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. కనీసం తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో చక్కెర, లీటరు పామాయిల్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినా.. ఇంతవరకూ అందలేదు. కొన్నిప్రాంతాల్లో ఒకరికిస్తే మరొకరికి ఇవ్వడంలేదు.
వరద బియ్యాన్ని దాచేశారు
వరద ముప్పు నుంచి బాధితులను కాపాల్సింది పోయి.. కొందరు టీడీపీ నాయకులు నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి కొందరు రేషన్ డీలర్లు తోడవ్వటంతో నిత్యావసర సరుకులు మరెక్కడికో తరలిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు బాధితులకు చేరలేదు. పంపిణీ చేసిన కొన్ని ప్రాంతాల్లో సగం మందికి పంపిణీ చేసి.. మిగిలిన సగం సరుకును దాచేస్తున్నారు.
తగిన చర్యలు తీసుకుంటారట!
అందుకు నెల్లూరు నగరం 17వ డివిజన్‌లో చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనం. ఇక్కడ బాధితుల కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు డీలరు, అధికారులు, స్థానిక నాయకులు కాలనీకి వచ్చారు. అయితే అక్కడివారిలో తమకు అనుకూలంగా నడుచుకుంటున్న వారికి, బంధువులు, తెలిసిన వారికి రేషన్‌కార్డు లేకపోయినా ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, వారు అడిగినంత చక్కెర, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు సరఫరా చేశారు. ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ కూడా స్పష్టం చేశారు. సగంమందికి మాత్రమే పంపిణీ చేసి.. వచ్చింది అంతే అంటూ వెళ్లిపోయారని చెప్పారు.
ఈ విషయమై తహశీల్దార్‌ను సంప్రదించగా .. ‘తగిన చర్యలు తీసుకుంటామ’ంటూ షరామామూలు సమాధానమే వచ్చింది. ఇది ఒక్క నెల్లూరు నగరంలోనే కాదు జిల్లావ్యాప్తంగా.. గూడూరు, వెంకటగిరి, కోవూరు, సూళ్లూరుపేట, పొదలకూరు, సర్వేపల్లి, ఆత్మకూరు పరిధిలో జరుగుతున్న పంపిణీల్లోని అవకతవకలని బాధితుల కథనం
తూకాల్లోనూ తేడా...: వరద బాధితులకు ఇవ్వాల్సిన సాయాన్ని కొందరు రాబందులు బొక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిత్యావసరకుల్లో నుంచి కొంత తీసి పక్కనపెట్టేశారు. ఇందుకు మంత్రి పరిటాల సునీత ఆకస్మిక తనిఖీలో వెలుగుచూసిన వాస్తవాలే నిదర్శనం. నగరంలోని కొత్తూరు, పొదలకూరు రో డ్డు, పద్మావతి సెంటర్ పరిధిలోని రేషన్ దుకాణాలను మంత్రి తనిఖీ చేశారు. అందులో సరుకులకు సంబంధించిన రికార్డులు లేకపోవటం... తూకాల్లో తేడా కనిపించింది. దీంతో ఆయా డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా వరద సాయంలో కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి తెలిపింది. తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు: బంగాఖాతంలో శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ డెరైక్టర్ స్టెల్లా శనివారం ప్రకటించారు. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని ఆమె వెల్లడించారు. కాగా, ఇటీవల తమిళనాడులో కురిసిన వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య శనివారానికి 230కి చేరింది.