కలెక్టర్ వినయ్‌చంద్
సాక్షి, మహారాణిపేట: లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు 12 రకాల నిత్యావసర సరకులు అందజేయనున్నట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి తదితర ప్రాంతాల్లో 12 వేల మంది వలస కార్మికులను గుర్తించామని వెల్లడించారు. వీరికి గురువారం నుంచి ప్యాకింగ్ చేసిన 12 రకాల సరకులు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 10 కిలోల బియ్యం, ఐదు కిలోల చొప్పున గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, రెండు కిలోల చొప్పున కందిపప్పు, కిలో చొప్పున ఉప్పు, నూనె, పంచదార, పావు కిలో కారం, చింతపండు, 100 గ్రాముల పసుపు, 200 గ్రాముల టీ పొడితో 20 వేల ప్యాకింగ్‌లు సిద్ధం చేశామన్నారు.
గ్రామీణులకూ పరీక్షలు: కేజీహెచ్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా అనుమానితులకు పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. నర్సీపట్నం, అనకాపల్లిలో ట్రూ నైట్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ఫలితం గ్రీన్ వస్తే కేజీహెచ్‌కు పంపిస్తామన్నారు. నర్సీపట్నం కేంద్రం పరిధిలో నర్సీపట్నం, పాడేరు, అరకు, యలమంచలి.. అనకాపల్లి పరిధిలో అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు వస్తాయన్నారు.
కేజీహెచ్‌లో కరోనా నిర్ధారిత పరీక్షల సామర్థ్యం రోజుకు వంద నుంచి 450కు పెంచుతామని, పలు రకాలైన కిట్లు వస్తే రోజుకు 700 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనల అమలుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ మినహాయింపులు వర్తించవని స్పష్టం చేశారు.
10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: రబీలో పండించిన వరి, మొక్కజోన్న కొనుగోలు కోసం ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. 10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేయనున్నట్టు చెప్పారు. మొక్కజోన్న కొనుగోలుకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ పంటలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఏజెన్సీలో 12 వేల ఎకరాల్లో కాఫీ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కూలీలకు ఇబ్బంది లేకుండా ఉపాధి పనులు కలి్పస్తున్నామన్నారు. ఉపాధి పనుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో కంపెనీలు, షాపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారి్మకులకు జీతాలు చెల్లించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి రోడ్డు, నీటి పారుదల ప్రాజెక్టులు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు చేపట్టవచ్చన్నారు. ఐటీ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చన్నారు. ఆస్పత్రులు, వాటికి సంబంధించిన సరీ్వసులు ప్రారంభించవచ్చని.. మినహాయింపులు ఉన్న చోట తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జార్ఖండ్ కూలీల అడ్డగింత
మాధవధార కల్యాణ మండపంలోని షెల్టర్‌కు తరలింపు
విశాఖపట్నం: లాక్‌డౌన్ కారణంగా ఆటోనగర్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో జార్ఖండ్‌కు చెందిన 22 మంది కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనమవ్వగా.. మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఊళ్లకు పంపించాలని కార్మికులు కోరగా.. వారిని నిలువరించి మాధవధారలోని నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. ఆటోనగర్‌లో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ ద్వారా ఆన్‌షోర్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఫిబ్రవరిలో జార్ఖండ్ నుంచి పలువురు కార్మికులు విశాఖకు వచ్చారు. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో పనులు నిలిచిపోయాయి.
పోలీసులు అడ్డుకోవడంతో కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కూర్చున్న కార్మికులు
గత నెల 23 నుంచి కార్మికులు ఆటోనగర్‌లో తాత్కాలిక షెడ్లలోనే ఉన్నారు. వీరిని తీసుకువచ్చిన కాంట్రాక్టర్ భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 14తో లాక్‌డౌన్ ముగుస్తుందని భావించినప్పటికీ.. కేంద్రం మరో 19 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇక్కడ ఉండడం కన్నా, తమ ఇళ్లకు వెళ్లిపోవాలని భావించిన 22 మంది బుధవారం కాలినడకన జార్ఖండ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు వారిని గమనించి అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. తమను ఇళ్లకు పంపించాలని కార్మికులు పోలీసులను వేడుకున్నారు. అయితే పోలీసులు వారిని నిలువరించి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులకు ఈ సమాచారం చేరవేశారు. అనంతరం వారిని మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment